Fake News, Telugu
 

సోమాలియా అరటిపండ్లలో హెలికోబాక్టర్ అనే పురుగు ఉందని, తిన్న 12 గంటల్లో బ్రెయిన్ డెడ్ అయి చనిపోతారనే వాదనలో నిజంలేదు

0

ఒక వీడియోను చూపించి సోమాలియా నుండి ఇటీవల వచ్చిన అరటిపండ్లు హెలికోబాక్టర్ అనే పురుగును కలిగి ఉన్నాయని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అరటి పండును తిన్న 12 గంటల తరువాత, ఆ వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయి చనిపోతాడని కూడా పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: వీడియోలో సోమాలియా అరటిపండ్లు హెలికోబాక్టర్ అనే పురుగును కలిగి ఉన్నాయి, ఇది తిన్న 12 గంటల తరువాత బ్రెయిన్ డెడ్ అయి చనిపోతారు.

ఫాక్ట్: హెలికోబాక్టర్ అనేది ఒక రకమైన బ్యాక్టీరియా, పురుగు కాదు. అబుదాబిలో ఇదే వీడియో వైరల్ అయినప్పుడు, అబుదాబి అగ్రికల్చర్, ఫుడ్ సేఫ్టీ అథారిటీ, ఈ వీడియో తప్పుదోవ పట్టించే సమాచారాన్ని కలిగి ఉందని తెలిపింది. సోమాలియా నుండి భారతదేశంలోకి 500 టన్నుల అరటిపండ్లు దిగుమతి చేయబడ్డాయని నిరూపించడానికి ఎటువంటి డేటా లేదు. వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారిక డేటా భారతదేశం సోమాలియా నుండి అరటిని దిగుమతి చేసుకోలేదని చూపిస్తుంది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే వీడియోతో ఉన్న ఒక పెర్షియన్ ఆర్టికల్ లభించింది. ఆర్టికల్ ప్రకారం, ఈ వీడియో ఇరాన్ సైబర్ స్పేస్ లో బాగా వైరల్ అయినట్టు తెలుస్తుంది, అరటిపండ్లు సోమాలియా నుండి ఇరాన్ కు దిగుమతి చేయబడ్డాయని క్లెయిమ్ చేస్తున్నారు. ఫుడ్ టాక్సికాలజీలో పిహెచ్‌.డి అయిన డాక్టర్ హాజీ మొహమ్మది మాట్లాడుతూ, ‘హెలికోబాక్టర్’ అనేది బాక్టీరియా పేరు, పురుగు కాదు అని అన్నారు. వీడియో యొక్క ప్రామాణికతను ధృవీకరించలేకపోయామని; పురుగులు నిజమని భావించినట్లయితే, అవి మానవులకు వ్యాధికారకమైనవి (pathogenic) కావు అని ఆర్టికల్‌లో తెలిపారు.

ఈ వీడియో వెస్ట్ ఏసియాలో వివిధ ప్రాంతాల్లో ఇదే క్లెయిమ్ తో వైరల్ అయింది. అబుదాబికి చెందిన అధికారులు ఈ వైరల్ వీడియో ద్వారా చెప్పేది తప్పు అని స్పష్టం చేసారు. పోస్టులోని సందేశంలో ‘తప్పుదోవ పట్టించే సమాచారం’ ఉందని తెలిపారు. వైరల్ వీడియో తప్పు అని అబుదాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. “వీడియోలో చూపించినంత పెద్దదిగా పురుగులు ఉన్నప్పుడు పండ్ల లోపల తమ లైఫ్ సైకిల్ పూర్తి చేయడానికి ఆస్కారం లేదు,” అని తెలిపారు.

ఈ క్లెయిం వాట్సాప్ లో విస్తృతంగా షేర్ అవటంతో, డాక్టర్ ఫహద్ అల్-ఖుడైరి పోస్టులో చెప్పిన విషయం ఫేక్ అని ట్వీట్ చేసారు. హెలికోబాక్టర్ అనేది ఒక రకమైన బ్యాక్టీరియా అని, పురుగు కాదని తెలిపారు.

హెలికోబాక్టర్:

హెలికోబాక్టర్ పైలోరీ అనేది ఒక రకమైన బ్యాక్టీరియా, పురుగు కాదు. హెలికోబాక్టర్ మన బాడీలో ఉండటం చాలా సాధారణం, ప్రపంచంలో 66% మంది శరీరాలలో ఇవి ఉన్నాయి. కొంతమందికి, బ్యాక్టీరియా కడుపు క్యాన్సర్ కు కారణం కావచ్చు, అనేక సంవత్సరాల తరువాత లక్షణాలు కనిపిస్తాయి. కానీ చాలా మందికి, ఈ బాక్టీరియా ఎటువంటి లక్షణాలను కలిగించదు. మంచి ఆరోగ్య అలవాట్లు, పరిశుభ్రమైన తాగునీరు ఉంటే బ్యాక్టీరియా నుండి తనను తాను రక్షించుకోవచ్చు.

వీడియోలో అరటి లోపలి నుండి తీసిన పురుగు లాంటి జాతులు, చాలా వరకు మాగ్గోట్స్ అయ్యిఉండవచ్చు. ‘లార్వా’ దశలో పండ్ల ఈగలను సాధారణంగా మాగ్గోట్స్ అని అంటారు. సాధారణంగా, ఆడ ఈగ గుడ్లు వేసినప్పుడు మాగ్గోట్స్ పండ్లలోకి చేరుతాయి. కానీ, వీడియోలో చూపించేది కచ్చితంగా ఇదే అని చెప్పలేము.

అరటిపండ్లు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే చౌకైన పండ్లలో ఒకటి. అరటిపండ్ల ప్రపంచ ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది, 2018-19 లో సుమారు 31.75 మిలియన్ మెట్రిక్ టన్నులు (ప్రపంచ ఉత్పత్తిలో సుమారు 32%) ఉత్పత్తి చేసింది. భారతదేశం కూడా అతిపెద్ద వినియోగదారులలో ఒకటి. 2018 లో, 25%తో  భారతదేశం అతిపెద్ద అరటి పండ్ల మార్కెట్‌గా ఉంది. రిపోర్ట్స్ ప్రకారం, భారతదేశం 2020-21 సమయంలో 619 కోట్ల విలువైన అరటిపండ్లను ఎగుమతి చేసింది.

సోమాలియా నుండి భారతదేశంలోకి 500 టన్నుల అరటిపండ్లు దిగుమతి చేయబడ్డాయని నిరూపించడానికి ఎటువంటి డేటా లేదు. వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారిక డేటా భారతదేశం సోమాలియా నుండి అరటిని దిగుమతి చేసుకోలేదని చూపిస్తుంది.

చివరగా, సోమాలియా అరటిపండ్లలో హెలికోబాక్టర్ అనే పురుగు ఉందని, తిన్న 12 గంటల్లో బ్రెయిన్ డెడ్ అయి చనిపోతారనే వాదనలో నిజంలేదు.

Share.

About Author

Comments are closed.

scroll