కేరళలో బురఖా లేని మహిళలను బస్సులోకి అనుమతించబోమని కొందరు ముస్లిం మహిళా ప్రయాణికులు ఒక హిందూ మహిళతో గొడవపడుతున్నారని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియా బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: బురఖా లేనిదే బస్సులోనికి అనుమతించబోమని కేరళలో కొందరు ముస్లిం యువతులు హిందూ మహిళతో గొడవపడుతున్న వీడియో.
ఫాక్ట్: ఈ సంఘటనలో ఎటువంటి మతపరమైన కోణం లేదు. ఈ ఘటన 20 అక్టోబర్ 2023లో కేరళలోని కాసర్‌గోడ్ ప్రాంతంలోని కాన్సా మహిళా కాలేజీ సమీపంలో జరిగింది. తమ కాలేజీ ఎదుట బస్సులు ఆపనందుకు కొందరు విద్యార్థులు బస్సుకి అడ్డుగా వచ్చి ఆందోళన చేయగా, ఇదే సమయంలో బస్సుని నిలిపివేసినందుకు బస్సులో ఉన్న ఆశా అనే మహిళతో విద్యార్ధులకు గొడవ జరిగింది. ఇందులో ఎటువంటి మతపరమైన కోణం లేదని ఆశా, కాలేజీ ప్రిన్సిపల్, స్థానిక పోలీసులు, బస్సు కండక్టర్ స్పష్టం చేశారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా ఈ ఘటన గురించి ఇంటర్నెట్లో వెతకగా దీనికి సంబంధించి కేరళ మీడియా సంస్థలు ప్రచురించిన అనేక వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ), వీడియోలు (ఇక్కడ, ఇక్కడ) లభించాయి.
వీటి ప్రకారం ఈ ఘటన 20 అక్టోబర్ 2023న కేరళలోని కాసర్‌గోడ్ ప్రాంతంలో కాన్సా మహిళా కాలేజీ సమీపంలో జరిగింది. ఆ కాలేజీ వద్ద బస్ స్టాప్ ఏర్పాటు చేయాలంటూ విద్యార్థులు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో, ఆ రోజు ప్రైవేట్ సిటీ బస్సులు ఆగకపోవడంతో విద్యార్థులు బస్సుకి అడ్డుగా నిలబడి ఆందోళన చేశారు. ఇదే సమయంలో బస్సులో ఉన్న ఆశా అనే ఒక మహిళతో కాలేజీ విద్యార్థినులకు వాగ్వాదం జరిగింది.
ఇండియా టుడేకి ఆశా ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం, బస్సు ఎక్కే సమయంలో తన కాలిని విద్యార్థులు తొక్కడంతో తనకి కోపం వచ్చిందని, ఇదే క్రమంలో బస్సుని ఆపడం పట్ల వాళ్ళతో ఆమెకి గొడవ జరిగిందని ఆమె చెప్పింది. విద్యార్థులు తనపై ఎటువంటి మతపరమైన మాటలు మాట్లాడలేదని ఆమె స్పష్టం చేసింది. ఇక వైరల్ వీడియోలో విద్యార్ధిని ఆ మహిళతో మాట్లాడిన మాటల యొక్క తెలుగు అనువాదాన్ని క్రింద చూడవచ్చు: “మీరు మాకు మద్దతు ఇవ్వడం లేదు; మీరు మా కష్టాలను పూర్తిగా అర్థం చేసుకోనందున మీరు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. మీ పిల్లలు కూడా అదే సమస్యను ఎదుర్కొంటే, మీరు కూడా మాకు అండగా నిలుస్తారు”
అయితే, ఈ వీడియో వైరల్ అవుతుండడంతో ఆ కాలేజీ ప్రిన్సిపాల్, స్థానిక కుంబ్లా పోలీసు అధికారులు ఇందులో ఎటువంటి మతపరమైన కోణం లేదని స్పష్టం చేశారు. ఇక ఈ వీడియోని తప్పుగా షేర్ చేస్తున్న వారిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు నమోదు చేసిన కేసు తాలూకు FIR కాపీ ఇక్కడ చూడొచ్చు.
చివరిగా, హిందూ మహిళని బురఖా లేనిదే బస్సులోనికి అనుమతించబోమని కేరళలలోని ముస్లిం యువతులు బెదిరిస్తున్నారంటూ ప్రచారంలో ఉన్న ఈ వీడియోలో నిజం లేదు.