Fake News, Telugu
 

ఢిల్లీలోని షాజహాన్ నిర్మించిన ఎర్రకోటకు, అనంగ్‌పాల్ తోమార్ నిర్మించిన ‘లాల్ కోట్’కు సంబంధంలేదు

0

“ఢిల్లీలోని ఎర్రకోటను రాజా ‘అనంగ్‌పాల్ జీ’ 1052లో నిర్మించారు” అని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. అనంగ్‌పాల్ నిర్మించిన ఎర్రకోట షాజహాన్ నిర్మించినట్లు చరిత్రలో నేర్పించారని పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఢిల్లీలోని ఎర్రకోటను రాజా అనంగ్‌పాల్ 1052లో నిర్మించారు.

ఫాక్ట్ (నిజం): కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆర్కియోలాజికల్ సర్వే అఫ్ ఇండియా ప్రకారం, రెడ్ ఫోర్ట్ (ఎర్ర కోట)ని 1639లో షాజహాన్ మొదలుపెట్టి తొమ్మిది సంవత్సరాలలో పూర్తి చేసాడు. అనంగపాల్ తోమర్ 1052లో కట్టించింది ‘లాల్ కోట్’. ఇది కూడా ఇప్పటి ఢిల్లీలోనే ఉన్నప్పటికీ, దీనికి, ఎర్ర కోటకి సంబంధం లేదు. రెండిటి మధ్య దూరం దాదాపు 23 కిలోమీటర్లు. ఈ లాల్ కోట్ ని ‘క్విలా రాయి పితోరా’ అని కూడా అంటారు. అనంగ్‌పాల్ తోమర్ నిర్మించిన ‘లాల్ కోట్’ను ఒరిజినల్ ‘రెడ్ ఫోర్ట్’గా, మరియు మొదటి ‘రెడ్ ఫోర్ట్’గా కూడా పిలుస్తారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆర్కియోలాజికల్ సర్వే అఫ్ ఇండియా ప్రకారం, రెడ్ ఫోర్ట్ (ఎర్ర కోట)ని 1639లో షాజహాన్ మొదలుపెట్టి తొమ్మిది సంవత్సరాలలో పూర్తి చేసాడు. భారత ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఈ ఎర్రకోట నుండే దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.

తోమర్ వంశానికి చెందిన అనంగ్‌పాల్ ‘లాల్ కోట్’ను 1052న కట్టించాడు, 12 వ శతాబ్దంలో పృథ్వీరాజ్ చౌహాన్ దానిని స్వాధీనం చేసుకుని తన నగరం ఖిలా రాయ్ పితోరాగా విస్తరించాడు. ఈ లాల్ కోట్ ని ‘క్విలా రాయి పితోరా’ అని కూడా అంటారు. ‘లాల్ కోట్’ను ఢిల్లీ యొక్క మొదటి నగరం అని కూడా అంటారు. ఢిల్లీ ప్రవేశ ద్వారం వద్ద అరావళి శ్రేణిలో అత్యంత వ్యూహాత్మక భాగంలో ఉన్న ఈ క్విలా భారతదేశ చరిత్ర యొక్క అనేక హెచ్చుతగ్గులకు సాక్షిగా ఉంది. దీనికి మరియు 17 వ శతాబ్దంలో షాజహాన్ కట్టించిన ఎర్రకోటకు సంబంధంలేదు.

మెహ్రౌలీ, సంజయ్ వాన్, కిషన్ ఘర్ మరియు వసంత్ కుంజ్ ప్రాంతాలలో కనిపించే ‘లాల్ కోట్’ యొక్క గోడల అవశేషాలు దక్షిణ ఢిల్లీ అంతటా ఉన్నాయి. ‘లాల్ కోట్’ కూడా ఇప్పటి ఢిల్లీలోనే ఉన్నప్పటికీ, దీనికి, 17 వ శతాబ్దంలో షాజహాన్ కట్టించిన ఎర్ర కోటకి సంబంధం లేదు. రెండిటి మధ్య దూరం దాదాపు 23 కిలోమీటర్లు. గూగుల్ మాప్స్ ద్వారా కూడా చూడొచ్చు.

అనంగ్‌పాల్ తోమర్ నిర్మించిన ‘లాల్ కోట్’ను ఒరిజినల్ ‘రెడ్ ఫోర్ట్’గా, మరియు మొదటి ‘రెడ్ ఫోర్ట్’గా పిలుస్తారని ‘ది హిందూ’ వారు ప్రచురించిన ఆర్టికల్ ద్వారా చూడొచ్చు. ఢిల్లీ మొదటి నగరం – లాల్ కోట్/క్విలా రాయి పితోరా- మెహ్రౌలిలో ఉంది. లాల్ ఖిలా (ఎర్రకోట) ఉన్నది ఏడవ నగరం షాజహనాబాద్; లాల్ కోట్ కు 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధ్యలో సిరి, జహాన్పనా, తుగ్లఖాబాద్, ఫిరోజాబాద్ మరియు దింపనా/షేర్ షా ఘర్ అనే మరో ఐదు నగరాల శిథిలాలు ఉన్నాయి. 736వ సంవత్సరం నుండే పట్టణ స్థావరంగా ఢిల్లీని తోమర్ రాజ్యం వారు పునాది వేసినట్లు తెలుస్తుంది. 11వ శతాబ్దంలో అనంగ్‌పాల్ పాలనలోనే లాల్ కోట్, అనంగ్తాల్ బావోలి (రెండూ దక్షిణ ఢిల్లీలో) నిర్మించబడ్డాయని కూడా తెలుస్తుంది.

చివరగా, ఢిల్లీలోని షాజహాన్ నిర్మించిన ఎర్రకోటకు మరియు అనంగ్‌పాల్ తోమార్ నిర్మించిన ‘లాల్ కోట్’కు సంబంధంలేదు.

Share.

About Author

Comments are closed.

scroll