Fake News, Telugu
 

నాథూరామ్ గాడ్సే గాంధీ హత్య గురించి కోర్టు ముందు చేసిన ప్రసంగం ఎప్పటినుంచో బహిరంగంగానే ఉంది; ఈ పోస్టులోని చెప్పినవి ఆ ప్రసంగంలో లేవు

0

సుప్రీం కోర్టు అనుమతితో, 60 సంవత్సరాలుగా నిషేధించబడిన నాథూరామ్ గాడ్సే ప్రసంగం ప్రచురించబడిందని ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా షేర్ చేస్తున్నారు. నాథూరామ్ గాడ్సే తమ్ముడు గోపాల్ గాడ్సే ఈ ప్రసంగం బహిరంగంగా ఉంచడానికి అనుమతి కోరుతూ ఒక దావా వేయడంతో 60 సంవత్సరాలకు అనుమతి లభించిందని పోస్ట్ ద్వారా అంటున్నారు. నాథూరామ్ గాడ్సే ఆలోచనలు అంటూ కూడా పోస్టులో షేర్ చేసారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: సుప్రీం కోర్టు అనుమతితో, 60 సంవత్సరాలుగా నిషేధించబడిన నాథూరామ్ గాడ్సే ప్రసంగం ప్రచురించబడింది.

ఫాక్ట్: 60 సంవత్సరాలుగా నిషేధించబడిన నాథూరామ్ గాడ్సే ప్రసంగానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు. ప్రత్యేక కోర్టుకు నాథూరామ్ గాడ్సే చేసిన ప్రసంగంపై నిషేధాన్ని 1968లోనే బాంబే హైకోర్టు ఎత్తివేసిందని న్యూస్ ఆర్టికల్స్‌లో వచ్చింది. 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ మారణకాండ గురించి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి, భగత్ సింగ్ మరణశిక్ష గురించి గాడ్సే తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. గాంధీ విధానాల వలన లక్షలాది హిందువులకు జరిగే నష్టాల గురించి, ముస్లింల పట్ల గాంధీ నిరంతర బుజ్జగింపు విధానాల గురించి, ఇతర ఆలోచనల గురించి తన ప్రసంగంలో వివరించారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

60 సంవత్సరాలుగా నిషేధించబడిన నాథూరామ్ గాడ్సే ప్రసంగానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చినట్టుగా ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అలాంటి అనుమతి సుప్రీం కోర్టు ఇచ్చి ఉంటే అన్ని ప్రముఖ వార్తాపత్రికలు దాని గురించి ప్రచురించేవి.

ప్రత్యేక కోర్టుకు నాథూరామ్ గాడ్సే చేసిన ప్రసంగంపై నిషేధాన్ని 1968లో బాంబే హైకోర్టు ఎత్తివేసిందని న్యూస్ ఆర్టికల్స్ ద్వారా ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

గోపాల్ గాడ్సే రచయితగా ఉన్న “వై ఐ అసాసినేటేడ్ గాంధీ” పుస్తకంలో నాథూరామ్ గాడ్సే కోర్టు ముందు చేసిన ప్రసంగం, తీర్పు మరియు ఇతర ఈవెంట్స్ ఇందులో ఉన్నాయి. ది హిందులో ఆర్టికల్ ప్రకారం, ఈ పుస్తకం యొక్క ఇంగ్లీష్ ఎడిషన్ కనీసం 1993 నుంచి మార్కెట్లో ఉంది. కావున, 60 సంవత్సరాలుగా నాథూరామ్ గాడ్సే ప్రసంగం నిషేధించబడిందనడంలో అర్ధం లేదు.

నాథూరామ్ గాడ్సే 30 జనవరి 1948న గాంధీని హత్య చేశాడు. విచారణ 27 మే 1948 న ప్రారంభమై 10 ఫిబ్రవరి 1949న ముగిసింది. కోర్ట్ తనకి మరణశిక్ష విధించింది. అప్పుడు సిమ్లాలో సెషన్ లో, పంజాబ్ హైకోర్టుకు అప్పీల్ లో వెళ్ళినప్పుడు, శిక్షను సమర్థించారు.

పంజాబ్ హైకోర్టు (పీటర్హాఫ్, సిమ్లా, ఇండియాలో), 05 మే 1949న కోర్టు ముందు గాడ్సే చేసిన చివరి ప్రసంగంలో ప్రత్యేకంగా తన ఆలోచనలు పోస్టులో ఉన్నట్టుగా లేవు. 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ మారణకాండ గురించి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి, భగత్ సింగ్ మరణశిక్ష గురించి గాడ్సే తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. గాంధీ విధానాల వలన లక్షలాది హిందువులకు జరిగే నష్టాల గురించి, ముస్లింల పట్ల గాంధీ నిరంతర బుజ్జగింపు విధానాల గురించి, మరియు ఇతర ఆలోచనల గురించి తన ప్రసంగంలో వివరించారు.

చివరగా, 60 సంవత్సరాలుగా నిషేధించబడిన నాథూరామ్ గాడ్సే ప్రసంగానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు; ఆ ప్రసంగం ఎప్పటినుంచో బహిరంగంగానే ఉంది.

Share.

About Author

Comments are closed.

scroll