Fake News, Telugu
 

పెళ్లి పీటల మీద వరుడు, పెళ్లి కూతురికి కాకుండా మరో అమ్మాయికి తాళి కడుతున్న ఈ దృశ్యాలు ‘ముత్యమంత ముద్దు’ అనే సీరియల్‌లోవి

0

పెళ్లి పీటల మీద వరుడు, పెళ్లి కూతురికి కాకుండా మరో అమ్మాయికి తాళి కట్టిన అనూహ్య సంఘటన వీడియో అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పెళ్లిపిటల మీద వరుడు, పెళ్లి కూతురికి కాకుండా మరో అమ్మాయికి తాళి కట్టిన వీడియో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్నది ‘ముత్యమంత ముద్దు’ అనే సీరియల్‌లోని దృశ్యాలు. ఈ వీడియోలో కనిపిస్తున్నది నిజజీవితంలో చోటుచేసుకున్న సంఘటన కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే వీడియోని ఒక యూట్యూబ్ ఛానల్ షేర్ చేస్తూ, ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ఒక సీరియల్‌లోనివని తెలిపారు. ఈ వివరాల ఆధారంగా ఆ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘ZEE Telugu’ ఛానల్ 31 డిసెంబర్ 2021 నాడు ట్వీట్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు తమ ఛానెల్లో ప్రసారమయ్యే ‘ముత్యమంత ముద్దు’ అనే సీరియల్ దృశ్యాలు అని ట్వీట్లో స్పష్టం చేసారు.

‘ZEE Telugu’ ఛానల్ వెబ్సైటులో ఈ వీడియో కోసం వెతికితే, 31 డిసెంబర్ 2021 నాడు ప్రసారమయిన ‘ముత్యమంత ముద్దు’ సీరియల్ ఎపిసోడులో పోస్టులో కనిపిస్తున్న అవే దృశ్యాలు కనిపించాయి. ఈ ఎపిసోడుకు సంబంధించి ‘ZEE Telugu’ ఛానల్ 30 డిసెంబర్ 2021 నాడు పబ్లిష్ చేసిన ప్రివ్యు వీడియోలో కూడా పోస్టులో కనిపిస్తున్న అవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి, పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ‘ZEE Telugu’ ఛానెల్లో ప్రసారమయ్యే ‘ముత్యమంత ముద్దు’ ధారావాహిక చిత్రంలోని దృశ్యాలని స్పష్టమయ్యింది.

చివరగా, ‘ముత్యమంత ముద్దు’ సీరియల్‌లోని దృశ్యాలని పెళ్లి పీటల మీద వరుడు, పెళ్లి కూతురికి కాకుండా మరో అమ్మాయికి తాళి కట్టిన నిజసంఘటన వీడియో అంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll