Fake News, Telugu
 

మణిపూర్‌లో కూకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో నిందితులు మెయితీ సామాజిక వర్గానికి చెందినవారు

0

మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో ఇద్దరు మహిళల్ని కొందరు వ్యక్తులు నగ్నంగా రోడ్డుపైన ఊరేగించిన దృశ్యాలతో ఉన్న వీడియో దేశం మొత్తాన్ని కలచివేసింది. అయితే ఈ ఘటనకు బాధ్యులైన వ్యక్తులు కూకీ తెగకు చెందిన వారని, బాధిత మహిళలు మెయితీ జాతికి చెందినవారని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: మణిపూర్‌లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనలో దోషులు కూకీ తెగకు చెందిన వ్యక్తులు, మరియు బాధితులు మెయితీ జాతి మహిళలు.

ఫాక్ట్: అధికారిక సమాచారం ప్రకారం, మణిపూర్‌లో కూకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో నిందితులు మెయితీ సామాజిక వర్గానికి చెందినవారు. ప్రధాన నిందితుడి పేరు హుయిరెం హీరా దాస్ (32). కావున పోస్టులో చేయబడిన క్లెయిమ్ తప్పు.

ఏప్రిల్ 2023లో మణిపూర్ హైకోర్టు ఆ రాష్ట్రంలో మెజారిటీ జనాభా కలిగిన  మెయితీ తెగను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చడాన్ని పరిశీలించమని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. అయితే ఈ నిర్ణయం వల్ల తమకు నష్టం కలుగుతుందని భావించిన మైనారిటీ కుకీ తెగ ప్రజలు మే మొదటి వారంలో నిరసనలు చేయగా, తర్వాతి రోజుల్లో కూకీ మరియు మెయితీ జాతుల మధ్య హింసాత్మక దాడులు జరిగాయి.

ఇక వైరల్ వీడియో విషయానికి వస్తే, 19 జులై 2023న ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనికి మణిపూర్ పోలీస్ స్పందిస్తూ, ఈ ఘటన 04 మే 2023లో జరిగిందని, ఈ ఘటన పై కేసు నమోదు చేసి, నిందితులని త్వరలోనే పట్టుకుంటామని 19 జులై 2023న ట్వీట్ చేశారు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ), 04 మే 2023 న సుమారు 1000 మంది మెయితీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు  మారణాయుధాలతో కుకీలు ఎక్కువగా ఉండే బి. ఫైనం (కంగ్ పాకపి జిల్లా) అనే ఊరిపై దాడి చేశారు. ఈ దాడిలో కూకీ తెగకు చెందిన ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు అడవిలోకి పారిపోయి తప్పించుకున్నారు. వాళ్ళని తర్వాత నొంగ్పోక్ సెగ్మై పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు బృందం రక్షించింది.

అయితే పోలీసులు ఈ ఐదుగురిని స్టేషన్‌కు తరలిస్తుండగా, స్టేషన్‌కు రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న తౌబల్ అనే ప్రాంతంలో సాయుధ మూక వాళ్ళని ఆపి ముగ్గురు మహిళల్ని నగ్నంగా రోడ్డుపై ఊరేగించింది. వారిలో ఒక మహిళని సామూహిక అత్యాచారం చేయబోతుండగా ఆపడానికి  ప్రయత్నించిన ఆమె తండ్రి, సోదరుడిని చంపడం జరిగింది. ఈ ఘటన పై మొదటగా జీరో ఎఫ్ఐఆర్ 18 మే 2023లో సైకుల్ పోలీస్ స్టేషన్లో నమోదు కాగా, ఇక ఇదే కేసుని సంబంధిత నొంగ్పోక్ సెగ్మై పోలీస్ స్టేషన్‌కు 19 జులై 2023న  బదిలీ చేయడం జరిగింది.

తాజా సమాచారం ప్రకారం, మణిపూర్ పోలీసులు ఈ ఘటనతో ప్రమేయం ఉన్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధాన నిందితులలో ఒకడు మెయితీ సామాజిక వర్గానికి చెందిన హుయిరెం హీరా దాస్ (32) కాగా, మిగిలిన వాళ్ళ వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక, వైరల్ అవుతున్న అసలు పోస్టుని ముందుగా, వార్తా కథనాల ఆధారంగా, ఇమ్రాన్ బైగ్ మొఘల్ వ్యక్తి ఫేస్ బుక్ లో పోస్టు చేయడం గుర్తించాం. అయితే, కొందరు వ్యక్తులు పోస్టులోని వివరాలని తారుమారు చేసి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని ఇమ్రాన్ మాకు వివరించాడు.

చివరిగా, మణిపూర్‌లో కూకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో నిందితులు మెయితీ సామాజిక వర్గానికి చెందినవారు.

Share.

About Author

Comments are closed.

scroll