Fake News, Telugu
 

DTH యాంటెన్నాల వల్ల గుండెపోటు వస్తుంది అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు

0

‘ DTH లు పెట్టుకున్నవారికి విజ్ఞప్తి, మీ ఇంటిపై గొడుగులు పెట్టుకొని టీవీలు చూస్తున్నప్పుడు ఆ గొడుగుల వల్ల వచ్చే రేడియేషన్ గుండె జబ్బులకు దారితీస్తుందని మీకు తెలుసా’ అని చెపుతున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులోని నిజానిజాలు ఏమిటో చూద్దాం.

క్లెయిమ్: DTH రిసీవర్ ఆంటెన్నాల నుండి వచ్చే రేడియేషన్ వల్ల గుండె జబ్బులు వస్తాయి.

ఫ్యాక్ట్ (నిజం): DTH యాంటెన్నా లేదా శాటిలైట్ డిష్ అనేది పాసివ్ రిసీవర్, దానంతట అది  రేడియేషన్‌ను ఉత్పత్తి చేయదు. డిష్ అనేది ఉపగ్రహం నుండి సంకేతాలను స్వీకరించే పరికరం. అంచేత రేడియో ఫ్రీక్వెన్సీ ఎక్స్పోజర్ గురించి ఆందోళన లేదు. ఎటువంటి రేడియేషన్ లేనప్పుడు అది వ్యాధులకు దారి తీసే అవకాశం లేదు కాబట్టి, ఈ పోస్టులో చెప్తున్నది తప్పు

DTH యాంటెన్నా

డైరెక్ట్ టు హోమ్ (DTH) యాంటెన్నా లేదా శాటిలైట్ డిష్ అనేది ఉపగ్రహం (satellite) నుండి సంకేతాలను స్వీకరించే పరికరం. ఇది మైక్రోవేవ్ సిగ్నల్‌లను స్వీకరించే పారాబొలిక్ యాంటెన్నాను కలిగి ఉంటుంది. శాటిలైట్ టి.వీ. కనెక్షన్ ఉన్నవారి ఇంటి పైన ఈ శాటిలైట్ డిష్‌ని బిగిస్తారు. శాటిలైట్ డిష్‌లో పారాబొలిక్ ఆకారపు యాంటెన్నా ఉంటుంది. ఇది ఉపగ్రహం నుండి స్వీకరించిన ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌గా మార్చుతుంది. ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వల్లనే టీ.వీ.లో చానెల్స్ వస్తాయి.

ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ రేడియేషన్

ఎలక్ట్రిక్ (విద్యుత్) మరియు మాగ్నెటిక్ (అయస్కాంత) ఫీల్డ్స్ ని  కలిపి విద్యుదయస్కాంత క్షేత్రాలు లేదా ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ EMFలుగా సూచిస్తారు. EMFలలోని ఎలక్ట్రిక్  మరియు మాగ్నెటిక్ ఫోర్సెస్ ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ (విద్యుదయస్కాంత వికిరణం) వల్ల కలుగుతాయి.

ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్స్ రెండు రకాలు

హై ఫ్రీక్వెన్సీ  ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్– ఇందులో ఎక్సరే (కిరణాలూ) మరియు గామా రేయ్స్ ఉన్నాయి. ఈ EMFలు ఎలక్ట్రో మాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో అయోనైజింగ్ రేడియేషన్ భాగంలో ఉంటాయి. ఇవి DNA లేదా కణాలను నేరుగా దెబ్బతీస్తాయి.

లో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్- తక్కువ నుండి మధ్య-ఫ్రీక్వెన్సీ EMFలు, వీటిలో స్టాటిక్ ఫీల్డ్‌లు (కాలానికి అనుగుణంగా మారని విద్యుత్ లేదా అయస్కాంత క్షేత్రాలు), విద్యుత్ పవర్ లైన్‌లు మరియు ఉపకరణాల నుండి అయస్కాంత క్షేత్రాలు, రేడియో తరంగాలు, మైక్రోవేవ్‌లు, ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్ మరియు కనిపించే కాంతి ఉంటాయి (విజిబుల్ లైట్). ఈ EMFలు ఎలక్ట్రోమాగ్నెటిక్  స్పెక్ట్రంలోని నాన్-అయోనైజింగ్ రేడియేషన్ భాగంలో ఉంటాయి మరియు DNA లేదా కణాలను నేరుగా దెబ్బతియ్యవు.

ఎలక్ట్రో మాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ని మీరు కింద చిత్రంలో చూడవచ్చు

శాటిలైట్  డిష్ వళ్ళ హార్ట్ ఎటాక్ వస్తుందా?

శాటిలైట్ డిష్ రేడియో వేవ్స్ ని స్వీకరిస్తుంది, రేడియో వేవ్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్  స్పెక్ట్రమ్ లోని నాన్-అయోనైజింగ్ రేడియేషన్ భాగంలో ఉంటాయి. అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిఇనిస్ట్రేషన్ (FDA) వారి ప్రకారం, నాన్-అయోనైజింగ్ రేడియేషన్ మనుషులలో ఎటువంటి హాని కలిగించదు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ఈ రోజు వరకు, రేడియో ఫ్రీక్వెన్సీ లేదా పవర్ ఫ్రీక్వెన్సీ ఫీల్డ్‌లకు తక్కువ స్థాయి, దీర్ఘకాలిక ఎక్స్పోజర్ కారణంగా ఎటువంటి ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు నిర్ధారించబడలేదు, అయితే శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో పరిశోధనను చురుకుగా కొనసాగిస్తున్నారు.

హెల్త్ ఫిజిక్స్ సొసైటీ ప్రకారం ‘టీవీ శాటిలైట్ డిష్ అనేది పాసివ్ పరికరం, అంటే, ఇది ఎటువంటి శక్తిని (ఎనర్జీని) విడుదల చేయదు. డిష్ అనేది ఉపగ్రహం నుండి సంకేతాలను స్వీకరించే పరికరం. అంచేత రేడియో ఫ్రీక్వెన్సీ ఎక్స్పోజర్ గురించి ఆందోళన లేదు.

టెక్ వాల్లా వెబ్సైటు ప్రకారం, శాటిలైట్ డిష్ అనేది పాసివ్ రిసీవర్, దానంతట అది  రేడియేషన్‌ను ఉత్పత్తి చేయదు. మీ శాటిలైట్  డిష్ చుట్టూ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్  మీ గదిలో  ఉన్న స్థాయిలోనే ఉంటుంది. వీటన్నిటి బట్టి శాటిలైట్ డిష్ ద్వారా మనకి రేడియేషన్ వల్ల కలిగే హానికరమైన ప్రభావం ఉండదు అని నిర్ధారించుకోవచ్చు. ఎటువంటి రేడియేషన్ లేనప్పుడు అది వ్యాధులకు దారి తీసే అవకాశం లేదు కాబ్బట్టి, ఈ పోస్టులో చెప్తున్నది తప్పు. 

శాటిలైట్ టీ.వి. డిష్ వల్ల ఏదైనా హాని ఉంటుందా అనే ప్రశ్నకు సంభందించిన కోరా థ్రెడ్ ని ఇక్కడ చదవచ్చు. రేడియో ఫ్రీక్వెన్సీ మరియు మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ మీద కొన్ని తరుచుగా అడిగే ప్రశ్నలు వాటి సమాధానాలు.  

చివరిగా, DTH యాంటెన్నాల వల్ల గుండెపోటు వస్తుంది అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll