ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి పెన్షన్ల మీద ఎన్నికల ముందు చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తుంది ఒకటని ఫేస్బుక్ లో చాలా మంది ఒక వీడియోని షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఎన్నికల ముందు 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని చెప్పిన వై. ఎస్. జగన్ ఇప్పుడు ఎన్నికల తరువాత పెన్షన్ కి అర్హత 65 ఏళ్ళ నుండి 60 ఏళ్ళకి మాత్రమే తగ్గించాడు.
ఫాక్ట్ (నిజం): వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ 2019 మేనిఫెస్టో చూస్తే 45 ఏళ్ళ అక్కలకి ఇస్తా అన్న సహాయం, 60 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాం అని చెప్పిన పథకం వేరువేరే అని తెలుస్తుంది. పోస్ట్ లో ఉన్న వీడియో యొక్క పూర్తి వెర్షన్ చూస్తే కూడా జగన్ మేనిఫెస్టో లో ఉన్నదే చెప్పినట్టు తెలుస్తుంది. క్లిప్ చేసిన వీడియో పెట్టి, రెండు వేరువేరు పథకాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
పోస్ట్ లో ఉన్న వీడియో కోసం ‘Jagan pension to women’ అని గూగుల్ లో వెతికితే, AP24X7 వాళ్ళు యూట్యూబ్ లో పెట్టిన పూర్తి వీడియో సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. దాంట్లో జగన్ మాటలు వింటే 45 ఏళ్ళ అక్కలకు ఇచ్చే పథకం ‘వై.ఎస్.ఆర్. చేయూత’ అని చెప్తాడు. దానికి 60 ఏళ్ళ వృద్ధులకు ఇచ్చే పెన్షన్ పథకం (‘వై.ఎస్.ఆర్ పెన్షన్ పథకం’) కి సంబంధం లేదు. అంతే కాకుండా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ మేనిఫెస్టో చూస్తే కూడా ఇదే విషయం తెలుస్తుంది. మేనిఫెస్టో లో కూడా రెండు పథకాలు వేరు వేరు హామీలగా చూడవచ్చు. ‘వై.ఎస్.ఆర్. చేయూత’ పథకం హామీ మాత్రం ఏడాది తరువాత దశల వారిగా ఇస్తామని చెప్పినట్టుగా మేనిఫెస్టోలో చూడవచ్చు. పెన్షన్ అర్హత 60 ఏళ్ళకు తగ్గిస్తూ రిలీజ్ చేసిన జీ. ఓ. లో కూడా పథకం పేరు ‘.ఎస్.ఆర్ పెన్షన్ కానుక’ అని ఉంటుంది.
చివరగా, రెండు వేరువేరు పథకాలని పోలుస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.