‘హాలండ్‌లో రైతులు తమ పొలంలో పండిన నారింజలతో వినాయక విగ్రహం చేసి వినాయక చవితి చేసుకొంటున్నారు’ అంటూ నారింజలతో చేసిన వినాయకుడి విగ్రహాన్ని ఉరేగిస్తున్న వీడియో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: హాలండ్‌లో రైతులు తమ పొలం లో పండిన నారింజలతో చేసిన వినాయక విగ్రహాన్ని ఉరేగిస్తూ వినాయక చవితి జరుపుకుంటున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియో 2018 ఫ్రాన్స్‌లో జరిగిన లెమన్ ఫెస్టివల్‌కి (Fête du Citron) సంబంధించింది. ఈ ఫెస్టివల్ థీమ్ లెమన్ కావడంతో ఇలా నిమ్మకాయలు మరియు నారిజలతో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసారు. 2018లో జరిగిన ఈ ఫెస్టివల్‌ని వార్తా సంస్థలు కూడా రిపోర్ట్ చేసాయి. ఈ వీడియోకి హాలండ్‌కి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
2019లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ వీడియో హాలండ్‌లో రైతులు నారింజలతో చేసిన వినాయక విగ్రహాంతో వినాయక చవితి జరుపుకున్నారంటూ సోషల్ మీడియాలో షేర్ చేసాడు, అప్పటి నుండి ఈ వీడియో హాలండ్‌కి సంబంధించినది అంటూ షేర్ అవుతుంది. ఇటీవల ప్రముఖ తెలుగు వార్తా సంస్థ సాక్షి కూడా ఇదే వీడియోని హాలండ్‌లో రైతులు తమ పొలంలో పండిన నారింజలతో చేసిన వినాయక విగ్రహాంతో వినాయక చవితి జరుపుకున్నారంటూ ప్రసారం చేసింది.
కాని ఈ వీడియోకి సంబంధించి మరింత సమాచారం కోసం గూగుల్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా అచ్చం వీడియోలో నారింజలతో తయారు చేసిన వినాయక విగ్రహాం ఫోటో ప్రచురించిన ఒక 2018 వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం ఫ్రాన్స్‌లో జరిగిన లెమన్ ఫెస్టివల్ సందర్భంగా కొందరు నిమ్మకాయలు మరియు నారింజలతో వినాయక విగ్రహాన్ని తయారు చేసారు.
పైన తెలిపిన వార్తా కథనం ఆధారంగా గూగుల్‌లో వేతగా 2018 ఫ్రాన్స్‌లో జరిగిన ఈ లెమన్ ఫెస్టివల్‌ని భారత న్యూస్ ఛానల్ రిపోర్ట్ చేసిన కథనం కనిపించింది, ఈ రిపోర్ట్ ప్రకారం 2018లో జరిగిన ఈ ఫెస్టివల్‌లో బాలీవుడ్ థీమ్ లో భాగంగా ఇలా నారింజలు మరియు నిమ్మకాయలతో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసారు. ఈ ఫెస్టివల్ ప్రతీ సంవత్సరం జరుగుతుంది. ఈ ఫెస్టివల్‌కి సంబంధించిన స్టాక్ ఫొటోస్, వీడియోస్ ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
ఈ లెమన్ ఫెస్టివల్ (Fête du Citron) అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో 2018 ఫెస్టివల్‌కి సంబంధించిన వీడియో అప్లోడ్ చేసారు. ఈ వీడియోలో వినాయకుడి విగ్రహాం పోస్టులోని విగ్రహాం రెండు ఒకటే, కాకపోతే ఈ వీడియోని వేరే యాంగిల్ నుండి తీసారు. ఈ వివరాల బట్టి ఈ వీడియో ఫ్రాన్స్‌లో జరిగిన లెమన్ ఫెస్టివల్‌కి సంబంధించిందని, ఈ వీడియోకి హాలండ్‌కి ఎటువంటి సంబంధంలేదని కచ్చితంగా చెప్పొచ్చు. పైగా ఈ విగ్రహాం వినాయక చవితి సందర్భంగా తయారు చేయలేదు.
చివరగా, 2018లో ఫ్రాన్స్‌లో జరిగిన లెమన్ ఫెస్టివల్‌లో నిమ్మకాయలు మరియు నారింజలతో వినాయకుడి విగ్రహాన్ని ప్రదర్శించారు, ఈ వీడియోకి హాలండ్‌కి ఎటువంటి సంబంధంలేదు.