Fake News, Telugu
 

ఈ ఫోటో అమెరికా నుండి వచ్చిన కొడుక్కి అపార్ట్మెంట్‌లో తల్లి అస్థిపంజరం కనిపించిన ఘటనకు సంబంధించింది కాదు

0

అమెరికా నుండి వచ్చిన కొడుక్కి ఇంట్లో తన తల్లి అస్థిపంజరం కనిపించిన ఘటన ముంబైలో జరిగిందని రిపోర్ట్ చేసిన ఒక న్యూస్ పేపర్ క్లిప్ ని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ న్యూస్ క్లిప్ లో ఆ అస్థిపంజరం ఫోటో కూడా ప్రచురించారు.  ఈ కథనం ద్వారా ఆ వార్తకి సంబంధించిన నిజమెంటో చూద్దాం.

క్లెయిమ్: ముంబైలో అమెరికా నుండి వచ్చిన కొడుక్కి ఇంట్లో తన తల్లి అస్థిపంజరం కనిపించిన ఘటనకి సంబంధించిన ఫోటో.

ఫాక్ట్(నిజం): 2016లో నైజీరియాలోని ఒగున్ రాష్ట్రంలో ఒక పాస్టర్ ఇంట్లో అస్థిపంజరం దొరికింది, ఈ ఫోటో ఆ ఘటనకి సంబంధించింది. కాకపోతే 2017లో ముంబైలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అమెరికా నుండి వచ్చిన కొడుక్కి అపార్ట్మెంట్‌లో తల్లి అస్థిపంజరం కనిపించింది. కాకపోతే వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్‌లో ఈ ఘటనకి సంబంధించి కొంత వక్రీకరించి రాసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో షేర్ చేసిన అస్తిపంజరం ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని 2016లో ప్రచురించిన పలు నైజీరియన్ వార్తా కథనాలు కనిపించాయి. నైజీరియాలోని ఒగున్ రాష్ట్రంలో ఒక పాస్టర్ ఇంట్లో అస్థిపంజరం దొరికిందని, ఈ అస్థిపంజరం తప్పిపోయిన పాస్టర్ సోదరిది అయ్యుంటుందని ఈ కథనాల ప్రకారం తెలుస్తుంది.

పైన తెలిపిన విషయాన్నే చెప్తూ ఇదే ఫోటోని ప్రచురించిన మరికొన్ని 2016 నైజీరియన్ వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఐతే ఇలాంటిదే ఒక ఘటన 2017లో ముంబైలో జరిగింది. ‘రితురాజ్ సాహ్ని అనే వ్యక్తి అమెరికా నుండి తిరిగి వచ్చి ముంబైలోని వారి అపార్ట్‌మెంట్‌లో చూసే సరికి అతనికి తన తల్లి, 63 ఏళ్ల ఆశా సాహ్ని  అస్థిపంజరం కనిపించింది. రితురాజ్ తన తల్లితో సంవత్సరం నుండి మాట్లాడలేదు, అతను ఎప్పుడు కాల్ చేసినా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చేది అని వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. అతను తన తల్లి గురించి తెలుసుకోమని అపార్ట్మెంట్ సొసైటీ సభ్యులను అడిగినా ఎవరూ పట్టించుకోలేదంటూ ఇండియా టుడే కథనం ప్రకారం తెలుస్తుంది. పైగా ఈ కథనం ప్రకారం  తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదని ఆశా సాహ్ని సూసైడ్ నోట్ రాసి చనిపోయినట్టు తెలుస్తుంది.

దీన్ని బట్టి పోస్టులో చెప్తున్నటువంటి ఘటన ఒకటి గతంలో ముంబైలో జరిగినప్పటికీ, ఆ ఫోటో మాత్రం ముంబై ఘటనకి సంబంధించింది కాదని, అది నైజీరియాలో జరిగిన మరొక ఘటనకి సంబంధించిందని అర్ధమవుతుంది. పైగా పోస్టులో ఈ ఘటనకి సంబంధించిన కథనాన్ని కూడా కొంత వక్రీకరించినట్టు అర్ధంచేసుకోవచ్చు.

చివరగా, అమెరికా నుండి వచ్చిన కొడుక్కి అపార్ట్మెంట్‌లో తల్లి అస్థిపంజరం కనిపించిన ఘటన నాలుగు సంవత్సరాల కింద ముంబైలో జరిగింది, ఈ ఫోటో ఆ ఘటనకు సంబంధించింది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll