Fake News, Telugu
 

‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా నేపథ్యంతో రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో జరిగిన సంఘటనలగా షేర్ చేస్తున్న ఈ సమాచారం పూర్తిగా వాస్తవం కాదు

0

రాజస్తాన్ ప్రభుత్వం ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా చూసే వారందరినీ అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తూ తమ రాష్ట్రంలో  144 సెక్షన్ అమలు చేసిందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. అలాగే, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా చూసి తిరిగొస్తున్న వారిపై కత్తితో దాడి చేసిన జైనుద్ధిన్ అనే నేరస్తుడిని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి చంపేసినట్టు మరొక పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా నేపథ్యంతో షేర్ అవుతున్న ఈ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్లని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా నేపథ్యంతో రాజస్తాన్ అలాగే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో జరిగిన సంఘటనలగా షేర్ చేస్తున్న పోస్టులు.  

ఫాక్ట్ (నిజం): ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా చుసిన వారిని అరెస్ట్ చేస్తామని రాజస్తాన్ ప్రభుత్వం ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదు. రాజస్తాన్ కోటా జిల్లా యంత్రాంగం, రానున్న పండగలు అలాగే, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రప్రదర్శన దృష్ట్యా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం 22 మర్చి నుండి ఏప్రిల్ 14 వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, దీనిలో భాగంగా ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా ప్రదర్శనను తాము నిలిపివేయడం లేదని కోటా జిల్లా కలెక్టర్ ఆఫీస్ ట్వీట్ ద్వారా స్పష్టం చేసారు. అలాగే, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా చూసి తిరిగొస్తున్న వారిపై కత్తితో దాడి చేసిన జైనుద్ధిన్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు చంపలేదు, ప్రాణాలతో పట్టుకొని అరెస్ట్ చేసారు. కావున, పోస్టులలో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి.

క్లెయిమ్-1:

మొదటి పోస్టులో తెలుపుతున్నట్టు ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా చుసిన వారిని అరెస్ట్ చేస్తామని రాజస్తాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందా అని వెతికితే, రాజస్తాన్ ప్రభుత్వం అటువంటి ఆదేశాలేవి జారీ చేయలేదని తెలిసింది. రాజస్తాన్ కోటా జిల్లా యంత్రాంగం, రానున్న పండగలు, అలాగే ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్ర ప్రదర్శన దృష్ట్యా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం 22 మర్చి నుండి ఏప్రిల్ 14 వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. చిత్రప్రదర్శన దగ్గర అధికంగా జనాలు గుమిగూడటం, నిరసన, ర్యాలీ మొదలగు కార్యకలాపాలను అనుమతించమని కోటా జిల్లా అధికారులు ఈ ఆదేశాలలో తెలిపారు. ఈ విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ చేసిన ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

కోటా జిల్లా యంత్రాంగం ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు అలాగే, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్ర బృందం నిరసన తెలపగా, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా ప్రదర్శనను తాము నిలిపివేయడం లేదని కోటా జిల్లా కలెక్టర్ ఆఫీస్ ట్వీట్ ద్వారా స్పష్టం చేసారు.  21 మార్చి 2022 నాడు ఇచ్చిన 144 సెక్షన్ ఆదేశాల నుండి ‘ది కాశ్మీర్ ఫైల్స్’ మరియు ఇతర సినిమాలను మినహాయిస్తున్నట్టు కోటా జిల్లా యంత్రాంగం 22 మార్చి 2022 ట్వీట్ ద్వారా కూడా స్పష్టం చేసింది. ఈ సంఘటన కేవలం కోటా జిల్లాలో చోటుచేసుకుంది. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా చుసిన వారిని అరెస్ట్ చేస్తామని రాజస్తాన్ ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు.

క్లెయిమ్-2:

మరొక పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం వెతికితే, ఉత్తరప్రదేశ్ ఖుషినగర్‌లో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా చూసి తిరిగొస్తున్న ముగ్గురి యువకులపై కత్తితో దాడి చేసిన జైనుద్ధిన్‌ అనే వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రాణాలతో పట్టుకొని అరెస్ట్ చేసినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. ఆ న్యూస్ రిపోర్టులని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. పోలీసులకి జైనుద్ధిన్‌కు మధ్య జరిగిన కాల్పులలో జైనుద్ధిన్‌ కాలికి గాయమైందని, ఈ కాల్పులలో ఫజిల్‌నగర్ స్టేషన్ ఇంచార్జ్ కుడా గాయపడినట్టు తెలిసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో తెలుపుతున్నట్టు ఉత్తరప్రదేశ్ పోలీసులు జైనుద్ధిన్‌ను ఎన్‌కౌంటర్లో చంపలేదని, ప్రాణాలతో పట్టుకొని అరెస్ట్ చేసారని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా నేపథ్యంతో రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో జరిగిన సంఘటనలగా షేర్ చేస్తున్న ఈ సమాచారం పూర్తిగా వాస్తవం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll