Fake News, Telugu
 

నరేంద్ర మోదీ, ద్రౌపది ముర్ము, ఏక్‌నాథ్ షిండేల పాత ఫోటోలు అంటూ ప్రచారంలో ఉన్న ఈ ఫోటోలు వారివి కాదు

0

“అత్యున్నత పదవుల్లోకి అతి సామాన్యులు, నేటి భారతం” అని చెప్తూ నరేంద్ర మోదీ, ద్రౌపది ముర్ము, యోగి అదిత్యనాథ్, ఏకనాథ్ షిండే పదవులు రాక ముందు సామాన్యులుగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలు అంటూ ఒక పోస్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: నరేంద్ర మోదీ, ద్రౌపది ముర్ము, యోగి అదిత్యనాథ్, ఏక్‌నాథ్ షిండే పదవులు రాక ముందు సామాన్యులుగా ఉన్నప్పటి ఫోటోలు.

ఫ్యాక్ట్ (నిజం): మొదటి ఫోటో ఎడిట్ చేయబడింది, ఇందులో ఉన్నది నరేంద్ర మోదీ కాదు అని RTI ద్వారా దాఖలు అయిన పిటిషన్ కు జవాబు వచ్చింది. ద్రౌపది ముర్ము అని ప్రచారం చేస్తున్న ఫోటోలో ఉన్నది “సుకుమార్ తుడు”. ఈమె ఒడిశా రాష్ట్రంలోని ఒక ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికురాలు. యోగి అదిత్యనాథ్ అని చెప్తున్న ఫోటో ఆయనదే. 1994లో గోరఖ్‌నాథ్ ఆలయ అధిపతి మహంత్ వైద్యనాథ్ శిష్యునిగా దీక్షను స్వీకరిస్తున్నప్పుడు తీసిన ఫోటో అది. చివరి ఫోటోలో ఉన్న వ్యక్తి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కాదు, ఈయన పేరు బాబా కాంబ్లే, మహారాష్ట్ర ఆటోరిక్షా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.   

ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని చెప్తున్న ఫోటోని గమనిస్తే, ఇందులోని వ్యక్తి చీపురు పట్టుకొని నేలని ఊడుస్తున్నట్లు ఉంది. ఇదే ఫోటోని ఇదివరకే మేము ఫ్యాక్ట్-చెక్ చేసి అది తప్పుడు ఫోటో అని రుజువు చేశాము. దానికి సంబంధించిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు.

ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటూ ప్రచారం చేస్తున్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేయగా, ‘CNN-News18’ వెబ్‌సైటులో ఒక వార్తా కథనంలో ఈమె ఫోటో దొరికింది. ఈ కథనం ప్రకారం, ద్రౌపది ముర్ము సొంత గ్రామం ఒడిశాకు చెందిన ఉపర్బేడ. ముర్ము రాష్ట్రపతి ఎన్నికలలో గెలిచిన సందర్భంగా తన స్వగ్రామంలో ప్రజలు ఏం అనుకుంటున్నారో ఇంటర్వ్యూ చేశారు. ఇదే క్రమంలో ఆ ఊరిలో ఉన్న ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్న “సుకుమార్ తుడు” తన అభిప్రాయాన్ని చెప్పారు. అప్పుడు తీసిన ఆమె ఫోటోని వార్తా కథనంలో ప్రచురించారు. కాబట్టి, ఇది ద్రౌపది ముర్ము యొక్క పాత ఫోటో కాదు.

ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ అని చెప్తున్న ఫోటోని ఇంటర్నెట్లో వెతుకగా, 2017లో టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైటులో యోగి అదిత్యనాథ్ మొదటిసారి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఆయన జీవితంలో జరిగిన ముఖ్య సంఘటలను వివరిస్తూ ఒక వార్తా కథనం ప్రచురించారు. అందులో వైరల్ అవుతున్న ఫోటో కూడా ఉంది.

ఈ కథనం ప్రకారం,“గోరఖ్‌నాథ్ ఆలయ అధిపతి మహంత్ వైద్యనాథ్ శిష్యునిగా దీక్షను స్వీకరించారు, ఆయన తన వారసుడిగా ప్రకటించారు. 22 ఏళ్ల అజయ్ సింగ్ బిష్త్ 1994లో ‘దీక్ష’ స్వీకరించిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ అని పిలవబడ్డాడు. ఈ సందర్భంగా హాజరైన వారిలో మహంత్ వైద్యనాథ్ (కుడి నుండి 2వ) ఉన్నారు.”

ఇక చివరిగా, ఏక్‌నాథ్ షిండే యొక్క పాత ఫోటో అని చెప్తున్న ఫోటోని వెతుకగా, అది మహారాష్ట్ర ఆటోరిక్షా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ‘బాబా కాంబ్లే’ 1997లో దిగిన ఫోటో అని తెలిసింది. ఈ ఫోటో బాగా వైరల్ అవుతుండటంతో, ఆయన ‘ABP news’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా అన్నారు, “ఒకప్పుడు రిక్షా పుల్లర్, ఏక్‌నాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇది రాష్ట్రంలోని రిక్షా కార్మికులకు గర్వకారణం. అదేవిధంగా, కొంతమంది రిక్షా డ్రైవర్లు నా ఆఫీసు నుండి నా ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. కానీ, ఈ ఫోటోలో ఉన్నది ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఫోటోగా ప్రచారం అయ్యింది. తర్వాత ఈ ఫొటో నాదేనని తెలియడంతో రాష్ట్రం నుంచి చాలా మంది నుంచి కాల్స్ వచ్చాయి.  ముఖ్యమంత్రికి, నాకు ఒకే రకంగా గడ్డం ఉన్నందునే ఇలాంటి చర్చ జరిగింది.”  కాబట్టి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే కాదు, ఈయన పేరు బాబా కాంబ్లే. 

చివరిగా, వైరల్ అవుతున్న పోస్టులో కేవలం యోగి అదిత్యనాథ్ ఫోటో మాత్రమే నిజమైనది. నరేంద్ర మోడి, ద్రౌపది ముర్ము, ఏక్‌నాథ్ షిండే అని ఉన్న ఫోటోలు వారివి కాదు.  

Share.

About Author

Comments are closed.

scroll