వివరణ (20 November 2022): ఈ ఆర్టికల్ ని మొదట ప్రచిరించినప్పుడు జబల్‌పూర్‌లో ‘శిల్ప’ని హత్య చేసిన వ్యక్తి పేరు ‘అభిజిత్ పాటిదర్’ అని పేర్కొన్నాము. కానీ, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అభిజిత్ పాటిదర్ అతని అసలు పేరు కాదని, హోటల్ లో నిందితుడు ఫేక్ ఐడి కార్డు ఇచ్చాడని తెలిపారు. నిందితుడి అసలు పేరు ‘హేమంత్ రాజేంద్ర భదానే’ అని పేర్కొన్నారు. ఈ ఆర్టికల్ నిందితుడి అసలు పేరుతో అప్డేట్ చేయటం జరిగింది.
“ఇంకా ఎన్ని ఘోరాలు జరిగితే హిందువులు మేల్కొoటారు. జబల్పూర్ మేక్లా రిసార్ట్‌లో జిహాది యువకుడు హిందూ బాలిక గొంతు కోసి చంపాడు.” అని చెప్తూ ఢిల్లీ, జబల్‌పూర్ లలో ఇటీవల జరిగిన హత్యలకు సంబంధించిన వ్యక్తుల దృశ్యాలను షేర్ చేస్తున్నారు. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: ఇటీవల ఢిల్లీ మరియు జబల్‌పూర్‌లో అమ్మాయిలను హత్య చేసిన ఇద్దరు వ్యక్తులు ముస్లిం మతానికి చెందిన వారు.
ఫాక్ట్: ఢిల్లీలో ‘శ్రద్ద’ అనే అమ్మాయిని చంపిన వ్యక్తి పేరు ‘అఫ్తాబ్ అమీన్ పూనావాలా’. ఇతను ముస్లిం మతానికి చెందిన యువకుడు. ఇక, ‘హేమంత్ రాజేంద్ర భదానే’ అనే వ్యక్తి శిల్ప అనే యువతిని జబల్‌పూర్‌లోని మేక్లా రిసార్ట్‌లో నవంబర్ మొదటి వారంలో హత్య చేశాడు. ఇతను హిందువు, ఇతను ముస్లిం మతానికి చెందిన వాడు కాదు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ మరియు వివిధ వార్తా మీడియా సంస్థల కథనం ప్రకారం, ఢిల్లీలో ‘శ్రద్ద’ అనే అమ్మాయిని చంపిన వ్యక్తి పేరు ‘అఫ్తాబ్ అమీన్ పూనావాలా’. ఇతను ముస్లిం మతానికి చెందిన యువకుడు. హత్య చేసిన 6 నెలలకు ఇతన్ని పోలీసులు 12 నవంబర్ 2022న అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
ఇక పోస్టులోని వీడియో గురించి వెతకగా, ఇది మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్ ప్రాంతంలో ఉన్న ఒక రిసార్ట్‌లో నవంబర్ మొదటి వారంలో జరిగిన హత్యకు సంబంధించింది అని తెలిసింది. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’, ‘ది ప్రింట్’ కథనం ప్రకారం, ‘హేమంత్ రాజేంద్ర భదానే’’ అనే వ్యక్తి శిల్ప అనే యువతిని జబల్‌పూర్‌లోని మేక్లా రిసార్ట్‌లో హత్య చేశాడు. ఇతను ముస్లిం మతానికి చెందిన వాడు కాదు. హత్య తరువాత సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వీడియో కూడా పోస్టు చేశాడు. ఇతనిని రాజస్థాన్‌లో పోలీసులు అరెస్టు చేశారు.
చివరిగా, ఢిల్లీలో ‘శ్రద్ధ’ అనే యువతిని హత్య చేసిన ‘అఫ్తాబ్’ ముస్లిం, కానీ జబల్‌పూర్‌లో ‘శిల్ప’ని హత్య చేసిన ‘హేమంత్ రాజేంద్ర భదానే’ హిందువు.