“ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో రోడ్డుపై నమాజ్ చేసినందుకు 150 మందిపై కేసు……ఈ చర్య తర్వాత UPలోని మసీదులు రోడ్డుపై నమాజ్ చేయవద్దని ముస్లింలను కోరుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసాయి”, అని చెప్తూ ఒక ఫోటోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తాజాగా ఆగ్రాలో 150 మందిపై పోలీసులు కేసు పెట్టడంతో, ఉత్తర్‌ప్రదేశ్‌లోని మసీదులు రోడ్డుపై నమాజ్ చేయవద్దని ముస్లింలను కోరుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్న ఫోటో.
ఫాక్ట్: పోస్ట్‌లోనిది 2019లో తీసిన ఫోటో. తాజాగా ఆగ్రాలో 150 మందిపై పోలీసులు కేసు పెట్టాక తీసిన ఫోటో కాదు. పోలీసుల చొరవతో ఆ బ్యానర్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిసింది. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.
తాజాగా ఆగ్రాలో రోడ్డుపై నమాజ్ చేసినందుకు 150 మందిపై పోలీసులు కేసు పెట్టినట్టు తెలిసింది.

అయితే, పోస్ట్‌లోని ఫోటోకి సంబంధించిన వివరాల కోసం గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, అదే ఫోటోని మీరట్ పోలీసులు 2019లో ట్వీట్ చేసినట్టు తెలిసింది.
కొన్ని పదాలతో గూగుల్ సెర్చ్‌లో వెతకగా, రోడ్డుపై నమాజ్ చేయవద్దని ముస్లింలను కోరుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల గురించి వివిధ వార్తాసంస్థలు 2019లో అదే ఫోటోతో ప్రచురించిన ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్‌లో వచ్చాయి. వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. మీరట్ పోలీసుల చొరవతో ముస్లింలు రోడ్లపై ప్రార్థనలు చేయడం మానుకున్నారని, ఇదే విషయం ప్రజలకు చెప్తూ మసీదు కమిటీలు బ్యానర్లను ఏర్పాటు చేశారని ఆర్టికల్స్‌లో చదవచ్చు.

చివరగా, రోడ్డుపై నమాజ్ చేయవద్దని ముస్లింలను కోరుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్న పోస్ట్‌లోని ఫోటో 2019లోనిది.