Fake News, Telugu
 

ఈ పోస్టులో స్వాతంత్రోద్యమం నేపథ్యానికి సంబంధించి గాంధీ – నెహ్రూ గురించి చెప్తున్న చాలా వరకు విషయాలు అసత్యాలు

0

స్వాతంత్రోద్యమంలో పలు సంఘటనలకు సంబంధించి గాంధీ మరియు నెహ్రూ గురించిన నిజాలంటూ భగత్ సింగ్ మరణ శిక్ష, రెండోవ ప్రపంచ యుద్ధంలో భారత సైనికుల మరణం, మొదలైన పలు అంశాలకు సంబంధించి వ్యాఖ్యానిస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ విషయాలకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: స్వాతంత్రోద్యమంలో పలు సంఘటనలకు సంబంధించి గాంధీ మరియు నెహ్రూ గురించిన నిజాలు.

ఫాక్ట్ (నిజం): ఈ పోస్టులో స్వాతంత్రోద్యమం నేపథ్యంలో గాంధీ – నెహ్రూకి సంబంధించి చెప్తున్న పులు విషయాలు నిజమైనప్పటికీ, చాలా వరకు విషయాలు అవాస్తవాలే. గాంధీ, భగత్ సింగ్‌కు క్షమాభిక్ష కల్పించాలని కోరుతూ పలు సార్లు అప్పటి వైస్రాయ్‌కి లేఖలు రాసాడు. అలాగే నెహ్రూ, ఆజాద్ ఆచూకి బ్రిటిష్ వారికి చెప్పాడనడానికి కూడా ఎటువంటి ఆధారాలు లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

క్లెయిమ్ 1: భగత్ సింగ్‌ శిక్షార్హుడని గాంధీ వ్యాఖ్యానించాడు.

పోస్టులో క్లెయిమ్ చేస్తునట్టు బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్‌కు క్షమాభిక్ష కల్పించాలని ఆలోచించినట్టు గానీ లేక ఈ విషయమై బ్రిటిష్ ప్రభుత్వం గాంధీని సంప్రదించిందన్న వార్త పూర్తిగా అవాస్తవం. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్‌కు ఉరి శిక్ష అమలు చేసే విషయంలో చాలా పట్టుదలతో ఉంది. అలాగే  భగత్ సింగ్‌ తీవ్రవాదని గానీ లేదా భగత్ సింగ్‌ ని శిక్షించే అధికారం బ్రిటిష్ ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందని గాంధీ వ్యాఖ్యానించినట్టు ఎటువంటి ఆధారాలు లేవు.

పైగా భగత్ సింగ్‌ ఉరి శిక్ష రద్దు చేయాలని కోరుతూ గాంధీ పలు సార్లు అప్పటి వైస్రాయ్‌ లార్డ్ ఇర్విన్‌కి లేఖలు కూడా రాసారు (ఇక్కడ మరియు ఇక్కడ). భగత్ సింగ్‌ ఉరి శిక్షకి సంబంధించి వైరల్ అవుతున్న పలు అపోహలపై FACTLY రాసిన కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.  

క్లెయిమ్ 2: అజ్ఞాతంలో ఉన్న చంద్రశేఖర్ ఆజాద్ ఆచూకి నెహ్రూ బ్రిటిష్ వారికి చెప్పాడు

27 ఫిబ్రవరి 1931న అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్)లోని ఆల్‌ఫ్రెడ్ పార్క్ వద్ద ఆజాద్ తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఆజాద్ మరియు పోలీసులకు మధ్య కాల్పులు జరగగా, ఆజాద్ తప్పించుకోలేని పరిస్థితిలో తనని తాను కాల్చుకొని చనిపోయాడు.

ఆజాద్ చనిపోయే కొన్ని రోజుల ముంది నెహ్రూని కలిసాడు, ఇదే విషయం నెహ్రు తన ఆటోబయోగ్రఫీలో కూడా ప్రస్తావించాడు. ఐతే నెహ్రూ, చంద్రశేఖర్ ఆచూకి బ్రిటిష్ ప్రభుత్వానికి అందించాడనడానికి ఎటువంటి ఆధారాలు లేవు.  

క్లెయిమ్ 3: గాంధీని అగా ఖాన్ ప్యాలస్‌లో బంధించిన ఫోటో.

1942- 44, క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో గాంధీని అగా ఖాన్ ప్యాలస్‌లో బంధించిన విషయం నిజమైనప్పటికీ, ఈ ఫోటో మాత్రం గాంధీని అగా ఖాన్ ప్యాలస్‌లో బంధించినప్పటిది కాదు. ఈ ఫోటో 1940లో షిమ్లాలోని మనోర్విల్లే ప్రాంతంలో వైస్రాయ్‌తో సమావేశం కోసం వెళ్తున్నప్పుడు తీసింది.

క్లెయిమ్ 4: రెండోవ ప్రపంచ యుద్ధంలో 20 లక్షల మంది భారతీయులు చనిపోయారు.

రెండో ప్రపంచ యుద్ధంలో భారత్‌ అల్లైడ్ పవర్స్ (గ్రేట్ బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్ మరియు సోవియట్ యూనియన్) తరపున పోరాడింది. ఈ యుద్ధంలో సుమారు 25 లక్షల మంది భారతీయులు పాల్గొనగా, అందులో సుమారు 89,000 మంది చనిపోయారు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). అధికారిక ప్రభుత్వ లెక్కల ప్రకారం కూడా చనిపోయిన వారి సంఖ్య ఇంతే.

క్లెయిమ్ 5: నెహ్రుని ప్రధానిని చేయడం కోసం గాంధీ పాకిస్తాన్‌ని ఏర్పాటు చేసాడు

పోస్టులో చెప్తునట్టు 1946 కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో సర్దార్ పటేల్‌కి 12 వోట్లు రాగా, నెహ్రూకి ఒక్క వోటు కూడా రాలేదు, అయిన గాంధీ అధ్యక్ష పదవికి నెహ్రు పేరును ప్రతిపాదించిన మాట నిజమైనప్పటికి, ఈ విషయానికి పాకిస్తాన్ ఏర్పాటుకు ఎటువంటి సంబంధంలేదు. పాకిస్తాన్ ఏర్పాటు ప్రతిపాదన జిన్నా చాలా సంవత్సరాల ముందు నుండే చేసాడు. 

చివరగా, ఈ పోస్టులో స్వాతంత్రోద్యమం నేపథ్యానికి సంబంధించి గాంధీ – నెహ్రూ గురించి చెప్తున్న చాలా వరకు విషయాలు అసత్యాలు.

Share.

About Author

Comments are closed.

scroll