వరంగల్ వేయి స్తంభాల గుడి మండపంలో క్రైస్తవమత ప్రార్థనలు అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. వీడియోలో కొందరు క్రైస్తవ ప్రార్థనలు చేయడం కనిపిస్తుంది. ఈ కథనం ద్వారా దీనికి సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: వరంగల్ వేయి స్తంభాల గుడి మండపంలో క్రైస్తవమత ప్రార్థనలు చేస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ ఘటన జరిగింది ఖిలా వరంగల్‌లోని ఒక పురాతన ఆలయ ప్రాంగణంలో, హన్మకొండలోని వేయి స్తంభాల గుడిలో కాదు. ఈస్టర్ సందర్భంగా కొందరు ఏకశిల చిల్డ్రన్స్ పార్క్‌లోని ఒక ప్రాచీన ఆలయంలో క్రైస్తవ మత ప్రార్ధనలు నిర్వహించారు. ఐతే ఈ ప్రార్ధనలను వీహెచ్‌పీ సభ్యలు అడ్డుకోగా, పోలీసులు నిర్వాహకులపై కేసు నమోదు చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వీడియోలో కనిపిస్తున్నట్టు కొందరు భక్తులు గుడి ప్రాంగణంలో క్రైస్తవమత ప్రార్థనలు జరిపిన మాట నిజమైనప్పటికీ, ఈ ఘటన జరిగింది హన్మకొండలోని వేయి స్తంభాల గుడిలో కాదు.
వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ ఘటనను రిపోర్ట్ చేసిన వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనంలో చెప్తున్న దాని ప్రకారం ఖిలా వరంగల్‌లోని ఏకశిల చిల్డ్రన్స్ పార్క్‌లోని కాకతీయ కాలం నాటి పురాతన ఆలయ ప్రాంగణంలో కొంత మంది క్రైస్తవులు ఈస్టర్ సందర్భంగా ప్రార్ధనలు నిర్వహించారు.
ఐతే ఈ విషయం తెలిసిన వీహెచ్‌పీ సభ్యలు పోలీసులతో కలిసి వీటిని అడ్డుకున్నారు. కాగా దేవాలయం ప్రార్ధనలు చేసినందుకు పాస్టర్ మరియు మరి కొంతమందిపై కేసు నమోదు చేసినట్టు మిల్స్ కాలనీ పోలీసులు తెలిపారు.
ఇదే విషయం మీద వరంగల్ పోలీస్ కమీషనర్ ట్వీట్ కూడా చేసారు.
వైరల్ అవుతున్న వీడియోను రిపోర్ట్ చేసిన మరొక వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు. ఈ కథనం కూడా ఈ సంఘటన ఖిలా వరంగల్‌లోని ఒక ప్రాచీన గుడిలో జరిగిందని రిపోర్ట్ చేసింది. ఖిలా వరంగల్, ఏకశిలా పార్క్‌లోని శంభుని గుడి ప్రాంగణంలో ఈస్టర్ సందర్భంగా క్రైస్తవ మత ప్రార్ధనలు నిర్వహించడంతో వారిని వీహెచ్‌పీ సభ్యలు అడ్డుకున్నారని ఈ కథనం రిపోర్ట్ చేసింది.
చివరగా, గుడిలో క్రైస్తవ ప్రార్థనలు నిర్వహించిన ఈ ఘటన జరిగింది హన్మకొండలోని వేయి స్తంభాలలో గుడిలో కాదు.