కేంద్ర ప్రభుత్వం లేబర్ పాలసీ పథకం ద్వారా భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్స్ మొదలైన చిన్న చిన్న వృత్తులు చేసుకునేవారికి వివిధ ప్రయోజనాలు అందిస్తుందని చెప్తూ, ఈ పథకం ద్వారా లబ్దిదారులు పొందగలిగే కొన్ని ప్రయోజనాలు వివరిస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వం లేబర్ పాలసీ పథకం ద్వారా భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్స్ మొదలైన చిన్న చిన్న వృత్తులు చేసుకునేవారికి వివిధ ప్రయోజనాలు అందిస్తుంది.
ఫాక్ట్ (నిజం): భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్స్ మొదలైన చిన్న చిన్న వృత్తులు చేసుకునేవారికి ప్రయోజనం కలిగేలా కేంద్ర లేబర్ పాలసీ అనే పేరుతో ఎటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం లేదు. ఐతే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఒక బోర్డుని ఏర్పాటు చేసి ఈ బోర్డు ద్వారా కార్మికుల అనేక ప్రయోజనాలు అందిస్తున్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
పోస్టులో చెప్పిన పథకం గురించి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వెబ్సైటులో వెతకగా పోస్టులో చెప్పిన పేరుతోగాని, ఆ ప్రయోజనాలతోగాని ఎటువంటి పథకం లేదు. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా కార్మికుల కోసం కొన్ని పథకాలు అందుబాటులో ఉన్నా, పోస్టులో చెప్పిన వివరాలతో ఎటువంటి పథకం లేదు.
సాధారణంగా ప్రతీ రాష్ట్రం భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఒక బోర్డుని ఏర్పాటు చేసి ఈ బోర్డు ద్వారా కార్మికులకు అనేక ప్రయోజనాలు అందిస్తున్నాయి. ఉదాహరణకి తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన బోర్డు ద్వారా పోస్టులో చెప్పిన ప్రయోజనాల లాంటివే చాలా సంక్షేమ పథకాలు అందిస్తుంది. 54 వివిధ రకాల వృత్తుల చేసే కార్మికులు ఈ ప్రయోజనాలకు అర్హులు. మ్యారేజ్ గిఫ్ట్ కింద రూ. 30,000, మెటర్నిటీ బెనిఫిట్ కింద రూ. 30,000, పనిచేసే చోటగాని లేదా ఇంకా వేరే చోటగాని ప్రమాదవశాత్తు చనిపొతే రూ. 6,00,000 వారి కుటుంభానికి అందించడం, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ వంటి పలు సంక్షేమ పథకాలు అందిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన బోర్డు ద్వారా పోస్టులో చెప్పిన ప్రయోజనాల లాంటివే చాలా సంక్షేమ పథకాలు అందిస్తుంది. మ్యారేజ్ గిఫ్ట్ కింద రూ. 20,000, మెటర్నిటీ బెనిఫిట్ కింద రూ. 20,000, పనిచేసే చోటగాని లేదా ఇంకా వేరే చోటగాని ప్రమాదవశాత్తు చనిపొతే రూ. 5,00,000 వారి కుటుంభానికి అందించడం, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ వంటి పలు సంక్షేమ పథకాలు అందిస్తుంది. ఒడిషా ప్రభుత్వం కూడా కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన బోర్డు ద్వారా ఇలాంటివే ప్రయోజనాలు అందిస్తుంది.
ఇంతకు ముందు కూడా ఇవే ప్రయోజనాలోతో కూడిన పలు పథకాలు వివిధ పేర్లతో కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు FACTLY వాటిని డీబంక్ చేసిన ఆర్టికల్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
చివరగా, లేబర్ పాలసీ పేరుతో కార్మికుల కోసం ఇలువంటి పథకం కేంద్ర ప్రభుత్వ ప్రవేశ పెట్టలేదు.