Fake News, Telugu
 

క్యాన్సర్ విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి కాదు; క్యాన్సర్‌కు ప్రత్యామ్నాయ చికిత్సగా ఉపయోగించే Laetrile కెమికల్ కాంపౌండుని బి-17 విటమిన్‌ అంటారు

0

క్యాన్సర్ వ్యాధి కాదు కేవలం, బి-17 విటమిన్ లోపమని తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది.  కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ప్రొఫెస్సర్ నందితా డిసౌజా తన రీసర్చులో క్యాన్సర్ అనే పదం ఒక పెద్ద అబద్ధమని, ఇది కేవలం డాక్టర్లు తమ వ్యాపారం కోసం సృష్టించిన వ్యాధి అని కనుగొన్నట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు.  ‘World Without Cancer’ అనే పుస్తకంలో కూడా క్యాన్సర్ బి-17 విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి అని పేర్కొన్నట్టు పోస్టులో తెలుపుతున్నారు. బి-17 విటమిన్ పెంపొందించే నేరేడు కాయలు, క్రాన్బెరి/ఆపిల్ సీడ్స్, ఎండు ద్రాక్ష, బాదాం పప్పు మొదలగు పదార్ధాలని తినడం వల్ల క్యాన్సర్ వ్యాధి తగ్గిపోతుందని పోస్టులో తెలుపుతున్నారు. Dr. హారొల్ద్ W.మన్నెర్ తన ‘డెత్ అఫ్ క్యాన్సర్’ పుస్తకంలో క్యాన్సర్ వ్యాధిని ఈ చికిత్సతో 90 శాతం వరకు నయం చేసారని వివరించారు. అంతేకాదు, క్యాన్సర్ రావడానికి కొన్ని ముఖ్య కారణాలని ఈ పోస్టులో తెలిపారు. వంట సామాగ్రిని, వాష్ బేసిన్ అలాగే, టాయిలెట్స్ శుభ్రపరచడానికి ఉపయోగించే రసాయనాలని పీల్చడం ద్వార క్యాన్సర్ సోకుతుందని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: క్యాన్సర్ ఒక వ్యాధి కాదు కేవలం, బి 17 విటమిన్ లోపం వలన కలిగే వ్యాధి.

ఫాక్ట్ (నిజం): శరీరంలో కణాలు నియంత్రణ లేకుండా పెరుగుతూ ఇతర అవయవాలకు వ్యాపించే వ్యాధులను క్యాన్సర్‌గా పరిగణిస్తారు. క్యాన్సర్ విటమిన్ లోపం వలన వచ్చే వ్యాధి కాదు. క్యాన్సర్‌కు ప్రత్యామ్నాయ చికిత్సగా ఉపయోగించే Laetrile లేదా Amygdalin కెమికల్ కాంపౌండుని బి-17 విటమిన్ అని పిలుస్తారు. ఇది సహజ విటమిన్ రకాలలో ఒకటి కాదు. సైనైడ్ విడుదల చేసే ఈ Laetrile కెమికల్ కాంపౌండుని అధిక శాతంలో తీసుకోవడం వలన క్యాన్సర్ తగ్గకపోవడమే కాకుండా శరీరం విషపురితమై రోగి చనిపోయే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. క్యాన్సర్ వ్యాధి విటమిన్ లోపం వలన కలుగుతుందని ICR రిటైర్డ్ ప్రొఫెస్సర్ నందితా డిసౌజా ఎప్పుడూ, ఎక్కడా ప్రకటించలేదు. నందితా డిసౌజా, క్యాన్సర్ వ్యాధిని స్పష్టంగా గుర్తించగలిగే ఇమేజ్ ఫంక్షనింగ్ అలాగే, ఇండోకావిటరి MRI టెక్నాలజీలపై రీసెర్చ్ వర్క్ చేసినట్టు తెలిసింది. నందితా డిసౌజా తన ప్రొఫెషనల్ కెరియర్‌లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఎప్పుడూ పనిచేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది. 

