మోదీకి వీరభక్తుడు తమకు ఆసుపత్రులు, తిండి అక్కర్లేదు మందిర్ మాత్రమే కావాలని అరిచాడని, కరోనా వచ్చి అతను ఆక్సిజన్ లేక ఉత్తర్ ప్రదేశ్ లక్నోలో చనిపోయాడని ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: మోదీ వీరభక్తుడు తిండి అక్కర్లేదు మందిర్ మాత్రమే కావాలని అన్న వ్యక్తి ఆక్సిజన్ దొరకక లక్నోలో చనిపోయాడు.
ఫాక్ట్: ఫొటోలోని వ్యక్తి (జితేంద్ర గుప్తా) ఇతర ఫాక్ట్-చెకింగ్ సంస్థలతో స్వయంగా మాట్లాడుతూ తాను ఆరోగ్యంగా ఉన్నానని, తనపై ఫేస్బుక్, ట్విట్టర్ లో జరుగుతున్నవి తప్పుడు వార్తలు అని స్పష్టతను ఇచ్చాడు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
ఆ వ్యక్తి యొక్క ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు యు ట్యూబ్ లోని వీడియో లభించింది. అతను ఆ వీడియో లో తమకు రోడ్లు, తిండి అక్కరలేదు మందిర్ కావాలి అని అరుస్తున్నట్టు తెలుస్తుంది. ఆ వీడియో 03 జనవరి 2019న పోస్ట్ చేసారు. ప్రస్తుతం, అతని పరిస్థితి తెలుసుకోటానికి ఇంటర్నెట్ లో వెతికినప్పుడు బీజేపీ లీడర్ రవిందర్ సింగ్ నెగి ఫేస్బుక్ పోస్ట్ లభించింది. అందులో, ఇది నా బెస్ట్ ఫ్రెండ్ జితు గుప్తాజీ అని, అతను పట్పర్ గంజ్ అసెంబ్లీ నియోజికవర్గం ఢిల్లీలో సామాజిక కార్యకర్త అని, అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు అని మరియు ఎటువంటి వ్యాధి లేకుండా తన ఇంటి వద్ద బాగా ఉన్నాడని, ఎవరో అతని మరణానికి సంబంధించిన నకిలీ వార్తలను పోస్ట్ చేసారని, ఈ వార్తను ఎవరు పోస్ట్ చేసినా మేము అతనిపై పోలీసు కంప్లైంట్ దాఖలు చేస్తాము అని తన పోస్ట్ ద్వారా వివరించారు.
అయితే ఈ ఘటనకు సంబంధించి ఆల్ట్ న్యూస్, బూమ్ ఫాక్ట్ చెక్ వారు జితేంద్ర గుప్తాతో మాట్లాడారని అతనికి ఏమి అవలేదని, క్షేమంగానే ఉన్నట్టు వారి ఆర్టికల్స్ ద్వారా తెలుస్తుంది. ఆ వ్యక్తి గుప్తా బూమ్ లైవ్ వారికి ఒక వీడియో పంపి అందులో, తన పేరు జితేంద్ర గుప్తా అని, తను చాలా ఆరోగ్యంగా ఉన్నారని, తనపై ఫేస్బుక్, ట్విట్టర్ లో జరుగుతున్న ఈ తప్పుడు వార్తలు ఏవైతే ప్రచారం చేస్తున్నారో అవి చేయొద్దని వివరించారు.
చివరగా, తిండి అక్కర్లేదు, మందిర్ కావాలి అని అన్న ఈ వ్యక్తి కోవిడ్-19 తొ మరణించలేదు.