Fake News, Telugu
 

కేవలం భారత దేశం మాత్రమే కాదు, అమెరికా, బ్రిటన్ కూడా ప్రజలకి కరోనా వాక్సిన్ని ఉచితంగా అందిస్తున్నాయి

0

కరోనా వాక్సిన్ ధర అమెరికాలో రూ. 5100, యూరోప్ లో రూ. 3000 కాగా భారత దేశంలో కరోనా వాక్సిన్ ని ఉచితంగా అందిస్తున్నారని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కరోనా వాక్సిన్ ధర అమెరికాలో రూ. 5100, యూరోప్ లో రూ. 3000 కాగా భారత దేశంలో కరోనా వాక్సిన్ ని ఉచితంగా అందిస్తున్నారు.

ఫాక్ట్ (నిజం): కేవలం భారత దేశమే కాకుండా అమెరికా, యురోపియన్ యూనియన్ సభ్య దేశాలు కూడా కరోన వాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సంస్థల వద్ద నుండి కొని ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

అమెరికా:

Centers for Disease Control and Prevention (CDC) ప్రకారం అమెరికాలో ప్రజలకి కరోనా వాక్సిన్ ని ఉచితంగా అందిస్తారని తెలిసింది. వాక్సిన్ సరఫరా చేస్తున్న కంపెనీలు అడ్మినిస్ట్రేషన్ ఛార్జ్ వసూలు చేస్తే, వాటిని భీమా కంపెనీల ద్వారా రీయింబర్స్‌ చేసుకోవచ్చని తెలుస్తుంది. కరోనాకి సంబంధించి మార్చ్ 2020 తీసుకొచ్చిన Coronavirus Aid, Relief and Economic Security (CARES) Act, కూడా ఇదే విషయం చెప్తుంది.

అమెరికాలోని కాలిఫోర్నియా, అలాస్కా, వాషింగ్టన్ మొదలైన రాష్ట్రాల ఆరోగ్య శాఖకి సంబంధించిన అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కూడా ఆయా రాష్ట్రాల్లో ప్రజలకు కరోనా వాక్సిన్ ని ఉచితంగా అందిస్తారని స్పష్టంగా ఉంది.

ఐతే వాక్సిన్ ని ఉత్పత్తి చేసే సంస్థలు మాత్రం అమెరికా ప్రభుత్వానికి ఉచితంగా అందిచట్లేదు. ఒక వార్తా కథనం ప్రకారం Oxford-AstraZeneca తయారు చేస్తున్న వాక్సిన్ ఒక డోస్ ధర 4 డాలర్లు కాగా, Moderna సంస్థ తయారు చేస్తున్న వాక్సిన్ ఒక డోస్ ధర 33 డాలర్లుగా ఉంది. ఐతే ఈ ధరలకి సంబంధించిన అధికారిక సమాచారం అందుబాటులో లేదు.

యూరోప్:

యురోపియన్ కమీషన్ వెబ్సైటులో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చాలా వరకు యురోపియన్ యూనియన్ సభ్య దేశాలు కరోనా వాక్సిన్ ని ప్రజలకు ఉచితంగా అందించనున్నాయి. యురోపియన్ యూనియన్ వివిధ సంస్థల ద్వారా వాక్సిన్ ఎంతకు కొంటున్నారన్న వివరాలకు సంబంధించిన వార్త కథనం ఇక్కడ చూడొచ్చు.

భారత్:

Oxford-AstraZeneca మరియు Bharat Biotech తయారు చేస్తున్న కరోనా వాక్సిన్ ని అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు అనుమతిస్తున్నట్టు Drug Controller General of India (DCGI) 02 జనవరి 2020న తెలిపారు. భారత ఆరోగ్య శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికి కరోనా వాక్సిన్ ఉచితంగా అందిస్తామని చెప్పారు. ఇంకా చాలా రాష్ట్రాలు కూడా ప్రజలకు వాక్సిన్ ని ఉచితంగా అందిస్తామని తెలిపాయి.

ఐతే  వాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థలు మాత్రం ప్రభుత్వానికి వాక్సిన్ ని ఉచితంగా అందిచట్లేదు, ప్రభుత్వం వీరిదగ్గరినుండి కొంటుంది. ఒక వార్తా కథనం ప్రకారం ప్రభుత్వం Oxford-AstraZeneca తో వాక్సిన్ ధరలకి సంబంధించి ఒప్పందం చేసుకోవాల్సి ఉందని తెలిసింది. ఈ కథనం ప్రకారం Serum Institute of India ఉత్పత్తి చేస్తున్న  Oxford-AstraZeneca వాక్సిన్ ఒక్క డోస్ ధర రూ. 200గా ఉండొచ్చని తెలుస్తుంది. వేరొక వార్తా కథనం ప్రకారం భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న వాక్సిన్ ధర రూ. 350గా ఉండొచ్చని అంచనా, ఐతే భారత్ బయోటెక్ సంస్థ నుండి వాక్సిన్ ధరకి సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు.

చాలావరకు దేశాలు తమ దేశ ప్రజలకి కరోనా వాక్సిన్ అందించడానికి సన్నద్దమవుతున్న నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

చివరగా, అమెరికా, యురోపియన్ యూనియన్ లోని సభ్య దేశాలు కూడా తమ దేశ పౌరులకు కరోన వాక్సిన్ ని ఉచితంగా అందిస్తున్నాయి.

Share.

About Author

Comments are closed.

scroll