Fake News, Telugu
 

బీహార్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిద్రపోయే పాత దృశ్యాలను, తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అంటూ షేర్ చేస్తున్నారు

0

క్లాస్ రూముల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల ముందు నిద్రపోతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ దృశ్యాలు, తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు అని,  విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వానికి తెలిసేలా దీన్ని ప్రతి ఒక్కరూ షేర్ చెయ్యాలి అంటూ పోస్టులో తెలిపారు. ఇందులో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలలో ఉపాధ్యాయులు తమ క్లాసుల్లో నిద్రపోతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఇవి  తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లోని దృశ్యాలు కాదు. ఈ ఫొటోలు  బీహార్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులవి. కావున, పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

మొదటి ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, ఈ దృశ్యం 2018లో బీహార్ రాష్ట్రంలోని ఒక పాఠశాలకు సంబంధించింది అని పలు వార్త పత్రికలు ప్రచురించాయి (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ).

ఈ ఫొటోలో ఉన్నది బీహార్ రాష్ట్రం సుఫౌల్ జిల్లాలోని ఛతాపూర్‌ బ్లాక్‌లో, మహదీపూర్‌ ఉర్దూ మీడియం పాఠశాలలో పాధ్యాయుడు అశోక్ కుమార్ యాదవ్ అని తెలిసింది. అసిస్టెంట్ టీచర్‌గా నియమితులైన అశోక్ కుమార్ యాదవ్ విద్యార్థినుల ముందు క్లాస్ టేబుల్‌పై కాళ్లు చాపి నిద్రిస్తున్నాడు. తన ప్రవర్తన మార్చుకోవాలని అశోక్‌ను పలుమార్లు ప్రధానోపాధ్యాయుడు కోరినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటన తరువాత అశోక్‌కి ‘షోకాజ్’ నోటీసు అందింది.

మిగితా రెండు ఫోటోలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, వీటి గురించి సరైన ఆధారాలు దొరకనప్పటికీ, ఈ రెండు దృశ్యాలు కూడా బీహార్ రాష్ట్రంలోని పాఠశాలల్లోని దృశ్యాలు అని పలు పాత సోషల్ మీడియా పోస్టులు (ఇక్కడ మరియు ఇక్కడ) పేర్కొన్నాయి.

చివరిగా, బీహార్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు క్లాసుల్లో నిద్రపోయే కొన్ని పాత దృశ్యాలను, తెలంగాణ  ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll