బ్రిడ్జి కింది నుండి విమానం ఎగురుతున్న అధ్బుత దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: బ్రిడ్జి కింది నుండి విమానం ఎగురుతున్న అధ్బుత దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియోని డిజిటల్ గ్రాఫిక్స్ ద్వారా రూపొందించారు. ఈ వీడియోని బ్రెజిల్ దేశానికి చెందిన ‘Vertex Trainings’ అనే గ్రాఫిక్ డిజైన్ స్కూల్ రూపొందించింది. లిక్విడ్ సిములేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ వీడియోని రూపొందించినట్టు ‘Vertex Trainings’ సంస్థ స్పష్టం చేసింది. ఈ వీడియోలో కనిపిస్తున్నవి నిజమైన దృశ్యాలు కావు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘verticetreinamentos’ (వెర్టెక్స్ ట్రైనింగ్) సంస్థ తమ ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసినట్టు తెలిసింది. ‘వెర్టెక్స్ ట్రైనింగ్స్’ అనేది బ్రెజిల్ దేశానికి చెందిన ఒక కంప్యూటర్ గ్రాఫిక్స్, డిజైన్ ట్రైనింగ్ స్కూల్ అని తెలిసింది.
ఈ వీడియోని రూపొందించిన విధానాన్ని వివరిస్తూ ‘వెర్టెక్స్ ట్రైనింగ్’ సంస్థ మేకింగ్ వీడియోని తమ ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. ఈ వీడియోని లిక్విడ్ సిములేషన్ టెక్నాలజీని ఉపయోగించి రూపొందించినట్టు ‘వెర్టెక్స్ ట్రైనింగ్’ స్పష్టం చేసింది. ఒక క్లయింట్ ఇంటి డోర్ నుండి తీసిన దృశ్యాలని, లిక్విడ్ సిములేషన్ గ్రాఫిక్స్ టెక్నాలజీని ఉపయోగించి సృష్టించిన విమానం మోషన్ దృశ్యాలతో జత చేస్తూ ఈ వీడియోని రూపొందించినట్టు ‘వెర్టెక్స్ ట్రైనింగ్’ సంస్థ తెలిపింది. ఈ వీడియోలో కనిపిస్తున్న బ్రిడ్జి కూడా డిజిటల్ గ్రాఫిక్స్ ద్వారా రూపొందించిందే అని ఈ ఇన్స్టాగ్రామ్ పోస్టులో స్పష్టం చేసారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో డిజిటల్ గ్రాఫిక్స్ ఉపయోగించి రూపొందించారని, ఈ వీడియోలో కనిపిస్తున్నవి నిజమైన దృశ్యాలు కావని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, డిజిటల్ గ్రాఫిక్స్ ఉపయోగించి రూపొందించిన వీడియోని విమానం బ్రిడ్జి కింది నుండి ప్రయాణిస్తున్న అద్భుత దృశ్యాలని షేర్ చేస్తున్నారు.