Fake News, Telugu
 

ఈ బుల్డోజర్ కూల్చివేత వీడియో బహ్రైచ్ హింసకు ముందు జరిగిన సంఘటనది; రామ్ గోపాల్ మిశ్రా హత్యలో నిందితులకు సంబంధించింది కాదు

0

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో కూల్చివేసిన ఇళ్ళ, భవనాల దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో మహారాజ్‌గంజ్‌, బహ్రైచ్‌ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన బుల్డోజర్ యాక్షన్ అని క్లెయిమ్ చేస్తున్నారు . యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం రామ్ గోపాల్ మిశ్రా హత్యకు ప్రతీకారంగా ఈ చర్య తీసుకున్నట్టు ఈ పోస్ట్‌ను షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వీడియోలో ఉన్న నిజమెంతో తెలుసుకుందాం.

వీడియో యొక్క ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అక్టోబర్ 2024లో రామ్ గోపాల్ మిశ్రాను హత్య చేసినందుకు ప్రతీకారంగా, ప్రధాన నిందితుడి ఆస్తిని లక్ష్యంగా చేసుకుని మహారాజ్‌గంజ్‌లో కూల్చిన బిల్డింగ్స్ దృశ్యాలను చూపిస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): వైరల్ అవుతున్న వీడియో 25 సెప్టెంబర్ 2024న బహ్రైచ్‌లోని ఫఖర్పూర్‌లో హై కోర్టు ఆదేశాల ప్రకారం జరిగిన చట్ట విరుద్ధ ఆక్రమణల తొలగింపుకి సంబంధించింది. మే 2023లో అలాహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఇచ్చిన ఆదేశం ప్రకారం సరాయ్ జగ్నా గ్రామంలో కట్టిన అక్రమ నిర్మాణాలను బుల్డోజర్‌తో కూల్చారు. ఈ వీడియో మహారాజ్‌గంజ్‌లో రామ్ గోపాల్ మిశ్రా హత్యతో ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం, అలహాబాద్ హైకోర్టు బహ్రైచ్‌లోని నిందితులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుండి కూల్చివేత నోటీసులకు స్పందించడానికి 15 రోజుల సమయం ఇచ్చింది. కావున, పోస్ట్‌లో చేసిన దావా తప్పు.

ఈ వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, 26 సెప్టెంబర్ 2024న షేర్ చేయబడిన ఒక ఫేస్‌బుక్ వీడియోకి దారితీసింది. పోస్ట్ ప్రకారం, ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని వజీర్‌గంజ్‌కు చెందినది అని చెప్పబడింది.

ఫేస్‌బుక్ పోస్ట్ యొక్క వివరణ నుండి క్లూ తీసుకొని ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, మాకు ఈ సంఘటనకు సంబంధించి అనేక మీడియా కథనాలు (ఇక్కడ , ఇక్కడ , ఇక్కడ) లభించాయి. ఈ కథనాల ప్రకారం, 25 సెప్టెంబర్ 2024న, బహ్రైచ్ జిల్లాలోని ఫఖర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సరాయ్ జగ్నా గ్రామంలోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను బుల్డోజర్ ఉపయోగించి కూల్చివేశారు. ఈ చర్య 23 ఇళ్లను లక్ష్యంగా చేసుకుంది, ఇది మే 2023లో జారీ చేసిన హైకోర్టు ఆదేశం ఆధారంగా అమలు చేయబడింది.

బహ్రైచ్ పోలీసు వారు ఈ వైరల్ క్లెయిమ్‌ను తమ అధికారిక X అకౌంట్లో ఒక ట్వీట్ ద్వారా తిరస్కరించింది. ట్వీట్ ప్రకారం, 25 సెప్టెంబర్ 2024న ఫఖర్‌పూర్ ప్రాంతంలో కోర్టు ఆదేశాల ప్రకారం జరిగిన చట్ట విరుద్ధ ఆక్రమణల తొలగింపుకి సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి, దీనికి మహారాజ్‌గంజ్‌లో జరిగిన తాజా ఘటనతో సంబంధం లేదు. పోస్ట్‌లో తప్పు సమాచారం ప్రచారం చేస్తున్న వారి మీద చట్టప్రకారం చర్య తీసుకుంటామని హెచ్చరించింది.

అయితే, అలహాబాద్ హైకోర్టు, బహ్రైచ్‌లో జరిగిన రామ్ గోపాల్ మిశ్రా హత్య కేసు నిందితులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ కూల్చివేత నోటీసులకు స్పందించడానికి 15 రోజుల సమయాన్ని ఇచ్చింది. ఈ నిర్ణయం ఇటీవల అక్కడ జరిగిన హింస నేపథ్యంలో తీసుకోబడింది.

చివరిగా, బుల్డోజర్ చర్యకు సంబంధించిన వీడియో బహ్రైచ్ హింసకు ముందు చట్ట విరుద్ధ ఆక్రమణల తొలగింపుకి సంబంధించినది, రామ్ గోపాల్ మిశ్రా హత్యలో నిందితులకు సంబంధించింది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll