Fake News, Telugu
 

ఫోటోలోని కుర్రాడు తన తమ్ముడిని చంపినందుకు అరెస్ట్ అయ్యాడు, బ్రెడ్ దొంగతనం చేసినందుకు కాదు

0

ఒక కుర్రాడు కోర్టులో నిలబడి ఉన్న ఫోటోని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, దానితో పాటు ఒక కథని షేర్ చేస్తున్నారు. ఫోటోలో ఉన్న 15 ఏళ్ళ కుర్రాడు ఒక బేకరీ లో బ్రెడ్ దొంగతనం చేసి పారిపోతుండగా పెద్ద అద్దం పగిలిపోయిందని, ఆ బేకరీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ కుర్రాడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారని పోస్ట్ లో రాసారు. అమ్మ అనారోగ్యంతో ఉండడం, ఎవరూ పని ఇవ్వకపోవడంతో బ్రెడ్ దొంగతనం చేసానని ఆ కుర్రాడు చెప్పడంతో, ఒక కుర్రాడి ఆకలి తీర్చడంలో విఫలమైనందున కోర్టు లో ఉన్నవారిని, షాప్ యజమానిని జరిమానా కట్టాలని జడ్జీ తీర్పు ఇచ్చినట్టు పోస్ట్ లో పెట్టారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆకలి తీర్చుకోవడం కోసం బ్రెడ్ దొంగతనం చేసిన కుర్రాడి ఫోటో. కుర్రాడి ఆకలి తీర్చడంలో విఫలమైనందున కోర్టు లో ఉన్నవారని, షాప్ యజమానిని జరిమానా కట్టాలని తీర్పు ఇచ్చిన జడ్జీ.

ఫాక్ట్: ఫోటోలోని కుర్రాడిని పోలీసులు అరెస్ట్ చేసింది బ్రెడ్ దొంగతనం చేసినందుకు కాదు, తన తమ్ముడిని చంపినందుకు. 2011 లో తనకు 12 ఏళ్ళు ఉన్నప్పుడు క్రిస్టియన్ ఫెర్నాండెజ్ తన రెండేళ్ళ తమ్ముడిని బుక్ షెల్ఫ్ కి కొట్టి చంపాడు. పోస్ట్ లో చెప్పిన కోర్టు కథ నిజంగా జరిగినట్టు ఎక్కడా కూడా ఆధారాలు దొరకలేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోతో కూడిన చాలా న్యూస్ ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. ఫోటోలో ఉన్న కుర్రాడు క్రిస్టియన్ ఫెర్నాండెజ్ అని, తన తమ్ముడిని చంపిన ఆరోపణ మీద అతన్ని అరెస్ట్ చేసినట్టు ఇక్కడ చదవొచ్చు. 2011 లో తనకు 12 ఏళ్ళు ఉన్నప్పుడు ఫెర్నాండెజ్ తన రెండేళ్ళ తమ్ముడిని బుక్ షెల్ఫ్ కి కొట్టి చంపాడని ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

పోస్ట్ లో చెప్పిన కోర్టు కథ నిజంగా జరిగినట్టు ఎక్కడా కూడా ఆధారాలు దొరకలేదు. కుర్రాడి స్థానంలో ముసలావిడని పెట్టి, ఇలాంటి కథలే కొందరు వేరే సందర్భాల్లో షేర్ చేయగా, వాటిల్లో నిజం లేదని ‘Snopes’ మరియు ‘AFP’ వారు రాసిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

అవసరానికి కొద్దిగా ఆహారం దొంగలిస్తే తప్పు కాదని 2016 లో ఇటలీ కోర్టు చెప్పినట్టు ఇక్కడ చదవొచ్చు. తాజగా, బీహార్ లో తన తల్లి ఆకలి తీర్చేందుకు దొంగతనం చేసిన ఒక కుర్రాడికి జడ్జీ శిక్ష వేయకుండా రేషన్, బట్టలు ,ఇతర నిత్యవసర వస్తువులు ఇప్పించినట్టు ఇక్కడ చదవొచ్చు.

చివరగా, ఫోటోలోని కుర్రాడు తన రెండేళ్ళ వయసు తమ్ముడిని చంపినందుకు అరెస్ట్ అయ్యాడు, బ్రెడ్ దొంగతనం చేసినందుకు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll