హన్మకొండలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి) విద్యా సంస్థలో అడ్మిషన్ కోసం వచ్చిన రాజస్థాన్‌కు చెందిన ఒక విద్యార్థి హన్మకొండ బస్టాండ్ నుండి ఎన్ఐటి క్యాంపస్‌కు వచ్చిన ఆటోలో సర్టిఫికెట్లు ఉన్న తన బ్యాగ్‌ని మర్చిపోయాడని, ఎన్ఐటిలో అడ్మిషన్ కోసం రేపటిలోగా సర్టిఫికెట్లను సబ్మిట్ చేయాల్సి ఉందని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా షేర్ అవుతోంది. ఒకవేళ ఆ విద్యార్థి బ్యాగ్ దొరికితే ఎన్ఐటిలో గానీ ఆ విద్యార్థికి గానీ అందజేయాలని కోరుతూ ఈ పోస్టుని షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: వరంగల్ ఎన్ఐటిలో అడ్మిషన్ కోసం వచ్చిన రాజస్థాన్‌కు చెందిన విద్యార్థి ఆటోలో తన సర్టిఫికెట్లు కలిగిన బ్యాగ్‌ని మారిచిపోయాడంటూ షేర్ చేస్తున్న పోస్ట్.
ఫాక్ట్ (నిజం): పోస్టులోని అదే సమాచారాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో కనీసం 2022 ఆగస్టు నెల నుండి పోస్టులు పెడుతున్నట్టు తెలిసింది. ఆటోలో సర్టిఫికెట్ల బ్యాగుని పోగొట్టుకున్న రాజస్థాన్‌కు చెందిన విద్యార్థికి హన్మకొండ పోలీసులు 24 గంటల్లోపే అతని సర్టిఫికెట్లు తిరిగి అందచేసినట్టు రిపోర్ట్ చేసిన వార్తా కథనం యొక్క స్క్రీన్ షాట్‌ని ఒక యూసర్ 20 ఆగస్టు 2022 నాడు తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్టులో తెలుపుతున్న సమాచారానికి సంబంధించిన వివరాల కోసం కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, ఇదే సమాచారాన్ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో కనీసం 2022 ఆగస్టు నెల నుండి పోస్టులు పెట్టినట్టు తెలిసింది.
ఈ సంఘటనకు సంబంధించి పబ్లిష్ అయిన వార్తాపత్రిక కథనం స్క్రీన్ షాట్‌ని ఒక యూసర్ 20 ఆగస్టు 2022 నాడు షేర్ చేశారు. హన్మకొండలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో అడ్మిషన్ కోసం వచ్చిన రాహుల్ శర్మ అనే రాజస్థాన్ విద్యార్థి హన్మకొండ నుండి ఎన్ఐటి క్యాంపస్‌కు వచ్చిన ఆటోలో సర్టిఫికెట్లు, ల్యాప్‌ట్యాప్ ఉన్న తన బ్యాగ్‌ని పోగొట్టుకున్నట్టు ఈ వార్తా కథనంలో రిపోర్ట్ చేశారు. విషయం వరంగల్ కమిషనరేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బందికి తెలిజేయడంతో పోలీసులు 24 గంటల్లోపే సర్టిఫికెట్లు వెతికి విద్యార్థికి అందజేసినట్టు ఈ వార్తా కథనంలో రిపోర్ట్ చేశారు. రాజస్థాన్‌కు చెందిన విద్యార్థి ఇటీవల ఎన్ఐటిలో అడ్మిషన్ కోసం వస్తు మళ్ళీ సర్టిఫికెట్లు పోగొట్టుకున్నట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదు.
చివరగా, వరంగల్ ఎన్ఐటిలో అడ్మిషన్ కోసం వచ్చిన రాజస్థాన్ విద్యార్థి ఆటోలో సర్టిఫికెట్లు పోగొట్టుకున్నారంటూ షేర్ చేస్తున్న సమాచారం పాత సంఘటనకు సంబంధించినది.