Fake News, Telugu
 

ఈ ఫోటో ‘పంచతత్త్వ విగ్రహాల ప్రతిష్ట’ వేడుకకి సంబంధించి 2019 లో రష్యా లో తీసినది

0

దేవుళ్ళ విగ్రహాలకు కరోనా వచ్చిందని, వాటిని క్వారంటైన్ లో ఉంచి వైద్యం అందిస్తున్నారని, విగ్రాహాలకి కరోనా రావటం ఏమిటని వ్యంగ్యంగా వెక్కిరిస్తూ ఒక ఫోటోతో కూడిన పోస్ట్ సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: దేవుళ్ళ విగ్రహాలకు కరోనా వచ్చిందని, వాటిని క్వారంటైన్ లో ఉంచి వైద్యం అందిస్తున్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): అది 2019 లో రష్యా లో తీసిన ఫోటో. ‘పంచతత్త్వ విగ్రహాల ప్రతిష్ట’ అనే కార్యక్రమంలో భాగంగా ఆ విగ్రహాలను అలా మంచాల పై పెట్టారు. రష్యా లో జరిగిన ఆ కార్యక్రమానికి, కరోనా క్వారంటైన్ కి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని ఫోటోని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఒక వీడియో సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఫోటోలోని విగ్రహాలు, మంచాలు ఆ వీడియోలో కూడా చూడవొచ్చు. ఆ వీడియోని జూలై 2019 లో ‘వీకే’ అనే రష్యన్ వెబ్సైటులో అప్లోడ్ చేసారని తెలుస్తుంది. అదే వీడియో యూట్యూబ్ లో కూడా ఉంది.

జూలై 2019 లో నిర్వహించిన ‘పంచ-తత్త్వ’ – ‘విగ్రహాల ప్రతిష్ట’ అనే కార్యక్రమానికి సంబంధించిన ఫిలిం అని చెప్తూ,  పై వీడియో పోస్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ వారే మరో వీడియోని పోస్ట్ చేసారు. దాంట్లో కూడా విగ్రహాలను మంచాల పై పెట్టినప్పుడు తీసిన వీడియో చూడవచ్చు. వీడియో టైటిల్ లో ‘Omsk’  అని రాసి ఉన్నట్టు చూడవొచ్చు. అది రష్యాలోని ఒక నగరం పేరు.

‘విగ్రహాల ప్రతిష్ట’ వేడుకలో భాగంగా అలా విగ్రహాలను మంచాల పై పెట్టినట్టు ‘వీకే’ వెబ్సైటులో పెట్టిన ఫోటోల కింద ఒకరు కామెంట్ చేసారు.

రష్యాలో జరిగిన ఆ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని ఫోటోలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

కావున, 2019 లో రష్యా లో జరిగిన ఆ కార్యక్రమానికి, కరోనా క్వారంటైన్ కి ఎటువంటి సంబంధంలేదు. ‘పంచతత్త్వ’ గురించిన సమాచారం కోసం ‘ఇస్కాన్’ వెబ్సైటులో చూడవొచ్చు.

చివరగా, ‘పంచ తత్త్వ’ – ‘విగ్రహాల ప్రతిష్ట’ అనే వేడుకకి సంబంధించి 2019 లో రష్యాలో తీసిన ఫోటోని పెట్టి, దేవుళ్ళ విగ్రహాలకు కరోనా వచ్చిందని, వాటిని క్వారంటైన్ లో ఉంచి వైద్యం అందిస్తున్నారని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll