“బ్రదర్ అనిల్, షర్మిల ప్రార్థనతో కరోనాను తొక్కేసారు చూడండి ”, అని చెప్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఈ వీడియోలో బ్రదర్ అనిల్ కుమార్ “తొక్కండి, తొక్కండి.. కరోనాని తొక్కండి” అనే పాటను ఒక సభలో పాడుతున్నట్లు చూడవచ్చు. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: “తొక్కండి, తొక్కండి.. కరోనాని తొక్కండి” అనే పాటను బ్రదర్ అనిల్ కుమార్ ఒక సభలో పాడుతున్న వీడియో.
ఫ్యాక్ట్ (నిజం): వైరల్ అవుతున్న వీడియో క్లిప్ కి సంబంధించిన అసలు వీడియొ జులై 2018లో యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. అప్పటికి కరోనాను ఇంకా గుర్తించలేదు. అంతే కాదు, ఈ వీడియోలో కరోనాకు సంబంధించిన పాట ఎక్కడా లేదు. “తొక్కండి, తొక్కండి.. కరోనాని తొక్కండి” అనే పాటను పాస్టర్ థామస్ 22 ఫిబ్రవరి 2022న కాకినాడలో జరిగిన ఒక సభలో పాడారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ముందుగా వీడియోలోని దృశ్యాలని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేయగా, “Bro.Anil Kumar Crusade with Rev.ABHILASH Sunny” అనే టైటిల్ ఉన్న ఒక వీడియో యూట్యూబ్లో దొరికింది. ఈ వీడియోని 30 జులై 2018న ‘abhi sunny’ అనే యూట్యూబ్ ఛానెల్లో అప్లోడు చేశారు. ఈ వీడియోలోని దృశ్యాలను వైరల్ అవుతున్న వీడియోతో పోలిస్తే రెండు వీడియోలు ఒకటే అని ఖచ్చితంగా చెప్పవచ్చు .
ఇక వైరల్ అవుతున్న వీడియోని ఈ వీడియోలోని వివిధ క్లిప్పింగ్స్ ని కలిపి తయారుచేశారు. ఉదాహరణకు, అసలు వీడియొలో 30:35 నుంచి 31:25 వరకు ఉన్న దృశ్యాలని వైరల్ వీడియోలో పెట్టారు. అసలు వీడియోలోని పాటలను వింటే, అందులో కరోనాకి సంబంధించిన పాటలు ఎక్కడా లేవు. పైగా ఈ వీడియో 2018 కి సంబంధించినది కనుక, అప్పటికి కరోనాను ఇంకా గుర్తించలేదు. కాబట్టి కరోనని తొక్కండి అని 2018లో పాట పాడే అవకాశం లేదు.
వైరల్ వీడియోలో ఉన్న పాట గురించి ఇంటర్నెట్లో వెతుకగా 22 ఫిబ్రవరి 2020న కాకినాడలో జరిగిన ఒక మతపరమైన సభలో పాస్టర్ థామస్ ఈ పాటను పాడారు. ఫిబ్రవరి 2020లో దేశంలో కరోనా వ్యాపి గురించి అప్పటికే వార్తా కథనాలు వెలువడ్డాయి. ఈ నేపధ్యంలో కరోనాకి సంబంధించిన పాటను ఈ సభలో ఆయన పాడటం జరిగిoది. ఆ వీడియోని ఇక్కడ చూడవచ్చు. ఈ ఆడియోని బ్రదర్ అనిల్ కుమార్ 2018 వీడియోకి జత చేసి చేస్తునట్టు కచ్చితంగా చెప్పవచ్చు.
చివరిగా, 2020లో పాస్టర్ థామస్ పాడిన పాట యొక్క ఆడియోను 2018కి చెందిన బ్రదర్ అనిల్ వీడియోకి జోడించి షేర్ చేస్తున్నారు.