Fake News, Telugu
 

తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తుందన్న వాదనలో నిజం లేదు

0

తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అన్ని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో కడుతూ మేమే కడుతున్నం అని తప్పుడు ప్రచారం చేసుకుంటుందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను నిర్మిస్తుంది.

ఫాక్ట్(నిజం):  తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని అనుసంధానిస్తూ  డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేస్తోంది. కాగా ఈ ఇళ్ళ నిర్మాణంలో కేంద్ర ఇచ్చే నిధుల వాటా కన్నా రాష్ట్ర ప్రభుత్వ నిధుల వాటానే ఎక్కువ. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో నిర్మించే ఒక్కో డబుల్ బెడ్ రూమ్ ఇంట్లో కేంద్ర ప్రభుత్వ వాటా 1.5 లక్షల రూపాయలు కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా 3.8లక్షల రూపాయలు. ఇదే క్రమంలో హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్న ఇళ్ళకు కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై ద్వారా 1 లక్షా 50 వేలు అందిస్తుండగా, గ్రామీణ ప్రాంతాలలో నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించి ఒక్కో ఇంటికి 72 వేలు కేంద్రం అందిస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు దోవ పట్టించే విధంగా ఉంది.

పేదలకు 100% సబ్సిడీతో ఇళ్ళు అందించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం 2015లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని రూపొందించింది. ఈ పథకానికి డిగ్నిటీ హౌసింగ్ అని పేరు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. రెండు పడక గదులు, హాల్, వంటగది మరియు రెండు టాయిలెట్లతో ఈ ఇళ్ళు నిర్మిస్తున్నారు. ఇలా మొత్తం 2.8 లక్షల ఇళ్ళు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో 5 లక్షల 30వేల  రూపాయలతో ఒక్కో ఇంటిని నిర్మిస్తుండగా, గ్రామీణ ప్రాంతాలలో ఒక్కో ఇంటికి 5 లక్షల 4వేల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఒక్కోక్క ఇంటిని 8,65,000 వ్యయంతో నిర్మిస్తున్నారు.

ఈ ఇళ్ళ నిర్మాణంలో రాష్ట్ర వాటానే ఎక్కువ:

ఐతే ఈ ఇళ్ళ నిర్మాణ ఖర్చు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వమే భరించడం లేదు, ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంది. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని అనుసంధానిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ ఇళ్ళ నిర్మాణాన్ని చేపట్టింది.

మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ సమాచారం ప్రకారం రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో నిర్మించే ఒక్కో డబుల్ బెడ్ రూమ్ ఇంట్లో కేంద్ర ప్రభుత్వ వాటా 1.5 లక్షల రూపాయలు కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా 3.8లక్షల రూపాయలు. ఇదే క్రమంలో హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్న ఇళ్ళకు కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై ద్వారా 1 లక్షా 50 వేలు అందిస్తుండగా, గ్రామీణ ప్రాంతాలలో నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించి ఒక్కో ఇంటికి 72 వేలు కేంద్రం అందిస్తుంది. దీన్నిబట్టి ఈ ఇళ్ళ నిర్మాణం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో చేస్తున్నారని వైరల్ సోషల్ మీడియాలో చేస్తున్న వాదనలో నిజంలేదని స్పష్టమవుతుంది.

నిజానికి ఈ ఇళ్ళ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ వాటా కన్నా రాష్ట్ర ప్రభుత్వ వాటానే ఎక్కువ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇళ్ళ నిర్మాణం కోసం రాష్ట్ర బడ్జెట్‌లో జరిపిన కేటాయింపులు ఇక్కడ చూడొచ్చు. కాగా ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ ఇక్కడ మరియు వార్తా కథనాలు ఇక్కడ చూడొచ్చు.

ఇదిలా ఉండగా తెలంగాణ గృహ నిర్మాణ శాఖమంత్రి జులై 2023లో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ ఇళ్ళ నిర్మాణం కోసం ఇస్తామన్న వాటా ఇవ్వట్లేదని ఆరోపించారు’. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు 11 వేల 853 కోట్లు ఖర్చు చేసి 1,92,725 ఇండ్లు నిర్మించిందని ఆయన అన్నారు.

చివరగా, తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళలో కేంద్ర వాటా కన్నా రాష్ట్ర ప్రభుత్వ వాటానే ఎక్కువ.

Share.

About Author

Comments are closed.

scroll