ఇజ్రాయిల్ ఆర్మీ ఐరన్ డోమ్ టెక్నాలజీని ఉపయోగించి పాలస్తీనా రాకెట్లని గాల్లోనే ధ్వంసం చేస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు షేర్ అవుతున్నాయి. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. పాలస్తీనా- ఇజ్రాయిల్ దేశాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకుంటున్న ప్రస్తుత నేపథ్యంలో, ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఇజ్రాయిల్ ఆర్మీ ఐరన్ డోమ్ టెక్నాలజీ ని ఉపయోగించి పాలస్తీనా రాకెట్లని గాల్లోనే ధ్వంసం చేస్తున్నవీడియోలు.
ఫాక్ట్ (నిజం): ఈ పోస్టులలో షేర్ చేసిన వీడియోలు Arma 3 వీడియో గేమ్ సాఫ్ట్వేర్ ని ఉపయోగించి రూపొందించిన సిములేషన్ వీడియోలని తెలిసింది. ఈ వీడియోలకి ఇజ్రాయిల్ ఆర్మీ ఉపయోగిస్తున్న ఐరన్ డోమ్ టెక్నాలజీకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
వీడియో-1 (ఆర్కైవ్డ్):
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Compared Comparison’ అనే యూట్యూబ్ ఛానల్ 09 జనవరి 2021 నాడు పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోని ‘ARMA 3 – A-10 Warthog/Thunderbolt II in Action vs C-RAM – Phalanx CIWS – C RAM – Tracer – Simulation’ అనే టైటిల్ తో యూట్యూబ్ లో అప్లోడ్ చేసారు. Arma 3 అనే వీడియో గేమింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఈ సిములేషన్ వీడియోని రూపొందించినట్టు వివరణలో తెలిపారు. ‘Compared Comparison’ యూట్యూబ్ ఛానెల్, ‘ARMA 3’ వీడియో గేమ్ అప్లికేషన్ ని ఉపయోగించి ఆధునిక రియాలిటీ వార్ చిత్రాలని రూపొందిస్తుందని తమ ప్రొఫైల్ లో తెలిపారు.
ARMA 3 అనేది వర్చ్యువల్ రియాలిటీని ఉపయోగించి రూపొందించిన ఒక మిలిటరీ వీడియో గేమ్. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో ARMA 3 వీడియో గేమ్ సాఫ్ట్వేర్ తో రూపొందించిన సిములేషన్ వీడియో అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
వీడియో-2 (ఆర్కైవ్డ్):
పోస్టులో షేర్ చేసిన వీడియోలని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఒక యూసర్ 14 మే 2021 నాడు తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. Arma 3 వీడియో గేమింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఈ సిములేషన్ వీడియోని రూపొందించినట్టు వీడియో వివరణలో తెలిపారు. ఇదే వీడియోని ‘Compared Comparison’ యూట్యూబ్ ఛానెల్ 01 జనవరి 2021 నాడు పోస్ట్ చేసింది. ఈ వీడియోని “ARMA 3 – A-10 Warthog vs Anti-Air Tank – Missiles and Tracers firing – GAU-8 Avenger – Simulation” అనే టైటిల్ తో యూట్యూబ్ లో అప్లోడ్ చేసారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసింది ARMA 3 వీడియో గేమ్ కి సంబంధించిన సిములేషన్ వీడియో అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
వీడియో-3:
ఈ వీడియోని కూడా ‘Compared Comparison’ యూట్యూబ్ ఛానెల్ 27 మర్చి 2021 నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసారు. ఈ వీడియోని “ArmA 3 – Triple A-10 Warthog strikes C-RAM System – Phalanx CIWS – C RAM – Tracer – Simulation” అనే టైటిల్ తో యూట్యూబ్ లో అప్లోడ్ చేసారు. దీనిబట్టి, ఈ వీడియో కూడా ARMA 3 వీడియో గేమ్ ద్వార రూపొందించిన సిములేషన్ వీడియో అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఇజ్రాయిల్-పాలస్తీనా దేశాల మధ్య తాజాగా చోటుచేసుకున్న ఘర్షణలలో, హమాస్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయిల్ దేశం పై 2500 పైగా రాకెట్లను ప్రయోగించినట్టు ఇజ్రాయిల్ ఆర్మీ ఆరోపించింది. హమాస్ ఉగ్రవాద సంస్థ ప్రయోగించిన ఈ రాకెట్లని ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ టెక్నాలజీ 90 శాతం గాల్లోనే ధ్వంసం చేసినట్టు పలు న్యూస్ ఆర్టికల్స్ రిపోర్ట్ చేసాయి. జనావాసాలే లక్ష్యంగా ప్రయోగించే రాకెట్లను వాటి లక్ష్యం చేరేలోగా గాలిలోనే నాశనం చేయడం కోసం ఇజ్రాయిల్ ఈ ఐరన్ డోమ్ క్షిపణి నిరోధక టెక్నాలజీ ని ఉపయోగిస్తుంది.
చివరగా, వీడియో గేమ్ దృశ్యాలని షేర్ చేస్తూ ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ టెక్నాలజీ ని ఉపయోగించి పాలస్తీనా రాకెట్లని గాల్లోనే ధ్వంసం చేస్తున్న దృశ్యాలంటున్నారు.