Fake News, Telugu
 

ఈ వీడియోలో హిందూ నిరసనకారులకి మద్దతు తెలుపుతున్న వ్యక్తి భారతీయ జర్నలిస్ట్ రోహిత్ శర్మ, పాకిస్తాన్ జర్నలిస్ట్ కాదు

0

కర్ణాటక మాండ్య కాలేజీలో ముస్లిం విద్యార్థిని ముస్ఖాన్ ఖాన్‌ను కొంత మంది హిందూ యువకులు ‘జై శ్రీ రాం’ నినాదాలతో చుట్టుముట్టడం, దానికి ఆమె ‘అల్లా హు అక్బర్’ అని ప్రతిస్పందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం మనకందరికీ తెలుసు. హిజాబ్ వివాదానికి ప్రధాన బిందువుగా నిలిచిన ఈ ఘటనలో ముస్లిం మహిళను ‘జై శ్రీ రాం’ నినాదాలతో చుట్టుముట్టిన హిందూ యువకులను పాకిస్తాన్ టివీ విశ్లేషకులు ప్రశంసిస్తున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఈ ఘటనలో ముస్లిం మహిళ పథకం ప్రకారమే హిందూ వర్గానికి వ్యతిరేకంగా ‘అల్లా హు అక్బర్’ నినాదాలు చేసిందని పాకిస్తాన్ విశ్లేషకులు చర్చించినట్టు పోస్టులో తెలుపుతున్నారు. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కర్ణాటక మాండ్య కాలేజీ ఘటనలో హిందూ యువకులు మంచివారని పాకిస్తాన్ జర్నలిస్టులు ప్రశంసిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో మాట్లాడుతున్న ఆర్జూ కాజ్మి పాకిస్తాన్ దేశానికి చెందిన జర్నలిస్ట్ అన్న మాట వాస్తవం. కాని, ఈ వీడియోలో పాకిస్తానిగా తెలుపుతున్న వ్యక్తి భారతీయ జర్నలిస్ట్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ, మాండ్య కాలేజీలో జరిగిన ఘటన గురించి ఆర్జూ కాజ్మితో మాట్లాడుతూ, వందల మంది హిందూ నిరసనకారుల మధ్య ఆ ముస్లిం అమ్మాయి ‘అల్లా హు అక్బర్’ నినాదాలు చేసినప్పటికీ, వారు ఆమెని ఏమీ చేయలేదని, ఈ విషయం ముందుగా గ్రహించే ఆ అమ్మాయి ధైర్యంగా ‘అల్లా హు అక్బర్’ నినాదాలు చేసిందని తెలిపారు. ఈ ఘటన ఆధారంగా ముస్లింలు భారత దేశంలో ఎంత సురక్షితంగా ఉన్నారో అంచనా వేయవచ్చని రోహిత్ శర్మ ఆర్జూ కాజ్మితో తెలిపారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు దోవ పట్టించేలా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియోలో, మహిళా జర్నలిస్ట్ పేరు ఆర్జూ కాజ్మి అని తెలిపారు. ఈ వీడియోకి సంబంధిచిన పూర్తి సమాచారం కోసం ఇంటర్నెట్లో వెతికితే, ఆర్జూ కాజ్మి, పాకిస్తాన్ దేశానికి చెందిన ఒక జర్నలిస్ట్ అని తెలిసింది. పోస్టులో షేర్ చేసిన ఇంటర్వ్యూ యొక్క పూర్తి వీడియోని ఆర్జూ కాజ్మి 09 ఫిబ్రవరి 2022 నాడు తన యూట్యూబ్ ఛానల్లో షేర్ చేసింది. ఈ వీడియోలో హిజాబ్ వివాదానికి సంబంధించి తనతో పాటు చర్చిస్తున్నది భారతీయ జర్నలిస్ట్ రోహిత్ శర్మ అని ఆర్జూ కాజ్మి వీడియోలో తెలిపారు. ఆర్జూ కాజ్మి ఈ ఇంటర్వ్యూలో కర్ణాటక హిజాబ్ వివాదానికి ప్రధాన బిందువుగా నిలిచిన మాండ్య కాలేజీ ఘటన గురించి రోహిత్ శర్మతో చర్చించారు.  

రోహిత్ శర్మ, తను గత 20 సంవత్సరాలుగా ప్రముఖ భారతీయ వార్తా సంస్థలలో జర్నలిస్టుగా పనిచేసినట్టు తన ట్విట్టర్ మరియు యూట్యూబ్ ఛానెల్ బయోలో తెలిపారు. రోహిత్ శర్మ తన ‘India Matters with Rohit Sharma’ యూట్యూబ్ ఛానెల్లో రాజకీయాల గురించి, ప్రస్తుత హిజాబ్ వివాదానకి సంబంధించిన చాలా వీడియోలని పోస్ట్ చేసారు. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. రోహిత్ శర్మ, కర్ణాటక మాండ్య కాలేజీలో జరిగిన ఘటన గురించి ఆర్జూ కాజ్మితో మాట్లాడుతూ, “వందల మంది హిందూ నినాదకారుల మధ్య ఆ ముస్లిం అమ్మాయి ‘అల్లా హు అక్బర్’ నినాదాలు చేసినప్పటికీ, వారు ఆమెని ఏమి చేయలేదు. హిందూ వర్గం యువకులు దాడి చేయలేదు కాబట్టి ఆమెని షేరిని అని పిలుస్తున్నారు, ఒకవేళ వారు దాడి చేసి ఉంటే, ఆమె భాదితురాలిగా సానుభూతి పొందేది. రెండు విధాలుగా ఆమెనే లబ్ది పొందేది. ఈ విషయం ముందుగా గ్రహించే ఆ అమ్మాయి ధైర్యంగా ‘అల్లా హు అక్బర్’ నినాదాలు చేసింది. ఒకవేళ ఇది పథకం ప్రకారం జరిగిన ఘటన కాకపోతే , దీన్ని బట్టి, ముస్లింలు భారత దేశంలో ఎంత సురక్షితంగా ఉన్నారో స్పష్టంగా తెలుస్తుంది”, అని అన్నాడు.

అంతేకాదు, హిందూ యువకులు మాండ్య కాలేజీలో చుట్టుముట్టిన ముస్ఖాన్ ఖాన్, బురఖ ధరించకుండా ఉన్న చిత్రాలంటూ ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఫోటోలని షేర్ చేసారు. కాని, ఈ ఫోటోలలో కనిపిస్తున్నది ముస్ఖాన్ ఖాన్ కాదు, కర్ణాటక జేడిఎస్ పార్టీ సభ్యురాలు నజ్మా నజీర్. సోషల్ మీడియాలో నజ్మా నజీర్ ఫోటోలని ఇటీవల ముస్ఖాన్ ఖాన్ చిత్రాలుగా సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, ఫ్యాక్ట్‌లీ దానికి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్ కూడా పబ్లిష్ చేసింది.

చివరగా, హిజాబ్ వివాదానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిన మాండ్య కాలేజీ ఘటనలో హిందూ వర్గానికి మద్దతు తెలుపుతున్న ఈ వ్యక్తి భారత జర్నలిస్ట్ రోహిత్ శర్మ, పాకిస్తాన్ జర్నలిస్ట్ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll