Fake News, Telugu
 

కేవలం ‘ప్రధానమంత్రి స్వనిధి యోజన’ పథకానికి సంబంధించి ఒక మహిళ చేసిన వ్యాఖ్యలని ఎడిట్ చేసి తప్పుదోవ పట్టిస్తున్నారు

0

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్సులో ఒక మహిళ  తనకు ప్రధానమంత్రి పథకాలేవి అందడం లేదని నరేంద్ర మోదీకి తెలిపినట్టు సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఈ వీడియోని ఇదే క్లెయింతో ఆమ్ ఆద్మీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ట్విట్టర్ అకౌంట్లలో షేర్ చేసారు. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో చూద్దాం.   

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల నిర్వహించిన టెలి కాన్ఫరెన్సులో ఒక మహిళ తనకు ప్రధానమంత్రి పథకాలేవి అందడం లేదని సమాధానమిచ్చిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ‘Aazadi@75’ కార్యక్రమంలో నరేంద్ర మోదీ ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ పథకం లబ్దిదారులతో సంభాషిస్తున్న దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ఉత్తరప్రదేశ్ లలిత్‌పుర్‌ నగరానికి చెందిన బబితా, ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ పథకం ద్వారా నేరుగా తమ ఖాతాలో రెండున్నర లక్షల (2.5 lakhs) రూపాయలు జమ అయినట్టు ఈ టెలి కాన్ఫరెన్స్ లో ప్రధానికి తెలిపారు. కేవలం, ‘ప్రధానమంత్రి స్వనిధి యోజన’ పథకం లాభాలు మాత్రమే తాను పొందలేదని బబితా ఈ టెలి కాన్ఫరెన్సులో ప్రధానికి తెలిపారు. ‘ప్రధానమంత్రి స్వనిధి యోజన’ పథకానికి సంబంధించి బబితా చేసిన వ్యాఖ్యలని మాత్రమే ఎడిట్ చేస్తూ పోస్టులోని వీడియోని రూపొందించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం కీ పదాలు ఉపయోగించి గుగూల్‌లో వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘India Today’ న్యూస్ సంస్థ 05 అక్టోబర్ 2021 నాడు తమ ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసినట్టు తెలిసింది. ఉత్తరప్రదేశ్ లక్నో నగరంలో నిర్వహించిన ‘Aazadi@75’ కార్యక్రమంలోని దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు. ‘Aazadi@75’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ పథకం లబ్దిదారురాలైన బబితాతో ప్రధాని ముచ్చటించారు. ఉత్తరప్రదేశ్ లలిత్‌పుర్‌ నగరానికి చెందిన బబితా, ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ పథకం ద్వారా తమ ఖాతాలో నేరుగా రెండున్నర లక్షల రూపాయలు (2.5 lakhs) జమ అయినట్టు ఈ టెలి కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానికి తెలిపారు. ఆ డబ్బుతో తాము పక్కా ఇల్లు నిర్మించుకున్నట్టు బబితా మోదీకి తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వీడియోని ‘India Today’ న్యూస్ సంస్థ తమ యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసింది.

అయితే, నరేంద్ర మోదీ, “ప్రధానమంత్రి స్వనిధి యోజన’ పథకం ద్వారా డబ్బులు అందుతున్నాయా?”, అని బబితాను ప్రశ్నించినప్పుడు, ఆమె అందడం లేదని చెప్పింది. దీనితో, నరేంద్ర మోదీ ఆమెకు ‘ప్రధానమంత్రి స్వనిధి యోజన’ పథకం జాబితాలో చేరే విధానం, ఆ పథకం ద్వారా పొందే లాభాలను వివరించారు. బబితాతో సంభాషించిన వీడియోని నరేంద్ర మోదీ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసారు.

అంతేకాదు, ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ పథకం ద్వారా కూడా తమ కుటుంబానికి లబ్ది చేకురినట్టు బబితా ఈ  టెలి కాన్ఫరెన్సులో స్పష్టం చేసింది.  కేవలం, ‘ప్రధానమంత్రి స్వనిధి యోజన’ పథకానికి సంబంధించి బబితా చేసిన వ్యాఖ్యలని ఎడిట్ చేస్తూ పోస్టులోని వీడియోని రూపొందించారని ఈ వివరాల ఆధారంగా ఖచ్చితంగా చెప్పవచ్చు.  

చివరగా, ఎడిట్ చేసిన వీడియోని లైవ్ టెలి కాన్ఫరెన్సులో ఒక మహిళ తనకు ప్రభుత్వ పథకాలేవి అందడం లేదని నరేంద్ర మోదీకి తెలుపుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll