Fake News, Telugu
 

‘వందేమాతరం’ పేరుతో ఉన్న 1931 నాటి ఈ ఉర్దూ పత్రికను కేవలం ముస్లిం యజమాని, సిబ్బంది నడిపారని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

కేవలం ముస్లిం యజమాని, ముస్లిం సిబ్బంది మాత్రమే నడిపిన ‘వందేమాతరం’ పేరుతో ఉన్న 1931 నాటి ఉర్దూ పత్రిక ఫోటో అంటూ ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కేవలం ముస్లిం యజమాని, ముస్లిం సిబ్బంది మాత్రమే నడిపిన ‘వందేమాతరం’ పేరుతో ఉన్న 1931 నాటి ఉర్దూ పత్రిక ఫోటో.

ఫాక్ట్: ‘వందేమాతరం’ పేరుతో ఉన్న 1931 నాటి ఉర్దూ పత్రిక యొక్క సంపాదకుడి (ఎడిటర్) పేరు కరంచంద్ శుక్లా. ముగ్గురు సహచరుల (అసోసియేట్స్) పేర్లు కుమారి లజ్యవతి, రాంప్రషాద్ బి. ఎ. మరియు లాలా ఫిరోజ్ చంద్. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.       

ఈ ఫోటోను గూగుల్ లెన్స్ ఉపయోగించి అనువదించడానికి ప్రయత్నించాము, అయితే ఆ పత్రికపై కేవలం ముస్లిం యజమాని, ముస్లిం సిబ్భంది ఉన్నట్టుగా ఆధారాలు దొరకలేదు. గూగుల్ లెన్స్ ద్వారా మాకు కుమారి అనే పేరు ఉన్నట్టు తెలిసింది, కానీ, ఆ పేరు ఎందుకు మాస్ట్ హెడ్ దేగ్గర్లో ఉందో స్పష్టంగా తెలియలేదు. మాములుగా పత్రికకు సంబంధించిన వారి పేర్లు మాత్రమే అక్కడ ఉంచుతారు.

‘వందేమాతరం’ పేరుతో ఉన్న 1931 నాటి ఉర్దూ పత్రిక గురించి గూగుల్లో వెతకగా, ఈ పత్రికను లాలా లజపత్ రాయ్ లాహోర్ లో స్థాపించినట్టు కొన్ని వెబ్సైటుల్లో పేర్కొన్నారు (ఇక్కడ మరియు ఇక్కడ).

ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే ఫోటో జర్నలిస్ట్ రాహుల్ దేవ్ యొక్క ట్విట్టర్ అకౌంట్‌లో లభించింది. తను చేసిన ట్వీట్‌లో, “(ఈ పత్రిక) ముద్రించిన సంపాదకుడి (ఎడిటర్) పేరు కరంచంద్ శుక్లా. ముగ్గురు సహచరుల (అసోసియేట్స్) పేర్లు మాస్ట్ హెడ్ యొక్క కుడివైపున ముద్రించబడ్డాయి – కుమారి లజ్యవతి, రాంప్రషాద్ బి. ఎ. మరియు లాలా ఫిరోజ్ చంద్. ఆ రోజుల్లో (అంటే స్వతంత్రం ముందు) ఉర్దూ ముస్లిముల భాష మాత్రమే కాదు. అందువల్ల ఉర్దూ వార్తాపత్రికలను ముస్లింలు మాత్రమే ముద్రించారని భ్రమ (పడొద్దు).

‘వందేమాతరం’ ఉర్దూ పత్రిక గురించి గవర్నమెంట్ ఆర్కైవ్స్‌లో వెతకగా, లాలా లజపత్ రాయ్ 1920లో ఈ పత్రికను స్థాపించినట్టు పేర్కొన్న పీఐబీ కథనం లభించింది. అమృత్‌ మహోత్సవ్‌ వైబ్సైటులో కూడా ఈ విషయం గురించి పేర్కొన్నారు.

కొంత మంది ముస్లింలు వందేమాతరం మేము పాడమని, మా మత విశ్వాసాలకు అది వ్యతిరేకమని ఎప్పటినించో అంటున్నట్టు తెలుస్తుంది. 2013లో పార్లమెంట్లో వందేమాతరం పాడుతుండగా ఒక మధ్యప్రదేశ్ కు సంబంధించిన సభ్యుడు లేచి వెళ్ళిపోయాడు, దీన్ని అప్పటి స్పీకర్ మీరాకుమార్ తీవ్రంగా ఖండించారు.

చివరగా, ‘వందేమాతరం’ పేరుతో ఉన్న 1931 నాటి ఈ ఉర్దూ పత్రికను కేవలం ముస్లిం యజమాని, ముస్లిం సిబ్బంది మాత్రమే నడిపారని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll