Fake News, Telugu
 

కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకి ఆర్ధిక సాయంగా 86 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందన్న వార్తలో నిజం లేదు

0

కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకి ఆర్ధిక సాయంగా 86 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని ఝార్ఖండ్ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే పార్లమెంట్‌లో ప్రసంగిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఐతే ఈ కథనం ఆ విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకి ఆర్ధిక సాయంగా 86 వేల కోట్ల రూపాయలు ఇచ్చింది- ఝార్ఖండ్ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే

ఫాక్ట్(నిజం):  బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చును ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలను తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకి కేంద్రం ఎలాంటి నిధులు కేటాయించలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా స్వంత నిధులు, రుణాలపైనే ఆధారపడి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసిందని స్పష్టం చేసింది. అంతకుముందు కూడా పలు సార్లు కేంద్ర మంత్రులు ఇదే విషయాన్ని స్పష్టం చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకి కేంద్ర సహాయంపై ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకి కేంద్రం ఎలాంటి నిధులు కేటాయించలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా స్వంత నిధులు, రుణాలపైనే ఆధారపడి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసిందని స్పష్టం చేసింది.

22 జూలై 2021 నాడు కేంద్ర జల వనరుల శాఖ (జల్ శక్తి) సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలంగాణ నీటి ప్రాజెక్టులపై లోక్‌సభలో ఒక ఎంపీ లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తమ వనరులు ఉపయోగించుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తుంది అని సమాధానమిచ్చారని తెలిపింది.

అంతకు ముందు కూడా పలు సార్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో కాళేశ్వరంపై మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఖర్చు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని తెలిపింది. డిసెంబర్ 2021లో ఇదే అంశానికి సంబంధించి పార్లమెంట్‌కు అందించిన సమాచారంలో తెలంగాణ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టుకి ఏ బ్యాంక్/సంస్థ ఎంత లోన్ మంజూరు చేసిందో, ప్రభుత్వం అప్పటికి వరకు ఎంత తీసుకుందో అన్న వివరాలు తెలిపింది.

ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం బడ్జెట్‌లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం జరిపిన కేటాయింపులు చేసింది. పలు సంవత్సరాలలో ప్రభుత్వం చేసిన కేటాయింపుల వివరాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

వీటన్నిటి బట్టి కాళేశ్వరం ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టమవుతుంది. ఇదిలా ఉంటే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తప్పుడు సమాచారంతో పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించాడంటూ బీఆర్ఎస్ ఎంపీలు అతనిపై ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు.

చివరగా, కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకి ఆర్ధిక సాయంగా 86 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందన్న వార్తలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll