Fake News, Telugu
 

వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంధించిన పత్రాలను భారత ప్రభుత్వానికి చూపించమని సుప్రీం కోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వలేదు

0

భారతదేశంలో వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్న ప్రతి భూమికి సంబంధించిన చెల్లుబాటు అయ్యే పత్రాలను భారత ప్రభుత్వానికి వక్ఫ్ బోర్డు చూపించాల్సిoదిగా సుప్రీం కోర్టు ఒక సంచలనాత్మక తీర్పులో ఆదేశించిందని చెప్తున్న ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం. ఇదే క్లెయింతో ఉన్న మరికొన్ని పోస్టులని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారతదేశంలో వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్న ప్రతి భూమికి సంబంధించిన చెల్లుబాటు అయ్యే పత్రాలను భారత ప్రభుత్వానికి చూపించాల్సిందిగా వక్ఫ్ బోర్డును ఆదేశిస్తూ సుప్రీం కోర్టు ఒక తీర్పు ఇచ్చింది.

ఫాక్ట్: సుప్రీం కోర్టు ఇటువంటి తీర్పు ఇచ్చినట్లు ఎక్కడా కూడా ఆధారాలు లేవు. ఇదే క్లెయిమ్ తో వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్న తీర్పుని బట్టి చూస్తే, ఇది రాజస్థాన్లో ఉన్న ఒక మైనింగ్ ప్రాంతంలో ఉన్న ఒక పాత గోడ మరియు చబుత్రకు చెందిన కేసు. వక్ఫ్ బోర్డు వారు ఇది తమకు చెందిన ఆస్తి అని కోర్టులో కేసు వేయగా, నిపుణుల కమిటీ రిపోర్ట్ ఆధారంగా, దీనికి ఎటువంటి చారిత్రక విశేషం లేదు అని, ఇక్కడ ప్రార్ధనలు చేశారు అనే ఆధారాలు లేవు అని, ప్రభుత్వ పాత భూరికార్డులో కూడా ఇది వక్ఫ్ భూమిగా లేదు అని సుప్రీం కోర్టు ఈ కేసుని కొట్టి వేసింది. ఈ కేసులో ఎక్కడా కూడా వక్ఫ్ బోర్డులని దేశంలో ఉన్న తమ ఆస్తులకు సంబంధించిన పత్రాలను భారత ప్రభుత్వానికి చూపించమని ఆదేశించలేదు. కావున, ఈ పోస్టు తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.    

ముందుగా సుప్రీం కోర్టు ఇటువంటి తీర్పు ఇచ్చినట్లు ఎక్కడా వార్తా కథనాలు లేవు. సుప్రీం కోర్టు వెబ్‌సైటులో మరియు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ వెబ్‌సైటులో కూడా కూడా ఆధారాలు లభించలేదు. ఇక ఇదే క్లెయింతో ఉన్న కొన్ని పోస్టులు 2022 మే నెల నుంచి వైరల్ అవుతున్నట్లు గుర్తించాం. ఈ పోస్టుల్లో సుప్రీం కోర్టు తీర్పు అని ఒక డాక్యుమెంట్ కూడా ఉంది. ఈ కేసు వివరాలు మరియు తీర్పును ఇప్పుడు చూద్దాం.

కేసు వివరాలు:
Petitioner (వాది): వక్ఫ్ బోర్డు, రాజస్థాన్
Respondent (ప్రతివాది): జిందాల్ సా లిమిటెడ్
కేసు రిజిస్టర్ చేసిన తేదీ: 06 అక్టోబర్ 2021

కేసులో పేర్కొన్న కారణం: రాజస్థాన్ ప్రభుత్వం బిల్వరా లోని 1556.78 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన భూమిని ‘జిందాల్ సా లిమిటెడ్’ అనే సంస్థకు మైనింగ్ రీత్యా డిసెంబర్ 2010లో లీజుకు ఇచ్చింది. అయితే ఈ భూమిలో ఒక పాత గోడ మరియు చబుత్ర (ప్లాట్ఫాం లాంటి కట్టడం) ఉంది. అయితే, ప్రభుత్వ సర్వే ప్రకారం అక్కడ కొండ పైన ఉన్న కలందారి మసీదు ఉన్న భూమి, వక్ఫ్ బోర్డుకు చెందిన ఆస్తి. అందువలన, అక్కడే ఉన్న ఈ పాత గోడ మరియు చబుత్ర  దగ్గర ఒకప్పుడు ముస్లిములు ప్రార్థన చేసుకునే వారు అని, అందువలన  అది వక్ఫ్ బోర్డుకు చెందిన ఆస్తి అని, వాటిని మైనింగ్ పేరుతో ధ్వంసం చేయకూడదు అని రాజస్థాన్ వక్ఫ్ బోర్డు వారు కోర్టులో కేసు వేశారు.

తీర్పు: ఈ కేసును పరిష్కరించడానికి కోర్టు ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీలో మైనింగ్, జియాలజీ, ఆర్కియాలజీ, సర్వేయింగ్ తదితర విభాగాలకు చెందిన సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం, ఈ గోడ మరియు చబుత్ర ఉన్న ప్రదేశానికి ఎటువంటి ప్రాచీన గుర్తింపు లేదు. మరియు ఇక్కడ  ప్రార్ధనలు చేసారని చెప్పటానికి ఎటువంటి ఆధారాలు లేవు. మరియు ప్రభుత్వ భూ రికార్డుల్లో ఎక్కడా కూడా ఇది వక్ఫ్ బోర్డు ఆస్తి అని లేదు. కావున, 1995 వక్ఫ్ చట్టం ప్రకారం దీనిని వక్ఫ్ ఆస్తిగా గుర్తించలేం అంటూ సుప్రీం కోర్టు ఈ కేసును కొట్టివేయడం జరిగింది.

ఇక ఇదే తరహాలో తెలంగాణలో కూడా, దర్గా హుస్సేన్ షా వలీకి సంబంధించిన భూమి కేసు తాజగా 2022లో తెలంగాణ ప్రభుత్వం గెలిచింది. ఆ భూమిపై తెలంగాణ ప్రభుత్వానికి హక్కు ఉందని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదవచ్చు. అంతే కాదు, 1995 వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40(3) ని దుర్వినియోగం చేస్తున్నారు అని, దాని రాజ్యాంగ చెల్లుబాటు (constitutional validity) ని ప్రశ్నిస్తూ  సుప్రీం కోర్టులో కేసు వేయడం జరిగింది.

చివరిగా, వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్న ప్రతి ఆస్తికి సంబంధించిన చెల్లుబాటు అయ్యే పత్రాలను భారత ప్రభుత్వానికి చూపాలని సుప్రీం కోర్టు ఎటువంటి తీర్పూ ఇవ్వలేదు.

Share.

About Author

Comments are closed.

scroll