English, Fake News
 

WEF సమావేశంలోని ఈ సెషన్‌లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్కడ ఉన్న మహిళ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు

0

ఒక వీడియోను షేర్ చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ దావోస్‌లో సెంట్రల్ బడ్జెట్ గురించి అడిగినప్పుడు చాలా పెద్ద ప్రశ్న అంటూ పిచ్చి చూపులు చూస్తున్నాడని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం. బడ్జెట్‌లో

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని దావోస్‌లో సెంట్రల్ బడ్జెట్ గురించి అడిగినప్పుడు చాలా పెద్ద ప్రశ్న అంటూ దిక్కులు చూస్తున్న వీడియో.

ఫాక్ట్: ఈ వీడియో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సమావేశం – ‘ఫ్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్’ అనే సెషన్‌లో సిఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నప్పుటి వీడియో నుండి కట్ చేసినది. అక్కడున్న మహిళ అడిగిన పూర్తి ప్రశ్న గానీ, ముఖ్యమంత్రి ఇచ్చిన జవాబు గానీ ఈ వీడియోలో లేదు. డాక్టర్ల కొరత విషయానికి సంబంధించి ఆ మహిళ అడిగిన ప్రశ్నకు, 16 మెడికల్ కాలేజీలను తెరవబోతున్నామని, ఒక బోధనాసుపత్రి మరియు వైద్య కళాశాల ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల ద్వారా ప్రజలకు ఆరోగ్యం అందించవొచ్చని జగన్ జవాబిచ్చారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.       

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఆ చర్చకి సంబంధించి పూర్తి వీడియో ఒకటి యూట్యూబ్‌లో లభించింది. ఆ యూట్యూబ్‌ వీడియోలో 5:33 టైంఫ్రేమ్ దగ్గర వీడియోను కట్ చేసి 27 సెకండ్ల ఈ వైరల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే, వీడియోలో ఉన్న మహిళ అడిగిన ప్రశ్న నిజంగానే పెద్దది. 3:39 టైంఫ్రేమ్ దగ్గర ప్రశ్న అడగటం మొదలుపెట్టిన ఆవిడ, 5:43 టైంఫ్రేమ్ దగ్గర ముగించింది. అంటే, రెండు నిమిషాలకు పైగా తన ప్రశ్నలను అడిగింది.

ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి చాలా కృషి అవసరమని, తగినంత మంది వైద్యులు లేరనే విషయం అందరికీ తెలుసని, దీనికి సంబంధించి జగన్ మోహన్ రెడ్డిని అడిగింది. మరో ప్రశ్న వేరొక పానెల్ సభ్యుడిని అడిగింది.

ఆవిడ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ, 6:00 టైంఫ్రేమ్ దగ్గర తన అసలు సమాధానాన్ని మొదలుపెట్టిన జగన్ సుమారు ఒక నిమిషం 25 సెకండ్లు జవాబు ఇచ్చినట్టు తెలుస్తుంది. 7:21 టైంఫ్రేమ్ దెగ్గర తన జవాబును ముగించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ జవాబు, సంక్లిప్తంగా, “మాకు నిధులపై పరిమితులు ఉన్నాయి. కష్టాలు ఉన్నప్పటికీ, మేము దానితో ముందుకు సాగుతున్నాము. 16,000 కోట్లను సమీకరించాలని మూడు సంవత్సరాల విండోను ఓపెన్ చేసాము. మేము సరైన దిశలో పయనిస్తున్నాము. వైద్యుల (కొరత) విషయానికొస్తే, మీరు ఇప్పుడే మాట్లాడినట్లు, ఇది మేము ఎదుర్కోవాల్సిన దుస్థితి. అందుకే మరిన్ని మెడికల్ కాలేజీలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాం. మా ప్రభుత్వం రాకముందు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 11 టీచింగ్ కాలేజీలు ఉండేవి. ఇప్పుడు 16 మెడికల్ కాలేజీలను తెరవబోతున్నాం. ఒక బోధనాసుపత్రి మరియు వైద్య కళాశాల ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల ద్వారా ప్రజలకు ఆరోగ్యం అందించవొచ్చు.”

దావోస్‌లో జరిగిన ఈ సమావేశంకు సంబంధించి పూర్తి వీడియో ఇక్కడ చూడొచ్చు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) తొలి రోజున వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివిధ ప్రపంచ పరిశ్రమల ప్రముఖులతో సమావేశమయ్యారు. ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు పోర్ట్ నేతృత్వంలోని రంగాలలో రాష్ట్రానికి వివిధ పెట్టుబడి అవకాశాలను కోరారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సమావేశం యొక్క రెండవ రోజున జరిగిన ఈ సమావేశం – ‘ఫ్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్’ అనే సెషన్‌లో సిఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

చివరగా, ఈ వీడియో దావోస్‌లో WEF సమావేశంలోని ఒక సెషన్‌లో సిఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నప్పుడు కట్ చేసింది; అక్కడున్న మహిళ అడిగిన పూర్తి ప్రశ్న గానీ, ముఖ్యమంత్రి ఇచ్చిన జవాబు గానీ ఈ వీడియోలో లేదు.

Share.

About Author

Comments are closed.

scroll