09 ఫిబ్రవరి 2024న ఢిల్లీ వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ అమిత్ షా, ప్రధాని మోదీ కాళ్లు మొక్కారు అని కొన్ని ఫోటోలు (ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే వైఎస్ జగన్ అమిత్ షా కాళ్లు మొక్కిన ఫోటోని రిపోర్ట్ చేస్తూ ‘Way2News’ పబ్లిష్ చేసిన కథనమంటూ ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: వై.ఎస్.జగన్ మోదీ, అమిత్ షా కాళ్లు మొక్కారు. దానికి సంబందించిన ఫోటోలు.
ఫాక్ట్(నిజం): వై.ఎస్.జగన్ అమిత్ షా కాళ్లు మొక్కినట్లు చూపిస్తున్న ఈ వైరల్ ఫోటో, రెండు వేర్వేరు ఫోటోలను జోడిస్తూ మార్ఫింగ్ చేయబడింది. 2009లో జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళి అర్పిస్తునప్పుడు తీసిన ఫోటోను, అలాగే 2023లో అమిత్ షా బీజేపీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషీని ఆయన నివాసంలో కలిసి ఆశీస్సులు తీసుకున్న సందర్భంగా తీసిన ఫోటోను జోడిస్తూ మార్ఫింగ్ చేస్తూ ఈ వైరల్ ఫోటో రూపొందించారు. అలాగే 2023లో అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వీడ్కోలు కార్యక్రమంలో వై.ఎస్.జగన్ గవర్నర్ కాళ్లు మొక్కినపుడు తీసిన ఫోటోను మార్ఫింగ్ చేస్తూ వై.ఎస్.జగన్ మోదీ కాళ్లు మొక్కినట్లు ఫోటో రూపొందించారు. అంతేకాకుండా,ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో అని ‘Way2News’ సంస్థ X పోస్టు ద్వారా స్పష్టత ఇచ్చింది. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు .
ముందుగా వైరల్ పోస్టులో తెలుపుతున్నట్టు ఇటీవల ఢిల్లీలో మోదీతో భేటీ అయిన వై.ఎస్.జగన్ అమిత్ షా కాళ్లు మొక్కారా అనే విషయాన్ని గురించి తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్.జగన్ 09 ఫిబ్రవరి 2024న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోదీని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లినట్లు పలు రిపోర్ట్స్( ఇక్కడ & ఇక్కడ) లభించాయి, కానీ వైరల్ పోస్టులో చెప్పినట్లు జగన్ అమిత్ షా, మోడీ కాళ్లు మొక్కారని చెప్పే ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు.
వై.ఎస్.జగన్ మోదీ కాళ్లు మొకుతున్నట్లు చూపిస్తున్న వైరల్ ఫోటోకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అసలైన ఫోటో 2023లో అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వీడ్కోలు కార్యక్రమంలో జగన్ గవర్నర్ కాళ్లు మొక్కినపుడు తీసిన ఫోటోగా తెలిసింది, ఇదే ఫోటోను రిపోర్ట్ చేస్తున్న పలు వార్త కథనాలు ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు. దీన్ని బట్టి అసలు ఫోటోకి మోదీ తలను జోడించి మార్ఫింగ్ చేస్తూ వైరల్ ఫోటో రూపొందించారు అని నిర్థారించవచ్చు.
అలాగే వై.ఎస్.జగన్ అమిత్ షా కాళ్లు మొకుతున్నట్లు చూపిస్తున్న వైరల్ ఫోటోకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ ఫోటోలో కనిపిస్తున్న జగన్ ఫోటో 2009లోతన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళి అర్పిస్తునప్పుడు తీసిన ఫోటోగా తెలిసింది. అలాగే ఈ వైరల్ ఫోటోలో కనిపిస్తున్న అమిత్ షాకి సంబంధించిన ఫోటో కోసం వెతకగా, ఇదే ఫోటోను అమిత్ షా జనవరి 2023లో తన X(ట్విట్టర్)లో షేర్ చేశారు అని తెలిసింది. ఈ ఫోటో అమిత్ షా బీజేపీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషీని ఆయన నివాసంలో కలిసి ఆశీస్సులు తీసుకున్న సందర్భంగా తీసింది. దీన్ని బట్టి ఈ వైరల్ ఫోటో మార్ఫింగ్ చేయబడింది అని నిర్థారించవచ్చు.
అంతేకాకుండా, ఈ వార్తను Way2News సంస్థ కూడా ప్రచురించలేదు అని తెలిసింది. వైరల్ పోస్టులో షేర్ చేసిన వార్త కథనం పైన ఉన్న ఆర్టికల్ లింక్ (https://way2.co/p4p3kq) ద్వారా ‘Way2News’లో వెతికితే “కేసీఆర్, జగన్ కలిసి తెలంగాణకు అన్యాయం చేశారు: ఉత్తమ్” అనే టైటిల్‌తో ప్రచురించిన అసలైన వార్త దొరికింది. దీన్ని బట్టి అసలైన ‘Way2News’ కథనాన్ని ఎడిట్ చేస్తూ పోస్టులో షేర్ చేసిన ఫోటోని రూపొందించారు అని నిర్థారించవచ్చు.
ఈ వార్త వైరల్ అవడంతో, Way2News సంస్థ X(ట్విట్టర్) పోస్ట్ ద్వారా స్పందిస్తూ “మా లోగోను ఉపయోగించి కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది మరియు ‘అటాచ్ చేసిన పోస్ట్’ వైరల్‌గా మారింది” అంటూ ఈ వార్త కథనం ఫేక్ అని స్పష్టత ఇచ్చారు.
చివరగా, వై.ఎస్.జగన్ అమిత్ షా, నరేంద్ర మోదీ కాళ్లు మొక్కినట్లు చూపిస్తున్న ఈ వైరల్ ఫోటోలు మార్ఫింగ్ చేయబడినవి, అలాగే వై.ఎస్.జగన్ అమిత్ షా కాళ్లు మొక్కారు అని చెప్తున్న ఈ ‘Way2News’ వార్తా కూడా ఫేక్