పోస్టులో తెలిపిన ప్రొఫెసర్ నందితా డిసౌజాకు సంబంధించిన వివరాల కోసం గుగూల్‌లో వెతికితే, నందితా డిసౌజా ‘ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్’ (ICR) మరియు ‘ది రాయల్ మార్స్‌డెన్’ సంస్థలలో లీడ్ అకాడమిక్ రేడియోలాజిస్టుగా పనిచేసి 2020లో రిటైర్ అయినట్టు తెలిసింది. నందితా డిసౌజా, ‘ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్’లో క్యాన్సర్ రీసెర్చ్ యూకే ఇమేజింగ్ సెంటర్‌కు కో-డైరెక్టర్‌గా పనిచేసినట్టు తెలిసింది. నందితా డిసౌజా తన ప్రొఫెషనల్ కెరియర్‌లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా ఎప్పుడూ పనిచేయలేదు.

నందితా డిసౌజా ట్రాన్స్‌లెషనల్ ఇమేజింగ్ అనే సబ్జెక్టులో ప్రొఫెసర్‌గా పనిచేసినట్టు ‘ది రాయల్ మార్స్‌డెన్’ తమ వెబ్సైటులో తెలిసింది. మనుషల వ్యాధులను త్వరగా నిర్ధారించే మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI), PET, అల్ట్రా స్కానింగ్ మొదలగు టెస్టులకు సంబంధించిన విషయాలని ఈ ట్రాన్స్‌లెషనల్ ఇమేజింగ్ సుబ్జేక్టులో తెలుపుతారు. నందితా డిసౌజా, క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ కోసం చేసే ఇమేజ్ టెస్టింగులలో ఒకటైన MRI స్కానింగ్ అలాగే, రోబోటిక్ పరికరాలని ఉపయోగించి బయోప్సీ టెస్టుల విధానాలకు సంబంధించి రీసెర్చ్ వర్క్ చేసినట్టు తెలిసింది. క్యాన్సర్ వ్యాధి కేవలం బి-17 అనే విటమిన్ లోపం వలన కలుగుతుందని నందితా డిసౌజా ప్రకటించినట్టు ఇంటర్నెట్లో ఎటువంటి న్యూస్ రిపోర్ట్స్ దొరకలేదు.

శరీరంలో కణాలు నియంత్రణ లేకుండా పెరుగుతూ ఇతర అవయవాలకు వ్యాపించే వ్యాధులను క్యాన్సర్‌గా పరిగణిస్తారు. శరీరంలోని సహజ కణాలు ట్యూమర్ కణాలుగా మారే విధానాన్ని క్యాన్సర్ అంటారు. ఇది శరీరంలోని ఏదైనా భాగాన్ని ప్రభావితం చేసే వ్యాధుల యొక్క పెద్ద కుటుంబం. అధికంగా పొగతాగడం, అధిక బాడీ మాస్ ఇండెక్స్ కలిగి ఉండటం, అల్ట్రావైయోలెంట్ మరియు ఐయోనైజింగ్ రేడియేషన్లకు ఎక్స్‌పోస్ అవ్వడం, అనారోగ్యమైన ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం అలాగే, కొన్ని వైరస్, బాక్టీరియా ఇన్ఫెక్షన్ల ప్రభావం వలన క్యాన్సర్ భారిన పడే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ వెబ్సైటులో తెలిపింది.

క్యాన్సర్‌ని త్వరగా నిర్ధారించి (డయోగ్నైస్) సరైన చికిత్స పొందడం ద్వారా వ్యాధి తక్కువ అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయని WHO తమ వెబ్సైటులో తెలిపింది. క్యాన్సర్ చికిత్సలో భాగంగా డాక్టర్లు సాధారణంగా రేడియోథెరపీ, కీమోథెరపీ లేదా శస్త్రచికిత్స చేస్తారని WHO స్పష్టం చేసింది.  క్యాన్సర్ విటమిన్ లోపం వలన కలిగే వ్యాధి అని, ఈ వ్యాధి Laetrile లేదా Amygdalin కెమికల్ కంపౌండుని పెంపొందించే  పదార్ధాలని తినడం వల్ల తగ్గిపోతుందని WHO ఎక్కడా పేర్కొనలేదు. క్యాన్సర్ నిర్ధారణ కోసం చేసే పరిక్షలకు సంబంధించిన పూర్తి వివరాలని ఇక్కడ చూడవచ్చు.

