Fake News, Telugu
 

ఈ వీడియో భారత స్వాతంత్ర్యం తరువాత మణిపూర్ చేరుకున్న మొదటి రైలుది కాదు

0

స్వాతంత్రం వచ్చిన 74 సంవత్సరాల తరువాత మొదటిసారి మణిపూర్ చేరుకున్న రైలు అని ఒక వీడియోతో ఉన్న పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 74 సంవత్సరాల స్వాతంత్రం తరువాత మణిపూర్ కు చేరుకున్న మొదటి రైలు యొక్క వీడియో.

ఫాక్ట్: ఈ వీడియోలోని ట్రైన్ వైంగైచున్‌పావ్ రైల్వే స్టేషన్ కు మొదటి బ్రాడ్ గేజ్ పాసెంజర్ ట్రైన్ సర్వీస్, సిల్చార్-ఇంఫాల్ బ్రాడ్ గేజ్ ప్రాజెక్ట్ లో ఒక భాగం. జిరిబామ్ మరియు సిల్చార్ మధ్య మణిపూర్ లో మొదటి బ్రాడ్ గేజ్ ప్యాసింజర్ రైలును 2016 లోనే ప్రధాని మోదీ ప్రారంభించారు. మణిపూర్ ప్రాంతానికి 1899లోనే మీటర్ గేజ్ రైల్వే లైన్ కట్టారు. దేశం అంతటా మీటర్ గేజ్ రైల్ లైన్ లను బ్రాడ్ గేజ్ లైన్ లుగా మారుస్తున్నట్టు ప్రభుత్వం ఇంతకముందే నిర్ణయం తీసుకుంది, ప్రధాని మోదీ 2014 లో ప్రధాన మంత్రి అయ్యాక ఇది ఊపందుకుంది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులోని వీడియోను స్క్రీన్ షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు ఒక యు ట్యూబ్ వీడియో లభించింది. ‘నార్త్ ఈస్ట్ టుడే’ వారు అప్లోడ్ చేసిన ఈ వీడియోలో సిల్చార్, అస్సాం టు వైంగైచున్‌పావ్, మణిపూర్ పాసెంజర్ ట్రైన్ ట్రయల్ రన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ ట్రైన్ వైంగైచున్‌పావ్ రైల్వే స్టేషన్ కు మొదటి బ్రాడ్ గేజ్ పాసెంజర్ ట్రైన్ సర్వీస్ మరియు సిల్చార్-ఇంఫాల్ బ్రాడ్ గేజ్ ప్రాజెక్ట్ లో ఒక భాగం. 03 జులై 2021 రోజున జరిగిన ఈ ట్రయల్ రన్ ను ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ ‘హిస్టారిక్ మూమెంట్’ గా అభివర్ణించారని వీడియో యొక్క డిస్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది. ఈ సంఘటనకు సంబంధించి మరో వీడియో ఇక్కడ చూడొచ్చు.

సిల్చార్, అస్సాం టు వైంగైచున్‌పావ్, మణిపూర్ పాసెంజర్ ట్రైన్ ట్రయల్ రన్ కు సంబంధించి న్యూస్ ఆర్టికల్స్ వెతికినప్పుడు ఈస్ట్ మోజో వారి ఆర్టికల్ లభించింది. సిల్చార్-వైంగైచున్‌పావ్ బ్రాడ్ గేజ్ లైన్ ను రైల్వే మంత్రి త్వరలో ప్రారంభిస్తారని తెలిపారు. ఆ ఆర్టికల్ చివరన ఎడిటర్ గమనిక అంటూ ఒక వివరణ ఇవ్వటం జరిగింది. వైంగైచున్‌పావ్ రైల్వే స్టేషన్ వరకు పాసెంజర్ రైలు సేవ ఇదే మొదటిదని ఇంతకముందు తెలిపారని, అది పొరపాటని ఆర్టికల్ లో నుంచి తీసేసినట్టు తెలిపారు. మణిపూర్ ప్రాంతానికి 1899 నుండే మీటర్ గేజ్ రైల్వే లైన్ కట్టారని ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. దేశం అంతటా మీటర్ గేజ్ రైల్ లైన్ లను బ్రాడ్ గేజ్ లైన్ లు గా మారుస్తున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మణిపూర్ కు ఇది మొదటి బ్రాడ్ గేజ్ ట్రైన్ కూడా కాదు. ప్రధాన మంత్రి మోదీ 27 మే 2016 లోనే జిరిబం నుంచి సిల్చార్ కు బ్రాడ్ గేజ్ పాసెంజర్ ట్రైన్ ను ఆరంబించినట్టు చేసినట్టు తెలుస్తుంది. దీని గురించి మోదీ ట్వీట్ కూడా చేసారు. దీనికి సంబంధించి ఆర్టికల్స్ ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఇండియా టుడే వారు నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుభానన్ చందాతో మాట్లాడారు. ఈ రైలు వైంగైచున్‌పావ్, సిల్చార్ మధ్య స్థానిక ప్రయాణీకుల రైలు యొక్క ట్రయల్ రన్ మాత్రమేఅయన తెలిపారు. జిరిబామ్, సిల్చార్ మధ్య మణిపూర్ లో మొదటి బ్రాడ్ గేజ్ ప్యాసింజర్ రైలును 2016 లో ప్రధాని ప్రారంభించారు. తరువాత వైంగైచున్‌పావ్ వరకు ఈ రైలును పొడిగించారు అని ఆయన అన్నారని ఈ ఫాక్ట్ చెక్ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది.

చివరగా, ఈ వీడియో లోని రైలు భారత స్వాతంత్ర్యం తరువాత మణిపూర్ చేరుకున్న మొదటి రైలుది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll