Fake News, Telugu
 

సంబంధం లేని పాత వీడియోని పాలస్తీనా ప్రజలు నకిలీ గాయాలతో ప్రపంచాన్ని మోసం చేస్తున్నారని షేర్ చేస్తున్నారు

0

హమాస్ ఉగ్రవాద సంస్థ సామాన్య ప్రజలకి రంగులద్ది ఇజ్రాయెల్ దాడిలో గాయపడిన పాలస్తీనా ప్రజలుగా  ప్రపంచానికి చూపుతుంది, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఇజ్రాయిల్ దేశం చర్యలని ప్రపంచానికి తప్పుగా చూపెట్టే క్రమంలో హమాస్ ఉగ్రవాద సంస్థ ఇలా పాలస్తీనా ప్రజలకు నకిలీ గాయాల మేకప్ చేసినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. పాలస్తీనా- ఇజ్రాయిల్ మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకుంటున్న ప్రస్తుత నేపథ్యంలో, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇజ్రాయిల్ దేశం చర్యలని ప్రపంచానికి తప్పుగా చూపెట్టే క్రమంలో హమాస్ ఉగ్రవాద సంస్థ, పాలస్తీనా ప్రజలకు నకిలీ గాయాల మేకప్ చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో కనీసం 2017 సంవత్సరం నుండి ఇంటర్నెట్ లో షేర్ అవుతుంది. పాలస్తీనా ఫిలిం ఇండస్ట్రీ కి చెందిన మరీయం సలా అనే మేకప్ ఆర్టిస్టు, ‘Doctors of the World’ అనే ఫ్రెంచ్ చారిటి ప్రాజెక్ట్ కోసం నటుల శరీరాల పై ఇలా నకిలీ గాయాలను మేకప్ చేసి సృష్టించినట్టు తెలిసింది. ఈ వీడియోకి పాలస్తీనా- ఇజ్రాయిల్ మధ్య ప్రస్తుతం చోటుచేసుకుంటున్న ఘర్షనలకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Gaza Post’ అనే యూట్యూబ్ ఛానల్ 25 ఫిబ్రవరి 2017 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. గాజాలో నిర్వహించిన ఒక ఆర్ట్ వర్క్ షాప్ కు సంబంధించిన దృశ్యాలివని ఈ వీడియో వివరణలో తెలిపారు. ఈ వీడియోలో మేకప్ ఆర్టిస్టులు తమ పని గురించి వివరిస్తూ ఇంటర్వ్యూ ఇస్తున్న దృశ్యాలని చూడవచ్చు. ఒకవేళ ఇజ్రాయిల్ దేశాన్ని ప్రపంచానికి తప్పుగా చూపెట్టే క్రమంలో పాలస్తీనా ప్రజలు ఇలా నకిలీ గాయాలని సృష్టించుకుంటే, దాని గురించి ఇలా బహిర్గతంగా ఇంటర్వ్యూలో చెప్పరు.

ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాల కోసం గూగుల్ లో వెతకగా, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని టర్కిష్  న్యూస్ ఛానల్ ‘TRT World’ 02 మర్చి 2017 నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. పాలస్తీనా ఫిలిం ఇండస్ట్రీ కి చెందిన మరీయం సలా అనే మేకప్ ఆర్టిస్ట్, ‘Doctors of the World’ అనే ఫ్రెంచ్ చారిటి ప్రాజెక్ట్ కోసం పాలస్తీనా నటుల శరీరాల పై నకిలీ గాయాలను మేకప్ చేసినట్టు ఈ  వీడియో వివరణలో తెలిపారు. మరీయం సలా సృష్టించిన ఈ నకిలీ గాయాల ఆధారంగా పాలస్తీనా యుద్ధ సమయాలలో గాయపడిన చిన్నారులకి చికిత్స ఎలా అందించాలో డాక్టర్లు తెలుసుకోవడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం.   

ఇదివరకు, ఇదే వీడియోని సిరియా దేశ ప్రజలు నకిలీ గాయాలని మేకప్ చేసుకొని ప్రపంచాన్ని మోసం చేస్తున్నారని సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, పలు న్యూస్ సంస్థలు ఈ వీడియోకి సంబంధించి స్పష్టతనిస్తూ న్యూస్ ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోలో పాలస్తీనా ప్రజలు, ఇజ్రాయిల్ దేశాన్ని ప్రపంచానికి తప్పుగా చూపెట్టడానికి నకిలీ గాయాలని మేకప్ చేసుకోలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, సంబంధం లేని పాత వీడియోని పాలస్తీనా ప్రజలు నకిలీ గాయాలని మేకప్ చేసుకొని ప్రపంచాన్ని మోసం చేస్తున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll