Fake News, Telugu
 

ఈ ఎనిమిది సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్,డీజిల్‌పై వసూలు చేసిన ఎక్సైజ్ డ్యూటీలో రాష్ట్రాల వాటా చాలా తక్కువే

0

‘గత 8 ఏళ్ళల్లో పెట్రోల్ మరియు డీజిల్‌పై 27 లక్షల కోట్లు ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వసూలైతే అందులో 16లక్షల కోట్లు రాష్ట్రాలకు కేటాయించగా, కేవలం 7 లక్షల కోట్లు మాత్రమే కేంద్రం తీసుకుందని’  చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా పోస్టులో చెప్తున్నదాంట్లో నిజమెంతుందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘గత 8 ఏళ్ళల్లో పెట్రోల్ మరియు డీజిల్‌పై 27 లక్షల కోట్లు ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వసూలైతే అందులో 16లక్షల కోట్లు రాష్ట్రాలకు కేటాయించగా, కేవలం 7 లక్షల కోట్లు మాత్రమే కేంద్రం తీసుకుంది.’

ఫాక్ట్ (నిజం): కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో తెలిపిన సమాచారం ప్రకారం 2014-22 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై సుమారు 27 లక్షల కోట్లు ఆర్జించింది. ఐతే ఇందులో ఎక్కువ శాతం కేంద్రానికే వెళ్ళగా, రాష్ట్రాలకు చాలా తక్కువ వాటా వచ్చింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీలో ఎక్కువ శాతం సెస్సుల రూపంలో వసూలు చేస్తుండడంతో, ఇందులో నుండి రాష్ట్రాలకు ఎటువంటి వాటా రావట్లేదు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం రూ. 27.90 ఎక్సైజ్ డ్యూటీని వసూలు చేస్తుండగా, ఇందులో కేవలం బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసే రూ. 1.40లో మాత్రమే అన్ని రాష్ట్రాలకు వాటా ఉంటుంది. మిగతా  రూ. 26.50లో పూర్తిగా కేంద్రానికే వెళ్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇటీవల లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం అందించిన వివరాల (ఇక్కడ మరియు ఇక్కడ) ప్రకారం 2014-15 నుండి 2021-22 (ఏప్రిల్-డిసెంబర్) మధ్య కాలంలో పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సుమారుగా 25 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది.

ఐతే పోస్టులో చెప్తున్నట్టు కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో 16 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా అందించినట్టు చేస్తున్న వాదన కరెక్ట్ కాదు. ఎలాగంటే, సాధారణంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్/డీజిల్‌పై బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ + స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (సెస్)+ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (సెస్)+ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (సెస్) అనే నాలుగు పన్నుల రూపంలో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని విధిస్తుంది.

ఐతే ఈ నాలుగు రూపాలలో వసూలు చేసే ఈ ఎక్సైజ్ డ్యూటీలో కేవలం బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ కింద వసూలు చేసే దాంట్లో నుండే రాష్టాలకు వాటా ఉంటుంది. మిగతా మూడు పన్నులు సెస్ రూపంలో వసూలు చేస్తారు కాబట్టి వాటిలో రాష్ట్రాలకు ఎటువంటి వాటా ఉండదు.

 ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీలో రాష్ట్రాలకు వాటాలేని సెస్లను పెంచుతూ, రాష్ట్రాలకు వాటా ఉన్న బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ వస్తుంది. 2014 నుండి 2017 వరకు బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని పెంచినప్పటికీ, ఆ తర్వాత తగ్గిస్తూ వచ్చింది.  ఇలా చేయడం ద్వారా పెట్రోల్/ డీజిల్‌పై కేంద్ర వసూలు చేసే పన్నులలో రాష్ట్రాల వాటా తగ్గిపోతుంది.

ప్రస్తుతం లీటర్ పెట్రోల్/ డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం పైన తెలిపిన నాలుగు రూపాలలో రూ. 27.90 ఎక్సైజ్ డ్యూటీని వసూలు చేస్తుండగా, ఇందులో కేవలం బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసే రూ. 1.40లో మాత్రమే అన్ని రాష్ట్రాలకు వాటా ఉంటుంది. మిగతా  రూ. 26.50లో పూర్తిగా కేంద్రానికే వెళ్తుంది.

అంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీలో 95% కేంద్రానికే వెళ్తుండగా, కేవలం 5% మాత్రమే అన్ని రాష్ట్రాలకు పంచుతున్నారు.  దీన్నిబట్టి 2014-22 వరకు కేంద్రం ఆర్జించిన 25 లక్షల కోట్లలో ఎక్కువ శాతం కేంద్రానికే వెళ్ళగా, రాష్ట్రాలకు చాలా తక్కువ వాటా అందిందని స్పష్టమవుతుంది.

చివరగా, ఈ ఎనిమిది సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్/డీజిల్‌పై వసూలు చేసిన ఎక్సైజ్ డ్యూటీలో రాష్ట్రాల వాటా చాలా తక్కువే.

Share.

About Author

Comments are closed.

scroll