టెలిఫోన్ కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రాహంబెల్ తన భార్య మార్గ్ రేట్ హలో గుర్తుగా ‘హలో’ అనే పదాన్ని టెలిఫోన్ గ్రీటింగ్ పదంగా వాడకంలోకి తీసుకొచ్చారు, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. “గ్రాహంబెల్ మొట్టమొదట తన భార్యకు ఫోన్ చేసి “హలో” అని పలికారు, అప్పటి నుండి అందరు ఫోన్ లిఫ్ట్ చెయ్యగానే హలో అని అనడం మొదలుపెట్టారు”, అంటూ ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: టెలిఫోన్ కనిపెట్టిన గ్రాహంబెల్, తన భార్య మార్గ్ రేట్ హలో గుర్తుగా ‘హలో’ అనే పదాన్ని టెలిఫోన్ సాధారణ గ్రీటింగ్ పదంగా వాడకంలోకి తీసుకొచ్చారు.
ఫాక్ట్ (నిజం): అలెగ్జాండర్ గ్రాహంబెల్ టెలిఫోన్‌ని 1876లో కనిపెట్టారు. టెలిఫోన్ సంభాషణలను ప్రారంభించేటప్పుడు ‘ahoy, ahoy’ అనే గ్రీటింగ్ పదాన్ని ఉపయోగించాలని గ్రాహంబెల్ అప్పుడు సూచించారు. అయితే, 1877లో థామస్ ఎడిసన్, టెలిఫోన్ సంభాషణలను ‘Hello’ అనే గ్రీటింగ్ పదంతో మొదలుపెట్టాలని సూచించారు. అప్పటినుండి ‘Hello’ అనే పదాన్ని టెలిఫోన్ గ్రీటింగ్ పదంగా ప్రజలు ఉపయోగిస్తున్నారు. గ్రాహంబెల్ భార్య పేరు మబెల్ గార్డినేర్ హుబ్బార్డ్, మార్గ్ రేట్ హలో కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం వెతికితే, టెలిఫోన్ సంభాషణలో ఉపయోగించే ‘హలో’ పదం గురించి అమెరికా వార్తా సంస్థ ‘NPR’ 2011లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ మొట్టమొదట ‘హలో’ అనే పదాన్ని 1827లో పబ్లిష్ చేసినట్టు ఈ ఆర్టికల్‌లో తెలిపారు. 1830 కాలం నాటి ప్రజలు ‘హలో’ అనే పదాన్ని అవతల వ్యక్తుల దృష్టిని ఆకర్షించడానికి ఉపయోగించేవారని ఇందులో తెలిపారు. టెలిఫోన్ కనిపెట్టింది అలెగ్జాండర్ గ్రాహంబెల్ అయినప్పటికీ, టెలిఫోన్ సంభాషణలో ‘హలో’ పదాన్ని సాధారణ వాడకంలోకి తెచ్చింది థామస్ ఎడిసన్ అని ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు.
అలెగ్జాండర్ గ్రాహంబెల్ టెలిఫోన్‌ని 1876లో కనిపెట్టారు. గ్రాహంబెల్ మొట్టమొదట తన అసిస్టెంటుకు ఫోన్ చేసి, “మిస్టర్ వాట్సన్, నా దగ్గరికి రండి, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను”, అని మాట్లాడినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. టెలిఫోన్ సంభాషణలను ప్రారంభించేటప్పుడు ‘ahoy, ahoy’ అనే గ్రీటింగ్ పదాన్ని ఉపయోగించాలని గ్రాహంబెల్ సూచించినట్టు తెలిసింది. అంతేకాదు, అలెగ్జాండర్ గ్రాహంబెల్ భార్య పేరు మబెల్ హుబ్బార్డ్ బెల్, మార్గ్ రేట్ హలో కాదు.
టెలిఫోన్ సంభాషణలో ‘హలో’ పదాన్ని ఎందుకు ఉపయోగంలోకి తీసుకొచ్చారని వెతికితే, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రిపోర్ట్ చేస్తూ ‘ది న్యూ యార్క్ టైమ్స్’ సంస్థ ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. 1877లో థామస్ ఎడిసన్, టెలిఫోన్ సంభాషణలను ‘హలో’ అనే పదంతో ప్రారంభించాలని సూచించినట్టు ‘ది న్యూ యార్క్ టైమ్స్’ రిపోర్ట్ చేసింది. టెలిఫోన్‌ను వ్యాపార పరికరంగా ఉపయోగించేటప్పుడు, ఎదుటి వ్యక్తి తమతో మాట్లాడాలనుకుంటున్నాడు అనే విషయాన్నీ తెలుసుకోనేందుకు ఈ గ్రీటింగ్ పదం ఉపయోగపడుతుందని థామస్ ఎడిసన్ సలహా ఇచ్చినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. థామస్ ఎడిసన్ సూచన మేరకు అప్పటినుండి ‘Hello’ పదాన్ని టెలిఫోన్ గ్రీటింగ్ పదంగా ప్రజలు ఉపయోగిస్తున్నారు.
చివరగా, టెలిఫోన్ సంబాషణలో ఉపయోగిస్తున్న ‘హలో’ పదాన్ని గ్రాహంబెల్ భార్య పేరు మీద పెట్టలేదు.