Fake News, Telugu
 

సోనియా గాంధీ ప్రధాన కుర్చీలో కూర్చున్న ఈ మీటింగ్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జరగలేదు

0

Update (25 May 2022):

ఇటీవల ప్రధానమంత్రి మోదీ జపాన్‌లో నాలుగు దేశాల (అమెరికా,జపాన్, భారత్,ఆస్ట్రేలియా) క్వాడ్ (QUAD) సమావేశంలో పాల్గొన్న నేపథ్యంలో మోదీ ఇతర దేశాల ప్రధానులతో ఉన్న ఫోటోని సోనియా గాంధీ శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేతో చర్చిస్తున్న మరో ఫోటో కూడా విస్తృతంగా షేర్ అవుతోంది. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్‌ ఉన్నప్పటికీ, ఆయనకు బదులు సోనియా గాంధీ వ్యవహారాలను చూసుకునేది అనే అర్ధం వచ్చేలా ఈ ఫోటోని షేర్ చేస్తున్నారు.

ఐతే నిజానికి ఈ ఫోటో మన్మోహన్ సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పటిది కాదు. 2017లో శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే భారత పర్యటనలో భాగానంగా సోనియా గాంధీని కలిసాడు. సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి హోదాలో ఈ భేటికి హాజరైంది, అందుకే ఈ సమావేశంలో మన్మోహన్ సింగ్ పక్కన కూర్చుంటే, సోనియా గాంధీ శ్రీలంక ప్రధానితో చర్చిస్తూ కనిపించింది. ఇవే ఫోటోలను భారత మీడియాతో (ఇక్కడ & ఇక్కడ) పాటు భారత్‌లోని శ్రీలంక హైకమిషన్ కూడా షేర్ చేసాయి.

Published (14 June 2021):

కాంగ్రెస్ పది సంవత్సరాల ప్రభుత్వ పాలనలో సోనియా గాంధీ, ప్రధానమంత్రి స్థానంలో విదేశీ ప్రతినిధులతో చర్చలు నిర్వహించారంటూ అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. శ్రీలంక ప్రభుత్వ అధికారులతో జరిగిన ఒక మీటింగ్ లో సోనియా గాంధీ ప్రధాన కుర్చీలో కూర్చొని, మన్మోహన్ సింగ్ పక్కన కుర్చీలో కూర్చున్న దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కాంగ్రెస్ పది సంవత్సరాల ప్రభుత్వ పాలనలో సోనియా గాంధీ ప్రధానమంత్రి స్థానంలో విదేశీ ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో, 2017లో అప్పటి శ్రీలంక ప్రధానమంత్రి రణిల్‌ విక్రమసింఘే, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఢిల్లీ లో జరిపిన చర్చలని చూపిస్తుంది. శ్రీలంక ప్రభుత్వ ప్రతినిధులతో జరిపిన ఈ మీటింగ్ లో సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి హోదాలో ప్రధాన కుర్చీలో కూర్చున్నారు. ఈ మీటింగ్  కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో(2004-14) జరిగింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం కీ పదాలు ఉపయోగించి గూగుల్ లో వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘NNIS-News’ యూట్యూబ్ ఛానల్ 26 ఏప్రిల్ 2017 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. శ్రీలంక ప్రధానమంత్రి రణిల్‌ విక్రమసింఘే, తన నాలుగు రోజుల భారత్ పర్యటనలో భాగంగా ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలను కలిసి చర్చలు నిర్వహిస్తున్న దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు. 2017 లో శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘే మరియు కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన ఈ మీటింగ్ కు సంబంధించిన ఫోటోలని ‘ANI’ న్యూస్ ఛానల్ తమ ట్విట్టర్ హేండిల్ లో షేర్ చేసింది.

శ్రీలంక ప్రభుత్వ ప్రతినిధులతో జరిపిన ఈ చర్చలో సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి హోదాలో ప్రధాన కుర్చీలో కూర్చున్నట్టు తెలిసింది. 2019లో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా తో జరిపిన చర్చలలో కూడా కాంగ్రెస్ పార్టీ తరుపున సోనియా గాంధీ ప్రధాన కుర్చీలో కూర్చున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో(2004-14) మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి హోదాలో విదేశీ ప్రభుత్వ ప్రతినిధులతో జరిపిన చర్చలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ చర్చలలో మన్మోహన్ సింగ్ ప్రధాన కుర్చీలో కూర్చొని విదేశీ మంత్రులతో చర్చిస్తున్న దృశ్యాలని మనం చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో తీసినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఇదివరకు, ఇదే చర్చకు సంబంధించిన ఫోటోని ఇదే క్లెయిమ్ తో సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, దానికి సంబంధించి FACTLY ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, సోనియా గాంధీ ప్రధాన కుర్చీలో కూర్చొని శ్రీలంక ప్రభుత్వ ప్రతినిధులతో జరుపుతున్న ఈ మీటింగ్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గా ఉన్న సమయంలో జరగలేదు.

Share.

About Author

Comments are closed.

scroll