ఇకపోతే, పోస్టులో తెలుపుతున్న బి-17 విటమిన్‌, క్యాన్సర్‌కు ప్రత్యామ్నాయ చికిత్సగా ఉపయోగించే Laetrile లేదా Amygdalin కెమికల్ కాంపౌండుకి ప్రత్యామ్నాయ పేరని తెలిసింది. ఆప్రికాట్ కర్నేల్స్, రా నట్స్, లిమా బీన్స్ పదార్ధాలలో కలిగివుండే ఈ Laetrile కాంపౌండ్, శరీరంలో సైనైడ్‌ను విడుదల చేసి క్యాన్సర్ కణాలని చంపుతుందని WHO తెలిపింది. అయితే, ఈ Laetrile కాంపౌండ్ విడుదల చేసే సైనైడ్‌, ట్యుమర్ కణాలనే కాకుండా సహజ కణాలని కూడా చంపివేసే అవకాశాలున్నట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ చికిత్స పద్ధతి ద్వారా క్యాన్సర్ పూర్తిగా తగ్గుతుందని చెప్పడానికి ఎటువంటి ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు లేవని పలు ఆరోగ్య సంస్థలు రిపోర్ట్ చేసాయి.

Laetrile కెమికల్ కంపౌండుకి ప్రత్యామ్నాయ పేరైన బి-17 విటమిన్‌ను ‘అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ విటమిన్స్’ లేదా మరే ఒక ఆరోగ్య సంస్థ సహజ విటమిన్‌ రకంగా గుర్తించలేదు. Laetrile సహజ విటమిన్ కాదని, సైనైడ్ విడుదల చేసే ఈ Laetrile కెమికల్ కాంపౌండుని అధిక శాతంలో తీసుకోవడం వలన క్యాన్సర్ తగ్గకపోవడమే కాకుండా శరీరం విషపురితమై రోగి చనిపోయే అవకాశాలున్నట్టు ఆస్ట్రేలియా క్యాన్సర్ కౌన్సిల్ సంస్థ తమ వెబ్సైటులో స్పష్టం చేసింది. Laetrile కాంపౌండు ప్రతిపాదన చేస్తూ పబ్లిష్ చేసిన ‘World Without Cancer’ పుస్తకంలోని సమాచారం ప్రజలని తప్పుదోవ పట్టించేలా ఉందని ‘Snopes’ సంస్థ 2017లో ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఈ వివరాల ఆధారంగా క్యాన్సర్ బి-17 విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.  

వంట సామగ్రిలను, టాయిలెట్లు శుభ్రపరిచే రసాయన పరికరాల వలన క్యాన్సర్ బారిన పడే అవకాశాలున్నాయని పలు ఆరోగ్య వెబ్సైటులలో పేర్కొన్నారు. గృహావసర వస్తువులని శుభ్రపరచడానికి ఉపయోగించే బ్లీచింగ్ రసాయనాన్ని అమోనియా కలిగి ఉన్న పాత్రలను కడగడానికి ఉపయోగించినప్పుడు, ఊపిరితిత్తుల చికాకు కలిగించే విష వాయువుని విడుదల అవుతుందని, దీని వల్ల ఉపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడి చనిపోయే అవకాశాలున్నట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి.

చివరగా, క్యాన్సర్ విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి కాదు; క్యాన్సర్‌కు ప్రత్యామ్నాయ చికిత్సగా ఉపయోగించే Laetrile లేదా Amygdalin కెమికల్ కాంపౌండుని బి-17 విటమిన్‌ అంటారు; ఇది సాధారణ విటమిన్ రకం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll