Fake News, Telugu
 

పాత వీడియో పెట్టి, ‘తమిళనాడు చర్చిలో నాటు బాంబులు – క్రైస్తవులు అరెస్ట్’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

0

తమిళనాడు లోని ఒక చర్చిలో వందలాది క్రైస్తవులు నాటు బాంబులు తయారుచేసి, హిందువులను చంపాలని క్రైస్తవ మాఫియా పెద్ద కుట్ర పన్నింది. తమిళనాడు పోలీసులు విషయాన్ని పసిగట్టి వందలాది క్రైస్తవ దేశద్రోహులను అరెస్ట్ చేస్తున్న దృశ్యం’, అని చెప్తూ ఒక వీడియోని కొంత మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తమిళనాడు లోని ఒక చర్చిలో నాటు బాంబులు తయారు చేస్తున్నారని వందలాది క్రైస్తవులను పోలీసులు అరెస్ట్ చేస్తున్న వీడియో. 

ఫాక్ట్: పోస్ట్ లోని వీడియో పాతది. వీడియోలోని ఘటన 2008 లో జరిగింది. వీడియోలో ఉన్నది పెర్మన్నూర్ (కర్ణాటక) లో ఉన్న సెయింట్ సెబాస్టియన్ చర్చి. ఆ ఘటన పై జస్టిస్ సోమశేఖర ఇచ్చిన రిపోర్ట్ లో ఆ చర్చిలో నాటు బాంబులు తయారు చేస్తున్నారని లేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే వీడియోకి సంబంధించిన మంచి క్వాలిటీ మరియు పూర్తి వీడియో సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ వీడియో పెర్మన్నూర్ (కర్ణాటక) కి సంబంధించింది అని రాసి ఉన్నట్టు చూడవొచ్చు. పోస్ట్ లోని వీడియోని చూపిస్తూ ‘అల్ జజీరా’ వార్తాసంస్థ వారు 2008 లో పెట్టిన వీడియోని ఇక్కడ చూడవొచ్చు. వీడియోలో ఉన్నది సెయింట్ సెబాస్టియన్ చర్చి అని కొందరు 2008లో పెట్టిన వీడియోని ఇక్కడ చూడవొచ్చు. కావున, పోస్ట్ లోని వీడియో పాతది, వీడియోలోని ఘటన ఈ మధ్య జరగలేదు.

అంతేకాదు, పెర్మన్నూర్ (కర్ణాటక) లో ఉన్న సెయింట్ సెబాస్టియన్ చర్చి ఫోటోలు చూడగా, వీడియోలో ఉన్నది ఆ చర్చి యే అని తెలుస్తుంది. కాబట్టి, పోస్ట్ లో చెప్పినట్టు వీడియో తమిళనాడు కి సంబంధించింది కాదు. 

సెప్టెంబర్ 2008 లో కర్ణాటకలోని వివిధ చర్చిలపై జరిగిన దాడులకు సంబంధించి జస్టిస్ సోమశేఖర కమిషన్ ని ప్రభుత్వం నియమించింది. జస్టిస్ సోమశేఖర ఇచ్చిన రిపోర్ట్ లో సెయింట్ సెబాస్టియన్ చర్చి ఘటన కి సంబంధించి ఇచ్చిన నివేదికని ఇక్కడ చదవొచ్చు. జస్టిస్ సోమశేఖర రిపోర్ట్ మరియు 2008 ఘటనల పై వివిధ వర్గాల వాదనలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవొచ్చు.

చివరగా, పాత వీడియో పెట్టి, ‘తమిళనాడు చర్చిలో నాటు బాంబులు – క్రైస్తవులు అరెస్ట్’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు. వీడియోలో ఉన్నది పెర్మన్నూర్ (కర్ణాటక) లో ఉన్న సెయింట్ సెబాస్టియన్ చర్చి.

Share.

About Author

Comments are closed.

scroll