Fake News, Telugu
 

ఈ ఫోటో అమరీందర్‌ సింగ్‌ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షాని కలిసినప్పట్టిది

0

ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రిగా అమరీందర్‌ సింగ్ రాజీనామా చేయడం, ఆ తరవాత చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో, ‘అమిత్ షా గారితో భేటీ అయిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్’ అని చెప్తూ వీరిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అమిత్ షాతో భేటీ అయిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్ ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటో అమరీందర్‌ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆగస్ట్ 2021లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాని ఢిల్లీలో కలిసినప్పటిది. వార్తా కథనాలు మరియు జర్నలిస్టులు ఈ ఫోటోని ఆగస్ట్ లోనే షేర్ చేసాయి. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తరవాత అమరీందర్‌ సింగ్ అమిత్ షాని కలిసినట్టు ఎటువంటి సమాచారం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ ఫోటో అమరీందర్‌ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాని ఢిల్లీలో  కలిసినప్పటిది. ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా పంజాబ్ కేసరి అనే వార్తా సంస్థ 10 ఆగస్ట్ 2021న ఒక వార్తా కథనంలో ఇదే ఫోటోని ప్రచురించింది.  

ఈ కథనం ప్రకారం అమరీందర్‌ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షాని కలిసి రైతుల ఆందోళనలు మొదలైన వాటి గురించి చర్చించారు. ఒక ప్రముఖ జర్నలిస్ట్ కూడా ఇదే ఫోటోని 10 ఆగస్ట్ 2021న ‘పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌ సింగ్ హోం మంత్రి అమిత్ షాను కలిశారంటూ’ ట్వీట్ చేసాడు. దీన్నిబట్టి ఈ ఫోటో అమరీందర్‌ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తరవాత తీసింది కాదని అర్ధం అవుతుంది. పైగా ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తరవాత అమరీందర్‌ సింగ్ అమిత్ షాని కలిసినట్టు ఎటువంటి సమాచారం లేదు.

చివరగా, అమిత్ షాని అమరీందర్‌ సింగ్ కలిసిన ఈ ఫోటో తను పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పట్టిది, ముఖ్యమంత్రి పదవికి అమరీందర్‌ సింగ్ రాజీనామా చేసిన తరువాతది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll