Fake News, Telugu
 

బంగ్లాదేశ్ కి చెందిన రిక్షా డ్రైవర్ పరిస్థితిని చూపిస్తూ భారత దేశంలో పేదలకి ప్రభుత్వం ఇస్తున్న గౌరవం ఇదా అని షేర్ చేస్తున్నారు

0

తనకి రోజు ఉపాధి కల్పించే రిక్షాని సీజ్ చేసి పట్టుకెళ్లిపోతున్నారన్న బాధలో ఒక రిక్షా డ్రైవర్ ఏడుస్తున్నప్పుడు తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత దేశంలో పెదవారికి ఇస్తున్న గౌరవం ఇది, అంటూ ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.       

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఉపాధి కల్పించే రిక్షాని సీజ్ చేసి పట్టుకెళ్లిపోతున్నారన్న బాధలో ఏడుస్తున్న భారత దేశంలోని ఒక రిక్షా డ్రైవర్.

ఫాక్ట్ (నిజం): ఫోటోలో కనిపిస్తున్నది బంగ్లాదేశ్ కి చెందిన ఫజ్లుర్ రెహ్మాన్ అనే రిక్షా డ్రైవర్. తనకి ఉపాధి కల్పించే రిక్షాని ఢాకా మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు సీజ్ చేసి పట్టుకెళ్లిపోతున్నారన్న బాధలో ఫజ్లుర్ రెహ్మాన్ ఇలా ఏడ్చినట్టు విశ్లేషణలో తెలిసింది. ఈ ఘటన భారత దేశానికి సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోలని జాగ్రత్తగా గమనించగా, ఆ ఫోటోలపై ‘bdnews24.com’` అనే వాటర్ మార్క్ ఉండటం మనం చూడవచ్చు. ‘bdnews24.com’ అనేది బంగ్లాదేశ్ కి చెందిన ఒక న్యూస్ వెబ్ సైట్ అని మా విశ్లేషణలో తెలిసింది. పోస్టులో షేర్ చేసిన ఫోటోలని ఈ వివరాల ఆధారంగా రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే ఫోటోలని షేర్ చేస్తూ ‘bdnews24.com’ న్యూస్ వెబ్ సైట్ ‘05 అక్టోబర్ 2020’ నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. ఫోటోలో కనిపిస్తున్న ఈ ఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకా లోని జిగాతల ప్రాంతంలో చోటుచేసుకున్నట్టు అందులో తెలిపారు. ఫజ్లుర్ రెహ్మాన్ అనే రిక్షా డ్రైవర్, తన జీవనోపాధిగా భావించే రిక్షాని అక్కడి ప్రభుత్వ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు సీజ్ చేసి పట్టుకెళ్లిపోతున్నారన్న బాధతో  ఇలా ఏడ్చినట్టు ఆర్టికల్ లో తెలిపారు.

కరోన కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఫజ్లుర్ రెహ్మాన్, 80000 టాకాల (బాంగ్లాదేశ్ కరెన్సీ) లోన్ తీసుకొని బాటరీతో నడిచే రిక్షాని కొనుగోలు చేసుకున్నాడు. అయితే, ఇటివలే బాటరీతో నడిచే రిక్షాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేదించింది. ఢాకాలో బాటరీ తో నడిచే రిక్షాలన్నిటిని ఢాకా సౌత్ సిటీ కార్పొరేషన్ (DSCC) సీజ్ చేసి లారీలలో పట్టుకెల్తున్నప్పుడు జరిగిన ఘటన ఇది. ఇవే ఫోటోలని షేర్ చేస్తూ బంగ్లాదేశ్ కి చెందిన మరికొన్ని న్యూస్ వెబ్ సైట్స  పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ ని ఇక్కడ , ఇక్కడ చూడవచ్చు.

ఫజ్లుర్ రెహ్మాన్ ఏడుస్తున్నప్పుడు తీసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అతనికి సహాయం చేయడానికి చాల మంది ముందుకొచ్చినట్టు ‘Dhaka Tribune’ ఫజ్లుర్ రెహ్మాన్ కి సంబంధించి పబ్లిష్ చేసిన ఆర్టికల్ లో పేర్కొన్నారు. ‘Shwapno’ అనే ఈ-కామర్స్ కంపెనీ ఫజ్లుర్ రెహ్మాన్ కి రెండు రిక్షాలు కొని ఇచ్చింది అని అందులో తెలిపారు. ఈ ఘటనకి స్పందిస్తూ ఒక వ్యక్తి ఫజ్లుర్ రెహ్మాన్ తో పాటు మరో ఇద్దరికీ రిక్షాలని కొనిచ్చినట్టు ‘Times Now’ న్యూస్ వెబ్ సైట్ పబ్లిష్ చేసిన ఆర్టికల్ లో పేర్కొన్నారు.

చివరగా, బంగ్లాదేశ్ కి చెందిన రిక్షా డ్రైవర్ ఫోటోలని చూపిస్తూ భారత దేశంలో పేదలకి ప్రభుత్వం ఇస్తున్న గౌరవం ఇదా అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll