Fake News, Telugu
 

ఖర్గే ఆస్తి వివరాలను ప్రధానమంత్రి మోదీ పార్లమెంటులో ప్రస్తావించారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు

0

ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, మాలాంటి  దళిత కుటుంబానికి కనీసం ఒక సెంటు భూమి ఇవ్వాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీని అడిగారని, దీనికి సమాధానంగా దేశంలో ఖర్గేకు ఉన్న వందల కోట్ల ఆస్తుల వివరాలను మోదీ బయట పెట్టడాని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం. ఇదే పోస్టుని ఇక్కడ మరియు ఇక్కడ కూడా చూడవచ్చు.

క్లెయిమ్: మల్లికార్జున ఖర్గేకు చెందిన వందల కోట్ల ఆక్రమ ఆస్తి వివరాలను ప్రధానమంత్రి మోదీ పార్లమెంటులో బయట పెట్టాడు.

ఫాక్ట్: కనీసం 2017 నుంచి వైరల్ అవుతున్న ఈ పోస్టులో ఉన్న వివరాల ఆధారంగా లోక్ సభ అధికారిక వెబ్‌సైటులో వెతకగా అసలు ఖర్గే ప్రధానిని ఇటువంటి ప్రశ్న అడగలేదని, మరియు మోదీ ఖర్గే ఆస్తుల వివరాల గురించి చర్చించలేదు అని రుజువైంది. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ముందుగా ఇదే పోస్టు సోషల్ మీడియాలో కనీసం 2017 నుంచి ప్రచారంలో ఉంది అని గుర్తించాం. 2014-19 మధ్యలో లోకసభలో మల్లికార్జున ఖర్గే నరేంద్ర మోదీకి ఇటువంటి ప్రశ్న వేశారా అని లోకసభ అధికారిక వెబ్‌సైటులో వెతకగా, ఎటువంటి రికార్డులు లభించలేదు. కాగా, 2020 రాజ్య సభ ఎన్నికల అఫిడవిట్ లో తన కుటుంబం ఆస్తి ₹20.12 కోట్లు, మరియు అప్పులు ₹23.75 లక్షలు అని ఖర్గే పేర్కొన్నారు.

ఇక వేరే ఏదైనా సందర్భంలో మోదీ ఈ వివరాలు చెప్పారా అని ఇదే వెబ్‌సైటులో సంబంధిత పదాలతో వెతకగా, వచ్చిన ఫలితాలలో ఎక్కడా కూడా మోదీ ఖర్గే ఆస్తుల వివరాల గురించి మాట్లాడినట్లు రికార్డులు లేవు.

అయితే, 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీ గుల్బర్గాలో ఒక సభలో మాట్లాడుతూ ఖర్గే కుటుంబ ఆస్తి ఎంతో చెప్పగలరా అని జనాలని ఉద్దేశించి అన్నారు. అయితే ఇక్కడ కూడా ఆస్తి వివరాల గురించి ఏమి చెప్పలేదు. మరియు ఖర్గే అక్రమంగా ₹50,000 కోట్ల ఆస్తి అక్రమంగా సంపాదించాడు అని 2014 రత్నాకర్ అనే వ్యక్తి లోకాయుక్తలో కంప్లయింట్ ఇవ్వగా, ఈ ఆరోపణల నిజ నిజాలు ఇప్పటికీ తేలలేదు. ఇదివరకే దీనికి సంబంధించి FACTLY రాసిన ఫాక్ట్ చెక్ ఆర్టికల్‌ను ఇక్కడ చూడవచ్చు. 2020 రాజ్య సభ ఎన్నికల అఫిడవిట్ లో తన కుటుంబం ఆస్తి ₹20.12 కోట్లు, మరియు అప్పులు ₹23.75 లక్షలు అని ఖర్గే పేర్కొన్నారు. మరిన్ని వివరాలను ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, మల్లికార్జున ఖర్గే ఆస్తి వివరాలను ప్రధానమంత్రి మోదీ పార్లమెంటులో ప్రస్తావించారు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll