Fake News, Telugu
 

కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేయడం లేదు

0

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులకు అందించే మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేయబోతుందని, దీనికి బదులు విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లలోకి నెలకు రూ. 100 నగదు బదిలీ చేయబోతుందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులకు అందించే మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేయబోతుంది; దీనికి బదులు విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లలోకి నెలకు రూ. 100 నగదు బదిలీ చేయబోతుంది.

ఫాక్ట్ (నిజం): కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేయట్లేదు. కరోనా కారణంగా మధ్యాహ్న భోజనాన్ని అందించలేని సందర్భంలో ప్రత్యామ్నయంగా  విద్యార్థులకు నెలకు కొంత అలవెన్స్ అందించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఇలా తప్పుగా అర్ధం చేసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకానికి చట్ట బద్దత ఉన్నది, ఈ పథకాన్ని రద్దు చేయాలంటే చట్ట సవరణ చేయాలి. కానీ, ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సవరణ చేయలేదు. పైగా మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేసే ఆలోచన ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం అన్నట్టు ఎటువంటి వార్తా కథనాలుగాని లేవు కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

కోవిడ్-19 వ్యాప్తి కారణంగా పాఠశాలలు మూతపడి పిల్లలకు మధ్యాహ్న భోజనం ఆగిపోవడంతో, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఈ విషయాన్నీ సుమోటోగా స్వీకరించి, పాఠశాలలు మూసివేసినప్పుడు పిల్లలకు మధ్యాహ్న భోజనం ఎలా అందిస్తారో చెప్పాలంటూ అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు మరియు కేంద్రానికి మార్చ్ 2021లో నోటీసులు జారీ చేసారు.

సుప్రీం కోర్టు నోటీసు నేపథ్యంలోనే, పిల్లల పౌష్టికాహార స్థాయిల‌ను కాపాడలనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజన పథకం కింద 11.8 కోట్ల మంది విద్యార్థులకు ఈ పథకంలో భాగంగా అయ్యే వంట ఖర్చు కింద 1 నుండి 8వ తరగతి వరకు చదివే ప్రతీ విద్యార్థి అకౌంట్లోకి నేరుగా రూ.100 నగదు బదిలీ చేయడం ద్వారా ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు మే 2021లో అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేష్ పోఖ్రియాల్ నిశంక్ ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. కరోనా కారణంగా పాఠశాలలు మొన్నటి వరకు మూసివేసినందున, మధ్యాహ్న భోజన పథకానికి బదులు ఇలా నగదు బదిలీ చేస్తునట్టు అర్ధంచేసుకోవచ్చు. ఐతే ఈ ట్వీట్ల ప్రకారం ఈ ఒక్కసారి మాత్రమే ఇలా నగదు బదిలీ చేయనున్నట్టు తెలుస్తుంది. పైగా ఈ ట్వీట్ లో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేస్తున్నట్టు అనలేదు.

ఆహార భద్రత చట్టం, 2013:

సరసమైన ధరలలో నాణ్యమైన ఆహారాన్ని అందుబాటులో ఉంచుతూ, పోషక ఆహార  భద్రత కల్పించే ఉద్దేశంతో 2013లో ఆహార భద్రత చట్టాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టంలో భాగంగానే ఎనిమిదో తరగతి వరకు చదివే లేదా 6-14 సంవత్సరాల వయసు గల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని పేర్కొన్నారు. పైగా ఏ వయసు గల పిల్లలకి ఏ మేరకు పోషక ప్రమాణాల ఆహారాన్ని అందించాలో కూడా ఈ చట్టంలో పేర్కొన్నారు. ఈ చట్టంలో పేర్కొన్న విధంగానే ప్రస్తుతం పాఠశాల పిల్లలకి మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆహారం అందించలేని పరిస్థితుల్లో ఆహార భద్రత అలవెన్స్ అందించాలని కూడా ఈ చట్టంలో పేర్కొన్నారు.

మధ్యాహ్న భోజన పథకం రూల్స్, 2015:

ఆహార భద్రత చట్టానికి అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి 2015లో రూపొందించిన రూల్స్ ప్రకారం ఆహార ధాన్యాలు అందుబాటులో లేకపోవడం, వంట వ్యయం లేదా మరే ఇతర కారణాల వల్ల విద్యార్థులకు భోజనం అందించలేనప్పుడు, ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బిడ్డకు ఆహార ధాన్యాలు మరియు వంటలకు అయ్యే ఖర్చుని మొత్తం అలవెన్స్ రూపంలో అందించాలని స్పష్టంగా పేర్కొన్నారు.

పైగా పోస్టులో చెప్తునట్టు మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టానికి సవరణలు చేయాలి. కానీ, ఈ మధ్య కాలంలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేస్తూ ఈ చట్టానికి ఎటువంటి సవరణలు చేయలేదు. పైగా మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేసే ఆలోచన ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం అన్నట్టు ఎటువంటి వార్తా కథనాలుగానీ లేవు. కావున ఈ పథకాన్ని రద్దు చేస్తున్నారన్న వార్తలో నిజంలేదని, కేవలం కరోనా కారణంగా మధ్యాహ్న భోజనాన్ని అందించలేని సందర్భంలో ప్రత్యామ్నయంగా  నెలకు కొంత అలవెన్స్ అందించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఇలా తప్పుగా అర్ధం చేసుకున్నారు.

సాధారణంగా మధ్యాహ్న భోజన పథకం అనేది సెంట్రల్ స్పాన్సర్డ్‌ స్కీం, ఈ పథకంలో భాగంగా అయ్యే వంట ఖర్చుని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తాయి. కేంద్ర ప్రభుత్వం అందించాలనుకున్న నగదు బదిలీకి సంబంధించి ఇటీవల లోక్ సభలో అడిగిన ప్రశ్నకి బదులిస్తూ నగదు బదిలీకి కేంద్ర వాటా కింద 1200 కోట్ల రూపాయలు కేటాయిస్తూ నిబంధనలు చేసామని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి అన్నారు. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాలు ఈ మేరకు విద్యార్థుల అకౌంట్లలోకి నగదు బదిలీ చేయాలని నిర్ణయించాయి.

చివరగా, కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేయడం లేదు. కరోనాతో మధ్యాహ్న భోజనం అందించలేని పరిస్థితుల్లో అలవెన్స్ అందించాలని నిర్ణయించింది.

Share.

About Author

Comments are closed.

scroll