Fake News, Telugu
 

కాంగ్రెస్ పార్టీ గుర్తు ఇస్లాం మత చిహ్నం నుంచి వచ్చిందన్న ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవు

0

“కాంగ్రెస్ పార్టీ ఇస్లాం మతానికి చెందిన చిహ్నాన్ని తన ఎన్నికల చిహ్నంగా చేసుకుంది” అని చెప్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టు బాగా ప్రచారంలో ఉంది. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: కాంగ్రెస్ పార్టీ ఇస్లాం మతానికి చెందిన గుర్తును తన ఎన్నికల గుర్తుగా చేసుకుంది.

ఫ్యాక్ట్ (నిజం): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు మొదటి నుంచి హస్తం గుర్తు కాదు. 1951-69 వరకు ‘కాడిని మోస్తున్న ఎద్దుల జత’ గుర్తు తో పోటీ చేసింది.  1971-77 వరకు “ఆవు-దూడ”, 1980 నుంచి హస్తం (తెరిచిన అరచేయి) గుర్తుగా ఉంది. అయితే, కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ లో ఉన్న ఏమూర్ భగవతి (హేమాంబిక) విగ్రహం గురించి ఇందిరా గాంధీకి తన స్నేహితురాలు సౌందర కైలాసం చెప్పింది. ఈ ఆలయంలో విగ్రహమూర్తికి బదులుగా భక్తులని దీవిస్తున్నట్లు ఉన్న దేవత యొక్క చేతుల విగ్రహం ఉంటుంది. ఎన్నికల గుర్తు నిర్ణయించడానికి ఈ విషయం కూడా ప్రభావితం చేసింది అని అక్కడి వారి నమ్మకం. ఇక హస్తం గుర్తుతో ఎన్నికలు గెలిచాక, 1982లో ఇందిరా గాంధీ ఈ ఆలయాన్ని సందర్శించారు. కాబట్టి, పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా పోస్టులో ఉన్న హస్తం గుర్తు గురించి వెతకగా, దానిని పోలిన అనేక గుర్తులు దొరికాయి. వీటిని ‘పంజా ఆలం’ అంటారు.  ఢిల్లీ నేషనల్ మ్యూజియం ప్రకారం, ‘పంజా ఆలం’ ముహర్రం ఉదయం ఊరేగింపులో ఉపయోగించే ముఖ్యమైన మతపరమైన చిహ్నం. ఇటువంటి ఆలములు వివిధ ఆకారాలలో తయారు చేయబడతాయి. ‘పంజా’ లేదా ‘రక్షిత హస్తం’ ఆకారంలో ఉన్న ఆలం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. పంజా ఆలo యొక్క ఐదు వేళ్లు చివరి ప్రవక్త హజ్రత్ మొహమ్మద్, హజ్రత్ ఫాతిమా, హజ్రత్ అలీ, హజ్రత్ హసన్ మరియు హజ్రత్ హుస్సేన్లను సూచిస్తాయి.

ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ గుర్తు ఈ చిహ్నాన్ని పోలి ఉంటుంది. కానీ, పంజా ఆలం వల్ల కాంగ్రెస్ ఈ గుర్తు ఎంచుకున్నదని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

అంతే కాదు, కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఈ గుర్తు లేదు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి సారి 1951-52 లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో నెహ్రూ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ  ‘కాడిని మోస్తున్న ఎద్దుల జత’ గుర్తుతో పోటీ చేసింది.

1969లో, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా, మెజారిటీ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మద్దతుతో ఇందిరాగాంధీ , కాంగ్రెస్(R) అనే కొత్త పార్టీని  స్థాపించాలని నిర్ణయించుకున్నారు. 1971-1977 కాలంలో ఇందిరా కాంగ్రెస్  లేదా కాంగ్రెస్(R) యొక్క చిహ్నం “ఆవు-దూడ”. లోక్‌సభలో పార్టీ 153 మంది సభ్యులలో 76 మంది మద్దతు కోల్పోయిన తర్వాత, 1980 ఎన్నికల కోసం కొత్త రాజకీయ సంస్థ కాంగ్రెస్(I) గా పరిణామం చెందింది, అప్పుడే ఇందిరా గాంధీ హస్తం (తెరిచిన అరచేతి) గుర్తును ఎంచుకుంది.

ఇదే విషయాన్ని, రషీద్ కిడ్వాయ్ అనే జర్నలిస్ట్ తన పుస్తకం ‘24 Akbar Road’  లో వెల్లడించారు.

కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ లో ఉన్న ఏమూర్ భగవతి (హేమాంబిక) ఆలయాన్ని ఇందిరా గాంధీ దర్శించుకున్నారు. ఈ ఆలయంలో విగ్రహమూర్తికి బదులుగా భక్తులని దీవిస్తున్నట్లు ఉన్న దేవత యొక్క చేతుల విగ్రహం ఉంటుంది.

కేరళ కౌముది అనే మలయాళ దినపత్రిక కథనం ప్రకారం, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ కైలాసం భార్య సౌందర కైలాసం నెహ్రూ కుటుంబంతో సన్నిహితంగా మెలిగేవారు. ఆమె ఏమూరు హేమాంబిక భగవతి ఆలయంలో చేతి విగ్రహం గురించి ఇందిరా గాంధీకి చెప్పారు. భారతదేశంలో చేతి విగ్రహం ఉన్న ఏకైక ఆలయం ఇది. దీని గురించి విన్న తర్వాత ఇందిరా గాంధీ చేతి చిహ్నాన్ని ఎన్నుకునేలా ప్రభావితం అయిందని నమ్ముతారు. ఆ రోజు ఆమోదించిన హస్తం గుర్తుతో ఇందిరా గాంధీ నాయకత్వంలో, కాంగ్రెస్ 1977 కంటే 200 సీట్లు అధికంగా గెలుచుకుంది. తరువాత, కె కరుణాకరన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇందిరా గాంధీ ఏమూరు భగవతి ఆలయాన్ని సందర్శించారు.

చివరిగా, కాంగ్రెస్ పార్టీ ఇస్లాం మతానికి చెందిన గుర్తును తన ఎన్నికల గుర్తుగా చేసుకుందనటానికి  ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

Comments are closed.

scroll