Fake News, Telugu
 

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లీడర్ కూతురు అక్కడి ఉప ఎన్నికల గురించి మాట్లాడిన వీడియోని బీహార్ ఎన్నికలకు ముడిపెడుతున్నారు

0

బీహార్ ఎన్నికల్లో జరిగిన మోసాలు ఒకొక్కటి బయటికి వస్తున్నాయంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బీహార్ ఎన్నికలలో జరుగుతున్న మోసాల గురించి ఒక మహిళ మాట్లాడుతున్న దృశ్యాలంటూ ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఇటివల జరిగిన బీహార్ ఎన్నికలలో NDA కూటమి గెలుపొందిన నేపథ్యంలో ఈ వీడియో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బీహార్ ఎన్నికలలో జరిగిన మోసాల గురించి ఒక మహిళ మాట్లాడుతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): వీడియోలో కనిపిస్తున్నది మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లీడర్ ప్రేమ్ చంద్ గుడ్డు కుమార్తె రష్మి బరోసి. ఇటివల మధ్యప్రదేశ్ లో జరిగిన ఉప ఎన్నికలలో మోసాలు జరిగినట్టు రష్మి బరోసి  ఈ వీడియోలో తెలుపుతున్నారు. ఈ వీడియోకి బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షోట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే వీడియోని షేర్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పెట్టిన ట్వీట్ దొరికింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ లో బీజేపీ చేసిన మోసాల గురించి తెలుపుతున్న వీడియో, అని తమ ట్వీట్ లో తెలిపారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లాలో జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ రిగ్గింగ్ కి పాల్పడినట్టు తమ ట్వీట్ లో కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

వీడియోని జాగ్రత్తగా గమనిస్తే, ఆ మహిళ తన పేరు రష్మి బరోసి అని తెలిపినట్టు తెలిసింది. ఈ వివరాల ఆధారంగా ఆ వీడియోకి సంబంధించి మరింత సమాచారం కోసం వెతికితే, వీడియోలో కనిపిస్తున్న ఘటనకు సంబంధించి ‘ANI’ న్యూస్ వెబ్ సైట్ పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. మధ్యప్రదేశ్ సాన్వర్ నగరంలో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ సరిగా లేదని కాంగ్రెస్ కార్యకర్తలు గొడవ పడటంతో, కౌంటింగ్ ఒక గంట సేపు నిలిపినట్టు ఆర్టికల్ లో తెలిపారు. ఉప ఎన్నికలలో జరుగుతున్న మోసాల గురించి కాంగ్రెస్ లీడర్ ప్రేమ్ చంద్ గుడ్డు కూతురు రష్మి బరోసి మీడియాతో మాట్లాడినట్టు అందులో తెలిపారు.

పోలీసులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా బీజేపీ కి సహకారం చేస్తున్నట్టు రష్మి బరోసి మీడియాతో తెలిపారు. సాన్వర్ ఉప ఎన్నికలలో బీజేపీ రిగ్గింగ్ కి పాల్పడినట్టు ఆమె మీడియాతో తెలుపుతున్నప్పుడు తీసినదే ఈ వీడియో. ఈ ఘటనకు సంబంధించి పబ్లిష్ చేసిన మరికొన్ని ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరగా, వీడియోలో మహిళా మాట్లాడుతున్నది మధ్యప్రదేశ్ లో జరిగిన ఉప ఎన్నికల గురించి, బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల గురించి కాదు.

Share.

About Author

Comments are closed.

scroll