Fake News, Telugu
 

అందరికీ ఓటు హక్కు కల్పించాలని గాంధీ, నెహ్రూలు కూడా ముందు నుండే వాదించారు

0

ఓటు హక్కు ఎలా వచ్చిందో చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఓటు హక్కుకు కేవలం పన్నులు చెల్లించినవారికి, డిగ్రీ చదివిన వారికి, రాజ కుటుంబాలకు మాత్రమే ఉండాలని గాంధీ, నెహ్రూ, వల్లభాయి పటేల్ ఒక్కొకరు ఒక్కొక్క ప్రతిపాదన చేయగా, కేవలం అంబేడ్కర్‌ మాత్రమే 18 సంవత్సరాలు నిండిన వయోజనులందరికీ ఓటు హక్కు ఉండాలని ప్రతిపాదించాడని ఈ పోస్టులో చెప్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా పోస్టులో చెప్తున్నదానికి సంబంధించి ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: గాంధీ, నెహ్రూ, వల్లభాయి పటేల్ కేవలం కొందరికే ఓటు హక్కు ఉండాలని ప్రతిపాదించగా, కేవలం అంబేడ్కర్‌ మాత్రమే అందరికీ ఓటు హక్కు ఉండాలని ప్రతిపాదించాడు.

ఫాక్ట్(నిజం): రాజ్యాంగంలో మొదట కేవలం 21 సంవత్సరాలు నిండిన వయోజనులందరికీ ఓటు హక్కు కల్పించారు. ఆ తర్వాత 1989లో ఈ కనీస వయసుని 18కు తగ్గిస్తూ రాజ్యంగ సవరణ చేసారు. ఐతే పోస్టులో చెప్తున్నట్టు అంబేడ్కర్‌ అందరకి ఓటు హక్కు కల్పిస్తూ రాజ్యాంగంలో పేర్కొన్నప్పటికీ, ఈ అంశానికి గాంధీ, నెహ్రు, పటేల్ ముందు నుండే మద్దతిచారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేక సార్లు ఈ అంశంపై తీర్మానించింది. 1928లో రూపొందించిన ముసాయిదా రాజ్యాంగంలో ఈ అంశాన్ని పేర్కొన్నారు. అలాగే పటేల్ అధ్యక్షత వహించిన 1931 కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ రూపొందించిన ప్రాధమిక హక్కుల ముసాయిదాలో కూడా అందరికీ ఓటు హక్కు కల్పించే అంశాన్ని పేర్కొన్నారు. అలాగే గాంధీ కూడా ఈ అంశాన్ని ముందు నుండే ప్రస్తావించాడు. గాంధీ రాసిన యంగ్ ఇండియా పుస్తకంలో దీని గురించి పేర్కొన్నాడు. కాబట్టి కేవలం అంబేడ్కర్‌ మాత్రమే ఈ అంశాన్ని ప్రస్తావించాడనడం కరెక్ట్ కాదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

భారత రాజ్యంగ సభ అనేక చర్చల అనంతరం 26 నవంబర్ 1949న భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది, 26 జనవరి 1950 నుండి అందుబాటులోకి వచ్చింది. ఈ రాజ్యాంగంలో 21 సంవత్సరాలు నిండిన వయోజనులందరికీ ఓటు హక్కు కల్పిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 326ను ఏర్పాటు చేసారు. ఐతే పోస్టులో చెప్తున్నట్టు 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు అనేది ముందు నుండి లేదు. ఆ తర్వాత 1989లో ఓటు హక్కుకు కావలసిన కనీస వయసును 18కు తగ్గిస్తూ రాజ్యాంగ సవరణ చేసారు.

ఐతే రాజ్యాంగం రూపొందించే సమయంలో జరిగిన చర్చల్లో అందరికి ఓటు హక్కు కల్పించే విషయానికి సంబంధించి జరిగిన చర్చల్లో కొందరు దీనిని వ్యతిరేకించినా, మెజారిటీ సభ్యులు దీనికి అంగీకరించడంతో ఈ అంశాన్ని రాజ్యాంగంలో చేర్చారు. ఐతే ఈ చర్చల సందర్భంలో కేవలం రాజు కుటుంబాలకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని నెహ్రూగాని లేక కేవలం డిగ్రీ చదివిన వారికి మాత్రమే ఓటు హక్కు ఉండాలని సర్దార్ పటేల్ వాదించలేదు. వీరిద్దరూ అందరికి వోటు హక్కు కల్పించే అంశానికి మద్దతునిచ్చారు.

అందరికీ ఓటు హక్కు అన్న డిమాండ్ రాజ్యాంగం రూపొందించే సమయం కన్నా ముందు నుండే ఉంది. స్వాతంత్రోద్యమం సమయంలో 1928లో రాజ్యాంగ సంస్కరణల కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైమన్ కమిషన్‌కు నిరసనగా, మోతీలాల్ నెహ్రూ నేతృత్వంలోని ఒక కమిటీ ఒక ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించింది. ఈ కమిటీ సెక్రటరీగా జవహర్‌లాల్ నెహ్రూ వ్యవహరించారు. ఈ కమిటీ రూపొందించిన ముసాయిదా రాజ్యాంగంలో అందరికీ ఓటు హక్కు ఉండాలని ప్రతిపాదించింది.

ఆ తరవాత 1931లో కరాచీలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సర్దార్ పటేల్ నేతృత్వం వహించారు. ఈ సమావేశంలో ప్రాథమిక హక్కులు మరియు ఆర్థిక విధానంపై కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ ముసాయిదా తీర్మానాన్ని జవహర్‌లాల్ నెహ్రూ  రూపొందించారు. ఐతే ముసాయిదా తీర్మానంలో పేర్కొన్న ప్రాధమిక హక్కులలో కూడా అందరికి ఓటు హక్కు ఉండాలన్నది ఉంది.

పోస్టులో చెప్తున్నదానికి వ్యతిరేకంగా గాంధీ కూడా అందరికీ ఓటు హక్కు ఉండాలని ముందు నుండి ప్రచారం చేస్తున్నారు. 1927-28 మధ్య కాలంలో ఆయన రాసిన యంగ్ ఇండియా అనే పుస్తకంలో దీని గురించి రాసారు. అందరికీ ఓటు హక్కుకు సంబంధించి గాంధీ ఈ పుస్తకంలో రాసిన కొన్ని వ్యాఖ్యలు కింద చూడొచ్చు.

పైన తెలిపిన సమాచారం ప్రకారం గాంధీ, నెహ్రూ లేదా పటేల్ ఎవరు కూడా అందరికీ ఓటు హక్కు అన్న అంశానికి వ్యతిరేకంగా లేరని స్పష్టమవుతుంది. స్వాతంత్రోద్యమం సమయంలో కేవలం కొందరికి మాత్రమే వోటు హక్కు అందుబాటులో ఉన్నప్పటికీ, అప్పటినుండే అందరికీ ఓటు హక్కు ఉండాలన్న డిమాండ్ ఉంది.  గాంధీ, నెహ్రూ లాంటి వారు ఈ అంశాన్ని అనేక సందర్భాలలో ప్రస్తావించారు.

చివరగా, అందరికీ ఓటు హక్కు కల్పించాలని గాంధీ, నెహ్రూలు కూడా ముందునుండే వాదించారు.

Share.

About Author

Comments are closed.

scroll