ఇటీవల మొదలై కొనసాగుతున్న కెనడా-భారత్ దౌత్య వివాదం నేపథ్యంలో, కెనడాకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు కెనరా బ్యాంక్ ముందు నిరసన ప్రదర్శన చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక ఫోటో ప్రచారం చేయబడుతోంది. ఈ క్లెయిమ్ వెనుక ఉన్న వాస్తవాలను తనిఖీ చేద్దాము.
క్లెయిమ్: కెనరా బ్యాంక్ ముందు కెనడాకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నిరసన తెలుపుతున్న ఫోటో.
ఫాక్ట్(నిజం): సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ చిత్రం డిజిటల్‌గా మార్చబడింది. 2020 నాటి ఈ ఫోటో యొక్క అసలు వెర్షన్, ఊటీలో జరిగిన ఒక నిరసన సమయంలో తీయబడింది. ఇందులో కెనరా బ్యాంక్ సైన్ బోర్డు లేదు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ ఫోటో గురించి మరింత తెలుసుకోవడానికి మేము ఆన్‌లైన్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాము.
ఈ సెర్చ్ మమ్మల్ని 2020లో “మాలైమలర్” అనే వెబ్సైటులో వచ్చిన ఒక వార్తా కథనానికి దారితీసింది. అసలు ఫోటోలో బీజేపీకి చెందిన “జెండా స్తంభాన్ని తొలగించినందుకు” ఆ పార్టీ కార్యకర్తలు, ఊటీ మునిసిపాలిటీ అడ్మినిస్ట్రేషన్‌కి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనని చూపుతుందని స్పష్టం చేసింది.
మేము వైరల్ ఫోటోని అసలు ఫొటోతో పోల్చి చూడగా, అసలు ఫొటోలో నిరసనకారుల వెనుక ఉన్న మొబైల్ ఫోన్ మరియు ఎలక్ట్రానిక్స్ స్టోర్ Xiaomi బ్యానర్‌కు కెనరా బ్యాంక్ బోర్డు డిజిటల్‌గా జోడించబడిందని స్పష్టంగా అర్ధం అయ్యింది. మీరు క్రింది కొల్లజ్‌లో ఈ తేడాను చూడవచ్చు.
అదనంగా, సెప్టెంబర్ 2020లో Toptamilnews న్యూస్ అనే వెబ్‌సైట్‌లోని ప్రచురించబడిన ఒక కథనంలో కూడా మేము అదే ఫోటోను కనుగొన్నాము.
చివరిగా, కెనరా బ్యాంక్ ముందు కెనడాకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నిరసన తెలుపుతున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఈ ఫోటో డిజిటల్‌గా మార్చబడింది.